చంద్రబాబు మాట వాలంటీర్లు నమ్ముతారా?
టీడీపీ, జనసేన ప్రభుత్వం వచ్చినా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని వాలంటీర్లకు భరోసా కల్పించిన చంద్రబాబు. చంద్రబాబును వాలంటీర్లు నమ్ముతారా...
By : The Federal
Update: 2024-03-05 12:44 GMT
షణ్ముఖ పోచరాజు
ఎన్నికలప్పుడు రాజకీయ నాయకుల నాలుకలకు మడతలుండవన్నది మోటు సామెత. అవసరమైతే గొంగళిపురుగునైనా ముద్దు పెట్టుకుంటానంటుంటారు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే ఉంది. నిన్నటి దాకా పనికి రాదని చెప్పిన వ్యవస్థనే ఇప్పుడు కౌగిలించుకుంటానంటున్నారు. 2019లో ఇచ్చిన హామీ మేరకు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటవుతూనే సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రామీణ వాలంటీర్ల వ్యవస్థను తెచ్చారు. ప్రభుత్వ పథకాలను గడప గడపకు తీసుకెళ్లేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒకరి చొప్పున గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించారు. ఈ వ్యవస్థ ద్వారా సుమారు రెండు లక్షల మందికి పైగా వాలంటీర్లు ప్రభుత్వ సంక్షేమపథకాలను అందిస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శతో మొదలైన ఆరోపణలు ఇటీవలి కాలంలో ఎక్కువైయ్యాయి. తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. వాలంటీర్లు అందరూ అధికార పార్టీకి ఓ ప్రైవేటు సైన్యంలా పనిచేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆంధ్రాలోని మహిళలు కనిపించకుండా పోవడంలో వాలంటీర్ల హస్తం ఉందన్న జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఈ ఆరోపణల్లో భాగమే. ఆయన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఇప్పటికి కూడా ఆ వివాదం చల్లారలేదు. ఇదిలా ఉండగా మరోసారి రాష్ట్రంలో ఎన్నికల హడావిడి జోరందుకుంది. దీంతో ఈ సారి ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏమవుతుందో అని వాలంటీర్లలో సైతం భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వాలంటీర్లను తమ వైపు తిప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు ఓ కీలక ప్రకటన చేశారు. అయితే ఇది ఎన్నికల ఎత్తుగడలో భాగమేనని తెలుస్తోంది.
వాలంటీర్లకు చంద్రబాబు అభయం...
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ ప్రచారాలను ఉరకలెత్తిస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ దూకుడు చూపిస్తున్నాయి. ఇందులో భాగంగానే పెనుకొండలో జరిగిన టీడీపీ-జనసేన పార్టీ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ వాలంటీర్లకు అభయం ఇచ్చారు. ఇన్నాళ్లూ వాలంటీర్లు ప్రవేటు స్పైలుగా పనిచేస్తూ ప్రజల డేటాను ప్రభుత్వానికి చేరవేస్తున్నారంటూ విరుచుకుపడ్డ చంద్రబాబు ఎన్నికలు దగ్గరపడటంతో ప్లేటు పిరాయించేశారు.
తమ కూటమి అధికారంలోకి వస్తే తొలగిస్తామన్న భయం వాలంటీర్లకు అక్కర్లేదని భరోసా కల్పించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న వాలంటీర్ వ్యవస్థను తమ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని, వాలంటీర్లకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ‘‘ఒక్క వాలంటీర్‌ను కూడా ఉద్యోగం నుంచి తొలగించం. ప్రజలకు ఇన్నాళ్లూ సేవ చేసిన వాలంటీర్లకు న్యాయం చేస్తాం. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ భయంతో వైసీపీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు’’ అని హామీ ఇచ్చారు.
ఇదంతా బాబు పొలిటికల్ స్ట్రాటజీనా!
ఇన్నాళ్లూ వాలంటీర్లను ఆడిపోసుకున్న చంద్రబాబు ఒక్కసారిగా తన రూట్ మార్చడంపై విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థను తమవైపు తిప్పుకోవడానికే చంద్రబాబు ఈ హామీలు ఇస్తున్నారనడంలో సందేహం లేదు. టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తే తమకు ఎక్కడ అన్యాయం జరుగుతుందోనని వాలంటీర్లు వైసీపీకే ఓటేస్తారేమో అన్న ఆలోచనతోనే చంద్రబాబు ఇప్పుడు ఈ నాటకాలు ఆడుతున్నారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ‘చంద్రబాబు ఎన్ని చెప్పినా వాలంటీర్లు నమ్మే పరిస్థితిలో లేరు.
ఇచ్చిన హామీలను తుంగలో తొక్కే వాళ్లలో ప్రధముడు చంద్రబాబు. చంద్రబాబు ఇంటికి కిలో బంగారం ఇస్తామన్నా బాబును జనం ఎలా నమ్మరో ఈ వాలంటీర్లూ అంతేనన్నారు’ మరో మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు ఇస్తున్న హామీల తీరు గాలికి పోయే పేలపిండని తేలిగ్గా కొట్టిపారవేశారు ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు. మంత్రులు, మాజీ మంత్రుల వ్యాఖల దుమారం మధ్యనే చంద్రబాబు మాత్రం తన మాట నమ్మండి, కచ్చితంగా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తానని పునరుద్ఘాటిస్తున్నారు.