ఈ కోటికి ఓట్లొస్తాయా! ఆ వాలంటీర్లపై వేటేస్తారా మీనా సాబ్ !!

రూ.50వేలకు మించి క్యాష్ క్యారీ చేయకూడదు, పది వేల రూపాయల విలువైన వస్తువుల్ని మాత్రమే తీసుకెళ్లాలి. ఇంకో వారం రోజుల్లో ఇలాంటివెన్నో రానున్నాయి.. ఎన్నికలు కదా..

Update: 2024-03-08 02:27 GMT
ఏపీ ఎన్నికల సంఘం అధికారి ఎంకే మీనా

పార్లమెంటు ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేసే అభ్యర్థి ఎక్కువలో ఎక్కువంటే రూ.95 లక్షలు ఖర్చు పెట్టి గెలవాలి. అదే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి అయితే రూ.40 లక్షలు. ఈ మొత్తంతోనే అభ్యర్థి ప్రచారం, మీటింగులు, జెండాలు, హోర్డింగులు, పెయింటింగులు, బ్యానర్లు, గోడ మీద రాతలు, కార్లు, కార్యకర్తలకు భోజనాలు, ఓట్ల పండగనాడు ఆటోలు, స్కూటర్లు, బ్యాడ్జీలు, ఆ తర్వాత తెర వెనుక జరిగే అనేకానేక పనులకు ఈ డబ్బే సరిపెట్టాలి. పైగా ఏ రోజుకు ఆరోజు లెక్కచెప్పాలి. నిజానికి ఇదంతా అయ్యే పనేనా, ఇవాళ్టి పరిస్థితుల్లో ఈ డబ్బుతోనే ఎన్నికలు పూర్తయ్యేటట్టుంటే సీటు కోట్లు డిపాజిట్లు చేయమని పార్టీ నాయకత్వాలు ఎందుకు కోరుతున్నాయి. ఇవేవీ పట్టించుకోకుండా రూ.40 లక్షల్లోనే అభ్యర్థి ఎన్నికల ప్రచారం పూర్తి కావాలంటే ఎలా అనే రుసరుసలు చాలా కాలంగా ఎన్నికల సంఘం ముందున్నవే. అయినా సరే ఈ పబ్లిక్ లై అంటే కళ్లెదుట కనబడే ఈ అబద్ధాన్ని నిజం చేయాలని ఎన్నికల సంఘం ఎన్నికలకు ముందు మీటింగ్ పెట్టి అన్ని పార్టీలకు ఆదేశాలు ఇస్తుంటుంది. ఇప్పుడు ఏపీలోనూ అదే జరిగింది. నిన్న ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా మీటింగ్ పెట్టి ఏమేమి చేయవచ్చో, ఏమి చేయకూడదో బోధ పరిచారు.

ఎన్నికల సమయంలో ఏమి చేయాలంటే...

ఎన్నికల్లో పోటీలో ఉండే అభ్యర్థులు, వారి ఏజెంట్లు, రాజకీయ పార్టీల కార్యకర్తలు రూ.50 వేలకు మించి నగదు, రూ.10 వేల కంటే ఎక్కువ విలువైన వస్తువులను రవాణా చేయటం నిషిద్ధం. పార్టీల స్టార్‌ క్యాంపెయినర్లు రూ.లక్షకు మించి నగదు కలిగి ఉండకూడదు. పరిమితికి మించి నగదు రవాణా చేస్తున్న వాహనాలను కూడా ఆ నగదుతోపాటే సీజ్‌ చేస్తారు.

కులం, మతం, భాష ప్రాతిపదికన ఓటర్లను ప్రేరేపించటం, ఓట్లు అడగటం నిషిద్ధం. ‘లోక్‌సభ అభ్యర్థులు రూ.95 లక్షల వరకు, శాసనసభ అభ్యర్థులు రూ.40 లక్షల వరకు ఖర్చు చేసేందుకు అనుమతి ఉంది. బహిరంగ సభల నిర్వహణ, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాల కోసమే ఈ మొత్తాన్ని వెచ్చించాలి. ఓటర్లను ప్రభావితం చేసేలా నగదు, కానుకలు, మద్యం, ఇతర వస్తువులు పంపిణీ చేయటాన్ని చట్టవిరుద్ధమైన వ్యయం. ఎన్నికల వ్యయం కోసం అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా, రోజువారీ ఖర్చుల రిజిస్టర్‌ నిర్వహించాలి. పార్టీలు, అభ్యర్థులు చేసే ఎన్నికల వ్యయంపై పూర్తిస్థాయిలో నిఘా ఉంటుంది.

అభ్యర్థితో కలిపి అయిదుగురికే అనుమతి

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు రూ.25 వేలు, శాసనసభకు పోటీ చేసేవారు రూ.10 వేలు.. నగదు రూపంలో లేదా ఆర్‌బీఐ/ ట్రెజరీ ద్వారా సెక్యూరిటీ డిపాజిట్‌ కింద చెల్లించాలి. చెక్కులు, బ్యాంక్‌ డ్రాఫ్టులు అనుమతించట్లేదు. ప్రభుత్వ పనిదినాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సంబంధిత ఆర్వోలు, ఏఆర్వోలు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థులు 100 మీటర్ల దూరంలో వారి వాహనాలను నిలిపేయాలి. అభ్యర్థితో కలిపి మొత్తం అయిదుగుర్ని మాత్రమే లోపలికి అనుమతిస్తారు.

షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రవర్తించాలి. షెడ్యూల్‌ విడుదలైన అయిదారు రోజుల తర్వాత నోటిఫికేషన్‌ వస్తుంది. కోడ్‌ అమల్లో ఉండగా ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు నిర్వహించాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి. పార్టీలు, ప్రతినిధులు నిర్వహించే కార్యక్రమాలను పూర్తిస్థాయిలో వీడియోగ్రఫీ ద్వారా పర్యవేక్షిస్తారు’ అన్నారు ముకేశ్ కుమార్ మీనా. రాజకీయ పార్టీలు, వాటి ప్రతినిధులు ఎన్నికల ప్రక్రియపై సమగ్ర అవగాహన ఏర్పరరుచుకోవాలి. లేకుంటే సర్కారు నుంచి సవాళ్లను ఎదుర్కోవాలి.

మరి వాలంటీర్లను దూరం పెడతారా...

ముకేశ్ కుమార్ మీనా ఇవన్నీ చెప్పిన తర్వాత సీపీఎం నాయకుడు వై.వెంకటేశ్వరరావు లేచి మరి వాలంటీర్లను ఏమి చేస్తారని అడిగారు. ‘వాలంటీర్లను ఎన్నికల విధుల్లో వినియోగించుకోవద్దన్నారు. ఎన్నికల కమిషన్‌ పదేపదే చెప్పినా.. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు వారిని వినియోగించుకుంటున్నారు. వారికి తాయిలాలు, బహుమతులు సైతం ఇస్తున్నారు. అధికార పార్టీకి కార్యకర్తల్లా పనిచేయాలని మంత్రులే బాహాటంగా చెబుతున్నారు. ఎన్నికలు సజావుగా జరగాలంటే అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చాం. బీజేపీ రాముడు, రామాలయం, రకరకాల దేవుళ్ల బొమ్మలు, ఆకృతులను వాడుతోంది. మతాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తోంది. పార్టీల హోర్డింగ్‌లను తక్షణమే తొలగించాలని విజ్ఞప్తి చేశాం. దీనిపై తక్షణమే స్పందించాలని’ సీపీఎం కోరింది. ఎన్నికల సంఘం ఏమి చేస్తుందో చూడాలి మరి.

Tags:    

Similar News