Inhumane incident | మహిళా మంత్రి ఇలాఖా... ముడిమడుగులో దుశ్శాసన పర్వం

వీధిలోనే ఓ మహిళను వివస్త్రను చేశారు. జుట్టు కత్తిరించి అమానుషంగా ప్రవర్తించారు. ఈ ఘటనతో పల్లె తల్లడిల్లింది.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-01-16 08:22 GMT
ఆస్పత్రిలో బాధిత మహిళ

పల్లెలన్నీ సంక్రాంతి పండుగ సందడిలో మునిగి ఉన్నాయి. ఓ పల్లెలో వివాహితను వీధిలోకి లాక్కుని వచ్చి వివస్త్రను చేశారు. జట్టు కత్తిరించిన అమానుష ఘటన సమాజాన్ని సిగ్గు పడేలా చేసింది.

పెనుగొండ టీడీపీ కార్యాలయంలో ఉదయం పది గంటలకు సందడిగా ఉంది. మధ్యాహ్నం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి ఎస్. సవితమ్మ పుట్టినరోజును ఘనంగా నిర్వహిస్తున్నారు.
పెనుగొండకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముడిమడుగులో ఉదయం ఈ దుస్సంఘటన జరిగింది. మహిళను నడివీధిలో వివస్త్రను చేశారు. అంతటితో ఊరుకోకుండా జట్టు కూడా కత్తిరించారు.
మంత్రి బందోబస్తులో ఉన్న పోలీసులకు సమాచారం అందింది. ఇద్దరు పోలీసులు వెళ్లి, విషయం తెలుసుకుని వచ్చారు. ఈ తరువాత ఎస్ఐ రాజేష్, సీఐ రాఘవన్ వెళ్లి వచ్చారు. సాయంత్రానికి బాధిత మహిళను పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చారు. ఆమె నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. ఇంతవరకు ఈ అమానుష ఘటనపై మంత్రి సవితమ్మ నుంచి రియాక్షన్ లేదు. కాగా ఈ సంఘటనకు పాల్పడింది వైసీపీ మద్దతుదారులే అనే మాటలు అక్కడి మీడియా ద్వారా తెలిసింది.
ఉమ్మడి అనంతపురం జిల్లా (శ్రీసత్యసాయి జిల్లా) పెనుగొండకు సమీపంలోని ఎర్రమంచి గ్రామం కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ముడిమడుగు గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ఈ సంఘటనకు కారణం ఒకటే. ప్రేమ జంట పారిపోవడానికి సహకారం అందించిందనేది ప్రధాన ఆరోపణ. యువతి తరఫు బంధువులు ఆ మహిళపై దాడి చేశారు. బాలిక తరఫు కుటుంబీకులు మూకుమ్మడిగా దాడి చేసి, తల జుట్టు కత్తిరించి అవమానం చేశారు. ఈ సంఘట తరువాత బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని రక్షించిన పోలీసులు స్టేషన్ కు తరలించారు.
ఈ సంఘటనలో 13 మంది నిందితులపై కేసు నమోదు చేసినట్లు పెనుగొండ సీఐ రాఘవన్ 'ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు. బాధిత మహిళను ఆస్పత్రికి తరలించామని తెలిపారు.
ఇక బతకాలని లేదు...
పోలీస్ స్టేషన్ కు వచ్చిన తరువాత బాధిత మహిళ గుండెలు పగులేలా రోదించారు. "వీధిలో ఇంక తిరగలేను సార్. న్యాయం జరుగుతుందని స్టేషన్ కు వచ్చాను. నాకు అమ్మా, నాన్న ఎవరూ లేరు. నేను తప్పు చేయలేదు. ఇంతకుముందు కూడా వాళ్లే నాపై దాడి చేశారు. అప్పుడు నాకు న్యాయం జరగలేదు. ప్రభుత్వం మారిన తరువాత కూడా ఇదే జరిగింది" అని పొగిలి పొగిలి రోదించింది.
పెనుగొండ మండలం ముడిమడుగు గ్రామానికి చెందిన ఓ వివాహిత చిల్లర అంగడి నిర్వహిస్తూ, జీవిస్తోంది. వారం కిందట గ్రామంలోని అనిల్ అనే వ్యక్తి ఓ బాలికతో కలిసి కనిపించకుండా పోయారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారంతా బీసీ బోయ (వాల్మీకి) సామాజిక వర్గానికి చెందిన వారే. కాగా, తమ బిడ్డ మరో పిల్లోడితో పారిపోవడానికి చిల్లర అంగడి నిర్వహిస్తున్న మహిళే కారణం అని సందేహించారు.
జనవరి 15 కనుమ పండుగతో పల్లె మొత్తం సంబరాల్లో మునిగి ఉంది. బాలిక తరఫు సంబంధీకుల్లో మహిళలు, పురుషులు మూకుమ్మడిగా చిల్లర అంగడి నిర్వహిస్తున్న మహిళ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటిలో ఉన్న ఆ మహిళను వీధిలోకి లాక్కుని వచ్చారు. వివస్త్రను చేయడంతో పాటు అందరూ చూస్తుండగానే. ఆమె తలజట్టు కత్తిరించి తీరని అవమానానికి గురి చేశారు.
"గతంలో కూడా తనపై ఇలాగే దాడి చేశారని బాధిత మహిళ పోలీస్ స్టేషన్ లో కన్నీటి పర్యంతం అవుతూ చెప్పింది"
మహిళను వీధిలో అవమానం చేయడాన్ని ఆమె బంధువులు అడ్డుకున్నారు. దాడి చేసిన వారితో ఘర్షణకు దిగారని సమాచారం. అవకాశం దొరకగానే ప్రాణభయంతో బాధిత మహిళ ఇంటిలోకి పారిపోయి దాక్కున్నట్లు తెలిసింది. ఆ తరువాత ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లి, ఫిర్యాదు చేయించారు. ఇదిలాఉండగా,
పారిపోయిన ప్రేమికులను గుర్తించి, తీసుకుని వచ్చినట్లు పెనుగొండ ఎస్ఐ తెలిపారు. ఈ సంఘటనపై సీఐ రాఘవన్ మాట్లాడుతూ, "ప్రేమికుల్లో బాలిక మైనర్ కావడం వల్ల తల్లిదండ్రులకు అప్పగించాం. ఆ బాలికను తీసుకుని వెళ్లిన యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశాం" అని తెలిపారు. దాడికి గురైన బాధిత మహిళ ఫిర్యాదుతో బాలిక బంధువుల్లో 13 మంది మహిళలు, పురుషులపై కూడా కేసు నమోదు చేశాం అని సీఐ రాఘవన్ చెప్పారు. పెనుగొండ ఆస్పత్రిలో బాధిత మహిళ చికిత్స తీసుకుంటోంది. డీఎస్పీ వెంకటేశ్వర్లు కూడా ఆమెను పరామర్శించి, ఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు. ఈ సమయంలో మండుతున్నగుండె నుంచి వచ్చిన మాటలు డీఎస్పీ నోట మాటరాని పరిస్థితి.
"న్యాయం, అన్యాయం తెలియకుండా నన్ను వేధించారు సార్. ఇక నేను బతికీ లాబం లేదు" అని బాధిత మహిళ కన్నీటిపర్యంతం అయింది. "నా అనే వారు ఎవరూ నాకు లేరు. తల్లిదండ్రలు లేని నేనే చిన్న వ్యాపారంతో బతుకుతున్నా" ఇంతకు ముందు కూడా నాపై వాళ్లే దాడి చేశారు. అప్పుడు న్యాయం జరగలేదు. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడింది. పోలీసులే నాకు న్యాయం చేయాలి" అని అర్థించింది.
ఈ సంఘటన ముడిమడుగు గ్రామంలో రాజకీయ చిచ్చు రగుల్చేలా ఉంది. గతంలో వైసీపీ మద్దతుదారులే తనపై దాడి చేశారనే విషయం ఆ ప్రాంత జర్నలిస్టుల చెప్పిన సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారనేది వేచి చూడాలి.
Tags:    

Similar News