అమరావతి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణంపై కసరత్తు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. గతంలో ఉన్న ప్రతిపాదనల ప్రకారం రెండో దశ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు.

Update: 2024-06-30 08:16 GMT

నూతన ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అమరావతిలోని సచివాలయం నుంచి చెన్నై – కోల్‌కతా జాతీయ రహదారిని కలుపుతూ చేపట్టిన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. సుమారు రూ. 500 కోట్లతో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణ పనులు జరగనున్నాయి. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో అమరాతి ప్రాంతంలో ఎలాంటి పనులు చేపట్ట లేదు. 2017లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం సీడ్‌ యాక్సెస్‌రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టి మొదటి దశ కింద దాదాపు 80 శాతం పనులను పూర్తి చేసింది. రెండో దశ పనులకు ప్రతిపాదనలు పూర్తి అయినా, ప్రభుత్వం మారడంతో ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి.

రెండో దశలో 18.27కిలో మీటర్ల పనులు
రెండో దశ నిర్మాణ పనులు 18.27 కిమీ పొడవున జరగాల్సి ఉంది. ఈ పనులను వచ్చే ఏడాదికి ఏప్రిల్‌ నెలాఖరుకు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం నాలుగు వరుసల రహదారి పనులను రూ. 125 కోట్ల వ్యయంతో ఎన్‌సీసీ సంస్థ చేపట్టింది. సీడ్‌ క్యాపిటల్‌లోని ప్రభుత్వ భవనాల సముదాయాలను జాతీయ రహదారితో అనుసంధానించేందుకు ఈ సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే జాతీయ రహదారి మార్గంలో కనక దుర్గమ్మ వారధి దాటిన తర్వాత మణిపాల్‌ ఆసుపత్రి వద్ద జాతీయ రహదారిపై ఈ సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు ప్రారంభమై బోరుపాలెం వరకు వెళ్తుంది. రాజధానిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తి అయిన తర్వాత ప్రభుత్వం చేపట్టిన రెండో పెద్ద ప్రాజెక్టు ఇది.
రెండు భాగాలుగా సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు
సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును రెండు భాగాలుగా విభజించారు. మొత్తం రోడ్డు పొడవు 21.5కిలో మీటర్లు. ఇందులో 18.27కిలో మీటర్లకు మొదట టెండర్లు పిలిచారు. ఈ రహదారి మధ్యలో 16.3మీటర్ల వెడల్పు ప్రాంతాన్ని బీఆర్‌టీఎస్‌ కోసం, మెట్రో రైలు కోసం కేటాయించారు. ఒక పక్క 7.25మీటర్ల వెడల్పులో రెండు వరుసల రహదారి, మరో పక్క ఇంతే వెడల్పుతో రెండు వరుసల రహదారిని నిర్మిస్తారు. ఈ రహదారికి రెండు వైపుల సైకిల్‌ ట్రాక్‌ కూడా ఉంటుంది. తొలి విడత రహదారి పనులు ఉండవల్లి సమీపంలో మొదలై బోరుపాలెం వరకు కొనసాగాలి. రాజాధానిలో నిర్మిస్తున్న ఏడు ప్రధాన రహదారుల్లో మూడు రహదారులు ఈ రోడ్డు మీదుగా వెళ్తాయి. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పైకి వచ్చేందుకు దాదాపు 30 చోట్ల అప్రోచ్‌ రోడ్లు ఉంటాయి. రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌ను 12 చోట్ల ఓపెన్‌ చేసి ఉంచుతారు. 18.27కిలోమీటర్ల దూరంలో 41 కల్వర్టులు, రెండు మినీ వంతెనలు నిర్మించాల్సి ఉంటుంది.
భూ సేకరణ కోసం కసరత్తు
ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా ప్రభుత్వం తీసుకున్న భూమి కాకుండా మరి కొంత భూమిని రహదారికి సేకరించాల్సి ఉంది. గత టీడీపీ ప్రభుత్వంలోను, తర్వాత వచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలోను రహదారికి తమ భూములు ఇచ్చేందుకు అంగీకరించేది లేదని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇస్తేనే తమ భూములు రహదారికి ఇస్తాం తప్ప ల్యాండ్‌ పూలింగ్‌ చట్టం ప్రకారం అయితే ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పారు. రహదారి నిర్మాణ ప్రాంతంలో ప్రధానంగా ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి గ్రామాలకు చెందిన భూములు ఉన్నాయి. ఇందులో ల్యాండ్‌ అక్విజిషన్‌ ద్వారా మణిపాల్‌ ఆసుపత్రి ఏరియాలో సుందరయ్య నగర్, సీతానగరం కాలనీలు కూడా ఉన్నాయి. 78 కుటుంబాలు, 68 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆర్‌ఆర్‌ నష్ట పరిహారం కింద సుమారు రూ. 49 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. వ్యయసాయ భూములు కోల్పోయే 68 కుటుంబాలు నుంచి 23.72 ఎకరాలను సేకరించాల్సి ఉంది. మొత్తంగా 78 కుటుంబాలు ఎఫెక్ట్‌ అవుతాయి. వీరిని పిలిపించి మాట్లాడటం ద్వారా భూసేకరణ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వీలైనంత వరకు భూ సమీకరణకే రైతులను ఒప్పించాలని, లేదంటే ఆలస్యం చేయకుండా రైతులతో సంప్రదింపులు, చర్చలు జరిపి ఏదో ఒక ఒప్పందం చేసుకోవడం ద్వారా రోడ్డు నిర్మాణం పనులు వేగవంతం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సుందరయ్యనగర్, సీతానగరం కాలనీల్లో రోడ్డు నిర్మాణం వల్ల ఎఫెక్ట్‌ అయ్యే కుటుంబాలకు వేరే ప్రాంతాల్లో ఇంటి నివాస స్థలాలు కేటాయించి ఇళ్లు మంజూరు చేస్తే బాగుటుందనే ఆలోచనలకు పాలకులు వచ్చినట్లు సమాచారం.
Tags:    

Similar News