"వ్యూహం" తో ఆధిపత్యానికి సవాల్
ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి వైఎస్ఆర్సిపి వ్యూహం పన్నింది. బీసీల కోటలో మళ్లీ పూర్వ వైభవం సాధించుకునేందుకు ఆదిపత్యం దిశగా టిడిపి అడుగులు వేస్తోంది.
(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)
తిరుపతి: అనంతపురం టిడిపి రాజకీయం మంటల్లో ఉంది. అత్యంత కీలకమైన హిందూపురం అంటే గుర్తుకు వచ్చేది సత్యసాయిబాబా .. ఆ తర్వాత ఎన్టీ రామారావు. ఈ ప్రాంతంలో వారిపై ప్రజానీకానికి ఉన్న ఆత్మీయత కనిపిస్తుంది. శాంతి ప్రవచనాల పరిమళాలు వికసించిన ఈ గడ్డపై కత్తులు దూసుకుంటున్నారు. టిడిపి ఆవిర్భావం తర్వాత బీసీలకు నెలవైన హిందూపురాన్ని కంచుకోటగా మార్చుకుంది. గత ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ నుంచి నేర్చుకున్న పాఠాలతో మళ్లీ పూర్వ వైభవం కోసం పాకులాడుతోంది. దేశానికి రాష్ట్రపతిగా సేవలందించిన నీలం సంజీవరెడ్డిని ఎంపీగా చేసిన ఘనత హిందూపురం నియోజకవర్గానికి దక్కుతుంది.
బీసీ నాయకులు తెరపైకి రావడం ద్వారా హిందూపురం పార్లమెంటు స్థానంలో 1989 నుంచి రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యానికి చెక్ పెట్టారు. టిడిపి ఆవిర్భావం తర్వాతే ఎన్టీ రామారావు ఓటర్ల రూపంలో అధికంగా ఉన్న బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. తమకు కూడా తప్పదని భావించిన కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత వైయస్సార్సీపి కూడా అదే బాటలో పయనించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువ. టిడిపికి అండగా నిలిచారు. గత ఎన్నికల్లో టిడిపి ప్రభుత్వానికి దెబ్బ తగిలింది. ఆ స్థితి నుంచి కోలుకోవడానికి పోరాటానికి దిగింది. పార్లమెంట్ నియోజకవర్గంలోని హిందూపురం, పెనుగొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, మడకశిర ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ స్థానంలో 16,41,717 ఓటర్లు ఉంటే అందులో.. 8,20,254 మంది పురుషులు, 8,21,337 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
పట్టుపట్టి సాధించిన పార్థసారథి
2024 ఎన్నికల కోసం టిడిపి సీనియర్ నేత, బీసీ నాయకుడు బి.కె పార్థసారథి పార్టీపై ఆధిపత్యం ప్రదర్శించారు. 1999లో ఎంపీగా గెలిచిన డికె. పార్థసారథి తిరిగి ఈ ఎన్నికల్లో కూడా అభ్యర్థిత్వం సాధించారు. ఈయనపై వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా జలదరాశి శాంత పోటీకి దిగుతున్నారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో ఎంపీగా పనిచేసిన ఈమె హిందూపురంలో స్థానికత సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ రెండు ప్రధాన పార్టీల వ్యూహాత్మక ఎత్తుగడ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
వ్యూహాత్మక ఎంపిక..
హిందూపురం పార్లమెంటు స్థానంలో అభ్యర్థులను ఎంపిక చేయడంలో అధికార వైఎస్ఆర్సిపి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పార్లమెంట్ సెగ్మెంట్లోని ఏడు శాసనసభ స్థానాలు ఉండగా బీసీ ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 2019 ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని ఓట్లు చేయకుండా ఉండే రీతిలో జాగ్రత్తలు తీసుకుంది. ఏడు శాసనసభ స్థానాల్లో ముగ్గురు బీసీలు, ముగ్గురు ఓసీలు, ఒక ముస్లిం అభ్యర్థి, ఎస్సీ రిజర్వు స్థానంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన సాధారణ వ్యక్తి అభ్యర్థిని ఖరారు చేయడం ద్వారా ముందుచూపుతో వ్యవహరించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
ఆధిపత్యమే.. టిడిపి ఎత్తుగడ
హిందూపురం పార్లమెంటు స్థానంలో బీసీలు వారిలో కురుబ, వాల్మీకి సామాజిక వర్గం ఓటర్ల సంఖ్య ఎక్కువ. టీడీపీ.. వ్యూహం కంటే వ్యక్తుల ఆధిపత్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఏడు శాసనసభ స్థానాల్లో ముగ్గురు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరు, బీసీ సామాజిక వర్గంలో ఒకరు చేస్తున్నారు. ధర్మవరం నుంచి బీసీ వ్యక్తి పోటీ చేస్తున్న ఆయన కూటమిలో భాగస్వామ్యమైన బిజెపి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి సాధారణ వ్యక్తికి ఇస్తే, ఓ సామాన్య డాక్టర్కు అవకాశం కల్పించింది.
ఎవరి పైన ఎవరు..
పార్లమెంటు నియోజకవర్గం కేంద్రమైన హిందూపురం అసెంబ్లీ స్థానంలో కురుబ సామాజిక వర్గానికి చెందిన టిఎన్ దీపికను టిడిపి అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై పోటీకి దించుతున్నారు. పుట్టపర్తిలో సిట్టింగ్ ఎమ్మెల్యే దుద్ధికుంట శ్రీధర్ రెడ్డిపై టిడిపి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పోటీ చేస్తున్నారు. స్థానంలో కూటమి అభ్యర్థిగా బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ తలపడుతున్నారు. కదిరి అసెంబ్లీ స్థానం నుంచి మగ్బూల్ అహ్మద్ పోటీ చేస్తుండగా, టిడిపి నుంచి కందికుంట వెంకటేశ్వర ప్రసాద్, రాప్తాడు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పై మాజీ మంత్రి పరిటాల సునీత పోటీకి దిగారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి బదిలీపై వచ్చిన మంత్రి ఉషశ్రీ చరణ్ పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చేస్తుండగా టిడిపి అభ్యర్థిగా మాజీ మంత్రి కుమార్తె ఎస్ సవితమ్మ వారిలో ఉన్నారు. పేదల పార్టీగా చెప్పుకుంటున్న వైఎస్ఆర్సిపి మడకశిర సి రిజర్వుడ్ నియోజకవర్గంలో నియోజకవర్గంలో ఉపాధి హామీ కూలి, ఆ తర్వాత సర్పంచ్ గా మారిన అత్యంత సామాన్య వ్యక్తి మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఈర లక్కప్పకు అనూహ్యంగా అవకాశం కల్పించడం పరిశీలకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు, సామాన్య డాక్టర్ ఎంబి సునీల్ కుమార్‌కు టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు. ఈ పరిస్థితి ఇలా ఉంటే...
నిలిచేది నేనే...
హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని పెనుగొండ నియోజకవర్గం నుంచి బి.కె పార్థసారథి 2009, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. పెనుగొండ నుంచి టిక్కెట్ ఆశించిన ఆయన భంగపడ్డారు అంతటితో ఊరుకోకుండా, కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో టిడిపి ప్రచార సామాగ్రిని కూడా దహనం చేశారు. ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. నియోజకవర్గంలో పరిస్థితిలో సమీక్షిస్తున్న టిడిపి చీఫ్ చంద్రబాబు తీరును బీకే పార్థసారథి ప్రశ్నించే రీతిలో.."హిందూపురంలో నిలిచేది నేనే.. గెలిచేది కూడా నేనే" నినాదంతో ధీమాగా ఉన్నారు. పెనుగొండ నియోజకవర్గంలో పరిస్థితి అదుపు తప్పకుండా చూడాలని నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఎట్టకేలకు బీకే. పార్థసారథి అభ్యర్థిత్వాన్ని హిందూపురం పార్లమెంటు స్థానంలో ఖరారు చేశారు. ఇదే ఆయనకు తొలి విజయమని పార్టీ వర్గాలే కాకుండా విమర్శకులు సైతం భావిస్తున్నారు.
గెలిచేది నేనే...
పార్లమెంటు స్థానంలో ప్రధానంగా హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పోటీలో ఉండడం ఒక బలంగా చెప్పవచ్చు. అదే రీతిలో రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల సునీతమ్మ పోటీల ఉండడం అక్కడ టిడిపి కూడా ప్రాబల్యానికి కూడా కొరత లేదు. పరిటాల సునీతమ్మ కుమారుడు పరిటాల శ్రీరామ్ ధర్మవరం నియోజకవర్గంలో అన్ని తానే బిజెపి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ కు అండగా నిలిచారు. ఇక్కడ కూడా టిడిపికి లాబించే అంశమే. పుట్టపర్తి సహస స్థానంలో టిడిపి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పోటీ చేయకుండా ఆమె కుమార్తె పల్లె సింధూర పోటీలో ఉన్నారు. కదిరి శాసనసభ స్థానంలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నారు. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న కందికుంట వెంకటప్రసాద్ నుంచి కూడా తనకు మేలు జరుగుతుందని విశ్వాసాన్ని బికే పరసారథి వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గమైన మడకశిర సెగ్మెంట్లో మాజీ ఎమ్మెల్యే మసాల ఈరన్న ఉండడం, ఆయన కుమారుడు డాక్టర్ సునీల్ కుమార్ పోటీలో ఉన్నారు. సెగ్మెంట్ బలమైన కోట కావడం కూడా ప్లస్ పాయింట్ అని బికే పార్థసారథి ధీమాతో ఉన్నారు.
1999 ఎన్నికల్లో కూడా బీకే పార్థసారథి హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2024 ఎన్నికల్లో టిడిపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఈ నియోజకవర్గంపై సంపూర్ణ అవగాహన, పట్టు ఉందని ధీమా వ్యక్తం చేస్తున్న ఆయన, బీసీ సామాజిక వర్గం ఓటర్లు ఆదరిస్తారనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
కిష్టప్ప సంగతేంటి?
ఈ నియోజకవర్గంలో నుంచి టిడిపి సీనియర్ నాయకుడు నిమ్మల కిష్టప్ప 2009, 2014 పార్లమెంట్ ఎన్నికల్లో హిందూపురం నుంచి గెలిచారు. గత ఎన్నికల్లో ఓటమి చెందిన నిమ్మల కిష్టప్ప పై పలు ఆరోపణలు ఉన్నాయి. ఆయన కుమారులు భూదాహంతో చేసిన ఆక్రమణలు, ఆరోపణలు ఆయనను వెంటాడినట్లు భావిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలో నిమ్మల కిష్టప్ప స్థానంలో బికే పార్థసారథికి అవకాశం కల్పించారు. ఈ పరిస్థితుల్లో నిమ్మల కిష్టప్ప దారెటు అనేది చర్చనీయాంశంగా మారింది. పార్టీ మారే ఆలోచనలో కూడా ఉన్నారని సమాచారం.
గోరంట్ల గబ్బర్ సింగ్‌కు మొండిచేయి
సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్ కు వైఎస్ఆర్సిపి సీటు దక్కలేదు. పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్న ఆయన వీఆర్ఎస్ తీసుకొని వైఎస్ఆర్సిపిలోకి ఎంటర్ కావడమే వివాదాలతో ప్రారంభమైంది. ఆ తర్వాత భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ, వరుస వివాదాలు ఆయన కొనితెచ్చుకున్నారు. పార్టీపై మచ్చపడేలా ఉందని భావించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో..
నేనూ లోకలే.. అంటున్న శాంత
అనూహ్యంగా కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుంచి వైయస్ఆర్సీపీ హిందూపురం ఎంపీ అభ్యర్థిగా జల దాసరి శాంతమ్మ తెరమీదకి వచ్చారు. బళ్లారి ఎంపీగా ఒకసారి ఈమె గెలిచారు. ఓటమి చెందారు. జె. శాంతమ్మను ఎంపీ అభ్యర్థిగా తీసుకురావడం వెనుక ఆమె సోదరుడు శ్రీరాములు, ఆయన గాడ్ ఫాదర్ గాలి జనార్దన్ రెడ్డి మంత్రాంగం ఉందనే విషయం పై చర్చ జరుగుతుంది. " నేను కూడా లోకల్. నాకు ఈ ప్రాంతం పై అవగాహన ఉంది. వాల్మీకి సామాజిక వర్గం నుంచి నాకు అండ బంధుత్వం ఉంది" శాంతమ్మ చెబుతున్నారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో అభ్యర్థుల బాధ్యతలు భరించడానికి సంసిద్ధమైనట్లు వివిధ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. " నేను బళ్లారిలో పుట్టిన, నా వివాహం గుంతకల్లు వ్యక్తితో జరిగింది. కాబట్టి నాకు ఆంధ్ర మెట్టినిల్లు" నేను స్థానికురాలినే అనేది ఆమె మాట .
నియోజకవర్గంలోని బీసీ సామాజిక వర్గ ఓటర్ల పై ఆశలు పెట్టుకున్న ఆమెకు, సిట్టింగ్ ఎమ్మెల్యేలే పెద్ద రక్ష. అందులో ప్రధానంగా.. పుట్టపర్తి, ధర్మవరం, పెనుగొండ, కదిరి నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ పైన ఆధారపడాల్సిన పరిస్థితి. " వైయస్ఆర్సీపీ పేదల పార్టీ. ఆ వర్గాలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలే తనకు శ్రీరామరక్ష" అని ఎంపీ అభ్యర్థి జల దాసరి శాంతమ్మ ఆశాభావంతో ఉన్నారు.
నేను ఉన్నా ...
హిందూపురం పార్లమెంటు స్థానాన్ని
ఆధ్యాత్మిక గురువు, శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి కూడా టికెట్ ఆశించారు. బిజెపి నుంచి తనకు అవకాశం కల్పించాలని కోరుతూ పరిపూర్ణానంద స్వామి గత నెలలో బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డాను ఢిల్లీలో కలిశారు. ఆయన అదే ప్రయత్నాల్లో ఉన్నారు. కూటమిలో భాగస్వామ్యం అయిన బిజెపి కడప జిల్లా రాజంపేట, చిత్తూరు జిల్లా తిరుపతి ఎంపీ స్థానాల నుంచి అభ్యర్థులను పోటీకి నిలిపింది. దీంతో హిందూపురం పార్లమెంటు స్థానం ఆశించిన పరిపూర్ణానంద స్వామికి అవకాశం దక్కలేదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆయన హిందూపురం ప్రాంత ప్రజలతో మమేకం అయ్యారు. ఈ సీటు ఆశించడానికి ఆయన చెబుతున్న కారణం ఒకటే హిందూపురంలో " హిందువు" ఉంది. ఈ తరహా పేర్లు ఏ పట్టణానికి లేవు. ఆ ఊరి పేరును సార్ధకం చేయాలనే ఉద్దేశంతో తాను ఇక్కడి నుంచి పోటీ చేయాలని సంకల్పించినట్లు పరిపూర్ణానంద స్వామి చెబుతున్నారు. పార్టీ నుంచి అవకాశం లేకున్నా స్వతంత్రంగా పోటీ చేస్తానని పరిపూర్ణానంద స్వామి అంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో.. వైఎస్ఆర్సిపి పన్నిన వ్యూహం ఫలిస్తుందా? టిడిపి ఆవిర్భావం నుంచి ఆధిపత్యం చెలాయిస్తున్న నియోజకవర్గాల్లో వ్యక్తుల ప్రభావం ప్రతిఫలిస్తుందా అనేది. ఇంకొన్ని వారాల్లో జరగనున్న పోలింగ్ ఫలితం తేట తెల్లం చేస్తుంది. అంతవరకు వేచి చూద్దాం.