ఎట్టకేలకు వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ కి బెయిల్
ఎట్టకేలకు వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్ మంజూరైంది. గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది;
By : The Federal
Update: 2025-01-28 16:14 GMT
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్ మంజూరైంది. గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. మంగళగిరిలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సురేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ మల్లికార్జున రావు నేతృత్వంలోని పోలీసుల బృందం 2024 సెప్టెంబర్ 5న హైదారాబాద్ లోని మియాపూర్ లో అరెస్ట్ చేసింది. ఆ తర్వాత బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టులోనే ఈ వ్యవహారాన్ని తేల్చుకోమని హైకోర్టు చెప్పడంతో ఆయన తిరిగి గుంటూరు కోర్టును ఆశ్రయించారు. దాదాపు ఐదు నెలలుగా నందిగం సురేష్ జైలులో ఉన్నారు.
గతంలో ఏం జరిగిందంటే..
టీడీపీ కార్యాలయంపై దాడికేసులో నిందితునిగా పేర్కొన్న సురేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు గతంలో కొట్టివేసింది. దీంతో నందిగం సురేశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు సురేశ్ ప్రయత్నం చేస్తున్నారని సమాచారం అందుకున్న హైదరాబాద్‌కు వెళ్లి పోలీస్ ప్రత్యేక బృందాలు అరెస్ట్ చేశాయి. పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపడిన నందిగం సురేశ్ కోర్టు తీర్పు రావడం ఆలస్యం అవుతుందనే భయంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. రాష్ట్రం దాటి వెళ్లిపోయారంటూ టాక్ నడిచింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ కూడా నిందితుడు కావడంతో తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో నందిగం సురేష్‌ను అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి పోలీసులు వెళ్లగా.. ఆయన ఇంట్లో లేరని అక్కడి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో సురేష్ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్, అప్పిరెడ్డి, నందిగాం సురేష్, తలశిల రఘురామ్ సహా మరో 14 మంది నిందితులుగా ఉన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే.. వీరంతా తమను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని, అరెస్ట్ నుంచి రక్షించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించే ప్రసక్తే లేదని ఏపీ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పుడు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.