ఊరించి ఊరించి ఊసూరు మనిపించారు!

వైసీపీ పార్టీ మేనిఫెస్టోపై సొంత పార్టీ నేతలు కూడా పెదవి విరుస్తున్నారు. ఇలాగైతే గెలుపు డౌటే అంటున్నారు. అందుకు కారణం ఏంటి..

Update: 2024-04-28 06:13 GMT

వైసీపీ అధినేత , ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో పట్ల పార్టీ అభ్యర్థులు, నేతలే పెదవి విరుస్తున్నారు. ఊరించి ఊరించి ఊసూరు మనిపించారని అవేదన వ్యక్తం చేస్తున్నారు. పది పరకా పెంపుతో పాత పథకాలే అమలు జరుగుతాయని చెప్పేందుకు ప్రత్యేకంగా మ్యానిఫెస్టో ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

రుణ మాఫీ లేదే

రైతు రుణమాఫీ వైపీపీ మ్యానిఫెస్టోలో ఉంటుందని ఆ పార్టీ నేతలు ఆశగా ఎదురు చూశారు. కరోనా ఆ తర్వాత కరువు కారణంగా రాష్ట్రంలో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని వైసీపీ నేతలే అంగీకరిస్తున్నారు. అటువంటి రైతాంగానికి కనీసం లక్ష రూపాయల వరకైనా రుణమాఫీ ఇస్తే ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందని వైసీపీ అభ్యర్దులు భావించారు. అటువంటి ది ఏమీ లేకుండా నాలుగు వేల రూపాయల రైతు భరోసా దశల వారీ అమలు అనే హామీ ఇచ్చారు.

పెన్షన్ పెంచలేకపోయారా?

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏప్రిల్ మాసం నుంచే పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తామని సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ప్రకటించింది. దానిని విస్తృతంగా ప్రచారం చేసింది. జనాల్లోకి బాగానే వెళ్లింది. అది చూసిన తర్వాత కూడా పెన్షన్ విషయంలో కొసరి కొసరి రెండు విడతులుగా రూ. 250 రూపాయల చొప్పున పెంచుతూ 2029 ఎన్నికల నాటికి రూ.3500 చేస్తామనడం ఊసూరు మనిపించింది. అభ్యర్థులు పెన్షన్ హామీ చూసి లబో దిబో మంటున్నారు. 60 లక్షల మందిని ప్రత్యక్షంగా ప్రభావితం చేసే పెన్షన్ విషయంలో తమ పార్టీ పప్పులో కాలేసిందని బాధపడుతున్నారు.

బస్సు ప్రయాణం లేదు

కర్ణాటక, తెలంగాణలలో కాంగ్రెస్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీతో విజయం సాధించింది. తెలుగుదేశం వెంటనే ఆ హామీని సూపర్ సిక్స్‌లో చేర్చింది. వైసీపీ కూడా ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణానికి కొంత మేర అయినా అవకాశం కల్పిస్తుందని అభ్యర్దులు నేతలు ఎదురు చూశారు. చివరకూ ఆ హామీ లేకపోవడం నిరాశపరిచింది.

ప్రత్యేక హోదా అంశమే లేదు

గత ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు ప్రధాన కారణాల్లో ఒకటి అయిన రాష్టానికి ప్రత్యేక హోదా అంశమే మేనిఫెస్టోలో లేదు. ఇదీ తీవ్ర విమర్శలకు అవకాశం కల్పించింది.

ఇదీ మ్యానిఫెస్టో యేనా? గంటా ప్రశ్న

ఇదేం మ్యానిఫెస్టో అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గంటా శ్రీనివాస రావు ప్రశ్నించారు. ఇంతకాలం ఊరించి తుస్సు మనిపించారని, దీనికంటే తెలుగుదేశం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవుతుందని ఆయన విలేకరులతో అన్నారు.

Tags:    

Similar News