టీడీపీలోకి వైసీపీ ఎంపీ మాగుంట!
ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. తనతో పాటు మరికొందరిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకుపోనున్నారు.;
Byline : G.P Venkateswarlu
Update: 2024-02-09 12:13 GMT
చంద్రబాబుతో టచ్‌లో మాగుంట
తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి రెడీగా ఉన్నారు. చేరే ముహూర్తం ఎప్పుడనేది ఇంకా ఖరారు కాలేదు. ఇప్పటికే పలు సార్లు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో మాట్లాడారు. బాబు కూడా పార్టీలో చేర్చుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఒంగోలు పార్లమెంట్‌లో మాగుంట అయితేనే గెలుపు అవకాశాలు ఉంటాయని చంద్రబాబు భావిస్తున్నారు. ఎప్పుడు పార్టీలో చేరాలనే విషయంపై ఇంకా మాగుంట నిర్ణయం తీసుకోలేదు. చంద్రబాబు పిలిచి చేరాలని చెప్పిన రోజు పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు.
మాగుంట కుటుంబానికి ఒంగోలు కేంద్ర బిందువు
మాగుంట కుటుంబం రాజకీయ ప్రవేవం చేసింది ఒంగోలు కేంద్రం నుంచి. అందువల్ల ఒంగోలు వాసులు మాగుంటను ఆదరిస్తూ వస్తున్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ రాజకీయంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు. మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాగుంట మధ్యలో తెలుగుదేశం పార్టీలో చేరి ఆ తరువాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1991–96 మధ్య మొదటి సారిగా మాగుంట ఫ్యామిలీ రాజకీయాల్లోకి వచ్చింది. ఈ కుంటుంబాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది కూడా ఒంగోలు ప్రజలేనని చెప్పొచ్చు. మొదట మాగుంట సుబ్బరామిరెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందగా ఆయన మరణానంతరం ఆయన భార్య మాగుంట పార్వతమ్మ పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తిపై ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఒంగోలు ఎంపీగా గెలుపొందారు. ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి ఎక్కువసార్లు గెలిచిన ఎంపీగా మాగుంటకు మంచి పేరు ఉంది. 2019లో వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు.
ఒంగోలు పార్లమెంట్ నుంచి భారత కమ్యూనిస్టు పార్టీ తరపున మాదాల నారాయణస్వామి గెలిచారు. అంటే మొదటి నుంచీ వామపక్ష పార్టీలకు కూడా మంచి పట్టు ఒంగోలు పార్లమెంట్‌లో ఉంది. రానురాను కమ్యూనిస్టులు దెబ్బతిని కాంగ్రెస్ పుంజుకుంది. ప్రస్తుతం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకుంది.
కుమారుడిని రంగంలోకి దించేందుకు రెడీ..
మాగుంట శ్రీనివాసులురెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని రంగంలోకి దించేందుకు రెడీగా ఉన్నారు. ఒంగోలు నంచి రాఘవరెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయడం దాదాపు ఖరారైందని చెప్పొచ్చు. ప్రస్తుతం రాఘవరెడ్డి మాగుంట సంస్థల వ్యాపారాలు చూస్తున్నాడు. చెన్నై, ఢిల్లీ కేంద్రాల్లో ఎక్కువగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు. మాగుంట కుటుంబానికి మద్యం బాట్లింగ్ కంపెనీలు ఉన్నాయి. దీనిపైనే ఎక్కువగా దృష్టిపెట్టి మద్యం వ్యాపారంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ ఐదేళ్ల కాలంలో ఎంపీగా ఉన్నప్పటికీ ఏపీలో మద్యం వ్యాపారం చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
తనతో పాటు మరికొందరిని..
తాను తెలుగుదేశం పార్టీలోకి వెళుతూ మరికొందరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను తీసుకుపోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఆ బాటలో ప్రధానంగా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. బాలినేనితో పాటు మిగిలిన కొందరు ఎమ్మెల్యేలను కలుపుకుని ఒకే సారి జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించే విధంగా తెలుగుదేశం పార్టీలో చేరి విజయం సాదించాలనే ఆలోచనలో మాగుంట ఉన్నారని విశ్వసనీయ సమాచారం. అదే జరిగితే ప్రకాశం జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఖాళీ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఒంగోలులో కుమారుడిని రంగంలోకి దించి నెల్లూరు నుంచి మాగుంట శ్రీనివాసులురెడ్డి పోటీ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. రెండు చోట్లా తెలుగుదేవం పార్టీ నుంచి పోటీకి దిగాలని మాగుంట కుటుంబం భావిస్తున్నట్లు సమాచారం.