"మా చెల్లికి కావాలి మళ్లీ పెళ్లి" అన్నట్లు ఉంది: టిడిపి

కవ్వింపు బాణాలు తిరగబడ్డాయి. అధికార పార్టీ వ్యూహం బెడిసికొట్టింది. నాయకుల చేరిక "మా చెల్లికి కావాలి మళ్లీ పెళ్లి" అన్నట్లు ఉందని టిడిపి నేతలు తిప్పి కొట్టారు.

Update: 2024-05-06 09:22 GMT

(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: ఎన్నికల వేళ నేతల కప్పగంతులు సహజం. టీడీపీని మానసికంగా దెబ్బ కొట్టాలనే వైసీపీ గేమ్ రివర్స్ అయ్యింది. ఈ వ్యవహారం "మా చెల్లికి కావాలి మళ్లీ పెళ్లి అన్నట్టు ఉంది’’ అని టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఘాటుగా తిప్పికొట్టారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను తమవైపు తిప్పుకున్న టిడిపి నేతలు వైసీపీ ఎత్తులకు పైఎత్తులు వేశారు. ఈ వ్యవహారంతో తిరుపతి అసెంబ్లీ స్థానంలో రాజకీయాలు పసందుగా మారాయి.

2024 సార్వత్రిక ఎన్నికల భాగంగా టిడిపి- జనసేన- బిజెపి కూటమి నుంచి తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి ఆరణి శ్రీనివాసులు జనసేన అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆయనపై తిరుపతి ఎమ్మెల్యే కుమారుడు భూమన అభినయరెడ్డి పోటీ చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో అన్ని తానుగా వ్యవహరిస్తున్న అభినయ రెడ్డి కోసం భూమన కరుణాకరరెడ్డి వ్యూహాత్మకంగా కార్యాచరణ అమలు చేస్తున్నారు. అందులో భాగంగా మూడు పార్టీల కూటమిలో టిడిపి నాయకుల అసంతృప్తి సెగలు అధికార వైఎస్ఆర్సిపి అభ్యర్థికి కలిసొస్తాయని భావించారు. కూటమిలోని రాష్ట్ర స్థాయి నాయకులు ప్రత్యక్ష జోక్యంతో బిజెపి, టిడిపి, జనసేన నాయకులు సాగుతున్నారు.


చిచ్చు రగిల్చిన చేరిక

తిరుపతి అసెంబ్లీ స్థానంలో ఎన్నికలు పసందుగా మారాయి. యాదవ సామాజికవర్గంలో కీలకమైన నాయకుడు, టిడిపి చీఫ్ ఎన్. చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుల్లో ఒకరయిన టీడీపీ జాతీయ కార్యదర్శి జి. నరసింహయాదవ్ బామ్మర్ది గాలం వెంకటేష్ యాదవ్ మరో 110 మంది అనుచరులతో కలిసి ఆదివారం వైఎస్సార్‌సీపీలో చేరారు. టిడిపి ఆవిర్భావం నుంచి వెంకటేష్ యాదవ్ కీలకంగా పని చేశారని, ఇప్పుడు ఆయన వైసీపీలోకి రావడం స్వాగతించదగ్గ విషయమని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు.

పద్మావతి పురంలోని తన నివాసం వద్ద గాలం వెంకటేష్‌తో పాటు 110 మందికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. "టిడిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్న బీసీలకు న్యాయం జరగలేదు" అని గాలం వెంకటేష్ యాదవ్ విమర్శించారు. దీంతో కూటమి నాయకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. "టిడిపిలో ఇప్పుడున్న వారంతా నకిలీ నాయకులే" అని తరుణ్ యాదవ్ ధ్వజమెత్తారు. దీంతో టీడీపీలో భారీ కుదుపు ఏర్పడించింది.

తిప్పికొట్టిన టిడిపి నేత యాదవ్

"చెల్లికి మళ్లీ మళ్లీ పెళ్లి" చేసినట్టు ఉంది అని టిడిపి జాతీయ కార్యదర్శి, ఆ పార్టీ తిరుపతి పార్లమెంటు ఇంచార్జ్ జి. నరసింహయాదవ్ ఘాటుగా స్పందించారు. "పది సంవత్సరాల నుంచి మా బావమరిది వెంకటేష్ యాదవ్, కో బ్రదర్ శంకరయాదవ్, అర్జున్ యాదవ్.. కరుణాకర్ రెడ్డితోనే ఉన్నారు. ఇది వాస్తవం’’ అని నరసింహా యాదవ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ విధంగా చెల్లికి మళ్లీ పెళ్లి అన్నట్టు ఈ కండువాలు కప్పే కార్యక్రమానికి కరుణాకరరెడ్డి శ్రీకారం చుట్టారు" అంటూ వైఎస్సార్సీపీ నేతలతో ఉన్న ఫోటోలను కూడా ఆయన విడుదల చేశారు. "మా బంధువులు, స్నేహితులు, నాతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా టిడిపిలో కొనసాగుతూ ఉన్నారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం వల్ల ప్రయోజనం ఉండదు" అని నరసింహ యాదవ్ హితవు పలికారు.


నేను పార్టీ మారానంట..

‘‘కొన్ని పోస్టింగులలో నేను కూడా టిడిపిలో చేరినట్లు పెట్టారు’’ అని నరసింహ యాదవ్ గుర్తుచేస్తూ.. ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా అని ఒక్కసారి ఆలోచించుకోవాలని ఆయన హితవు పలికారు. పది సంవత్సరాల నుంచి మా బామ్మర్ది వెంకటేష్ యాదవ్.. టిడిపి కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. పార్టీతో సంబంధాలు అంతకన్నా లేవని ఆయన స్పష్టం చేశారు. తిరుపతిలో అధికార వైఎస్ఆర్సిపి, టిడిపి మధ్య సాగుతున్న ఈ వ్యవహారాలు పసందుగా మారాయి. ఇది కాస్త కూటమిలోని నాయకుల్లో మరింత ఐక్యత పెంచడానికి, ఛాలెంజ్‌గా తీసుకునే అవకాశాన్ని కల్పించినట్లు భావిస్తున్నారు. ఆ కోవలో..

టిడిపిలోకి కీలక నేతలు

తిరుపతి అసెంబ్లీ స్థానంలో కొన్ని కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వారిలో దొడ్డారెడ్డి కుటుంబం కూడా ఒకటి. స్థానిక పెద్ద‌కాపు వీధికి చెందిన దొడ్డారెడ్డి కుటుంబం టిడిపిలో చేరింది. దొడ్డారెడ్డి రామ‌కృష్ణారెడ్డి నేతృత్వంలో పసుపు కండువాలు వేసుకున్నారు. వారినీ టిడిపి జాతీయ కార్యదర్శి కార్యదర్శి నరసింహయాదవ్ స్వాగతించారు. మాజీ ఎమ్మెల్యే మోహ‌న్ వంటి బలిజ సామాజిక వర్గ నేతలు అందరూ ఏకతాటిపైకి వచ్చారు. టిడిపి నేతలు తమ పార్టీలో చేరారు అనే కవ్వింపు వ్యవహారం అధికార పార్టీకి రివర్స్ అయినట్లు భావిస్తున్నారు. తిరుపతి నగరంలో ఇద్దరూ బీసీ మహిళా కార్పొరేటర్లు కూటమి నాయకుల సమక్షంలో జనసేనలో చేరేలా చేసింది. వారిలో ప్రధానంగా రేవతి యాదవ్, కల్పన యాదవ్ తో పాటు వారి కుటుంబీకులు జనసేన కండువాలు వేసుకున్నారు. పోలింగ్ గడువు సమీపిస్తున్న వేళ ఇలాంటి చమక్కులు ఇంకా ఎన్నో జరిగేందుకు ఆస్కారం ఉన్నాయి.

Tags:    

Similar News