అరుణ పతాకంపై ఓ ధ్రువతార

జనం కోసం జీవించేవారు.. వారి గుండెల్లో పదిలంగా ఉంటారు. ఆస్తులు, జీవితాన్ని పేదలకు అంకితం చేసిన ఓ ఆదర్శ కమ్యూనిస్టును ఆ వర్గాలు నాలుగు సార్లు ఎంపీగా చేశాయి.

Update: 2024-04-28 12:12 GMT

( ఎస్.ఎస్.వి. భాస్కరరావ్)

తిరుపతి: ప్రస్తుత రాజకీయాల్లో కులం, డబ్బు కీలక పాత్ర పోషిస్తున్నాయి. భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చిన ఓ వ్యక్తి తన ఆస్తులే కాదు. జీవిత సర్వస్వాన్ని పేదలకు అంకితం చేశారు. పార్లమెంటేరియన్‌గా కూడా ఆదర్శంగా నిలిచారు. పార్లమెంట్ కీర్తి శిఖరాన్నే కాకుండా, తన జీవితాన్ని ఓ రాజకీయపాఠంగా వదిలి వెళ్లారు. ఎర్రజెండా కనిపించగానే పేదల మదిలో తెలియని ఉద్వేగం, ధైర్యం, కొత్త శక్తి ఆవహించినట్టు అనిపిస్తుంది. ఆ పతాకానికి ఉన్న అతీతమైన శక్తి అది. పీడిత వర్గాల కోసం ఆస్తులే కాదు. జీవితాన్ని కూడా ఓ ఆదర్శ కమ్యూనిస్టు అంకితం చేశారు. ఆ పేదలే ఆయనను నాలుగుసార్లు పార్లమెంటుకు పంపించారు.

భూస్వామ్య కుటుంబంలో జన్మించిన ఎద్దుల ఈశ్వరరెడ్డి సీపీఐ, పేద ప్రజల అభ్యున్నతి కోసం 600 ఎకరాలు ఉదారంగా ధారాదత్తం చేశారు. ఎర్రజెండా భుజానికి ఎత్తుకున్న ఆయనను ఆ పేద, పీడిత, తాడిత వర్గాల ప్రజానీకం నాలుగు సార్లు ఎంపీగా ఆదరించారు. దాంతో పేదల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోవడమే కాదు. "కమ్యూనిస్టు అంటే ఇలా ఉండాలి" అని తన జీవితాన్ని పాఠంగా అందించిన వ్యక్తిగా కూడా నిలిచారు. ఆయనే పెద్దపసుపుల (ఎద్దుల ఈశ్వరరెడ్డి) ఈశ్వరరెడ్డి.

ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి

బ్రహ్మచారిగానే ప్రజా జీవనం నుంచి శాశ్వతంగా విశ్రాంతి తీసుకున్న ఆయన అరుణపతాకంపై ఓ ధ్రువతారగా అయ్యారు. నేటి రాజకీయ నాయకులకు ఎద్దుల ఈశ్వర్ రెడ్డి ఆదర్శ జీవితం ఓ కొరడా దెబ్బలాంటిదని అంటున్నారు. "ఇప్పటి రాజకీయాలు చాలా దారుణంగా ఉన్నాయి" అని ఎద్దుల ఈశ్వరరెడ్డి రెండో తమ్ముడు వెంకటరెడ్డి కుమారుడు ఎద్దుల జగదీశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. " ఎద్దుల కుటుంబంలో నేను సభ్యుని కావడం గర్వంగా ఉంది" అని ఫెడరల్ ప్రతినిధితో తన భావాలను పంచుకున్నారు.

" నా నెంబర్ నీకు ఎలా దొరికింది అన్న" మమ్మల్ని వెతికి మరి పలకరిస్తున్నారంటే, చాలా ఆనందంగా ఉంది" అని చెబుతూనే.. "మా పెదనాన్న ఈశ్వర్ రెడ్డి ఎన్నికల్లో కూడా నేను తిరిగా. ఆ రోజులు మరువలేను" అని ఆయన వ్యాఖ్యానించారు. ఇంతకుముందు ఎన్నికల్లో నాడు - నేడు అని రాజకీయాలను విశ్లేషించే పత్రికలకు కూడా పాత తరం వారిని మరిచిపోయాయని కలత చెందారు. తరచూ పాత రోజులను గుర్తు చేయడం ద్వారా నేటితనం యువతకు రాజకీయాలంటే గౌరవం పెంపొందించేలా చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తర్వాత పెదనాన్న ఎద్దుల ఈశ్వరరెడ్డి విగ్రహం ఏర్పాటు వేశారని ఆయన తెలిపారు. చివరగా తెలిసిన విషయమేమిటంటే.. ఈ ఎద్దుల కుటుంబం నిజంగా జనం పిచ్చివాళ్లు అనిపించింది. ఎందుకు అంటే..

వారి కుటుంబం కోసం వాకబు చేయడానికి ఫోన్ చేసిన ఫెడరల్ ప్రతినిధికి సమయం కేటాయించిన ఆయన.. ఇంటి ఫోటోలు కావాలి అని కోరినప్పుడు ఆయన చెప్పిన మాట విని కాసింత బాధ కూడా కలిగింది. ఆ సమయంలో.. "జగదీశ్వర్ రెడ్డి కుమార్తె పురిటి నొప్పులతో జమ్మలమడుగు ఆసుపత్రిలో ఉన్నారు.నాకంటే జనంలోకి ఆదర్శ భావాలు వెళ్లాలి అనే ఆలోచనను విజయవాడ లయోలా కాలేజీలో బిఎస్సి చేసిన ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి పరిగణలోకి తీసుకున్నట్లు అనిపించింది.

జీవితం పేదలకు అంకితం

కడప జిల్లా రాజకీయ యవనికపై ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి జీవితం ఓ చెరగని సంతకం. ఆయన జీవితమంతా త్యాగం, దళిత పేద వర్గాల కోసం అంకితమైనదే. కడప లోక్‌సభ స్థానం నుంచి 1952లో సిపి అభ్యర్థిగా ఆయన మొదటిసారి ఎంపికయ్యారు. అప్పటి జాతీయ కాంగ్రెస్‌లో బలమైన నాయకుడుగా ఉన్న పెంచికల బసిరెడ్డిపై ఆయన గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా 1962, 1967, 1971లో కడప నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

భూస్వామ్య కుటుంబమైనా..

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం మండలం పెద్దపశుపుల గ్రామంలో భూస్వామ్య కుటుంబమైన ఎద్దుల చిన్న వెంకటసుబ్బారెడ్డి, మల్లమ్మ దంపతులకు 1915లో ఈశ్వర్ రెడ్డి జన్మించారు. నందలూరులో ఎస్‌ఎల్‌సి చదివారు. డిగ్రీ అనంతపురంలో పూర్తి చేశారు. స్వగ్రామానికి తిరిగి వచ్చిన ఆయన ప్రజాసేవలో మమేకమయ్యారు. స్నేహితులతో కలిసి మిత్రమండలిని స్థాపించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు, సోషలిస్టు భావాలు, వివేకానందుని బోధనలతో ఉత్తేజితులైన ఈశ్వరరెడ్డి తన స్నేహితులైన పిఆర్. సంజీవరెడ్డి, నూకల కొండయ్యతో కలిసి 1937లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1938లో డిసిసి సభ్యుడిగా నియమితులయ్యారు.

1939లో రమణ మహర్షి బోధనలతో రాజకీయాలకు స్వస్తి చెప్పిన ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి మౌనం పాటించారు. 1940లో స్వాతంత్ర సమరయోధుడు టేకూరు సుబ్బారావు ప్రోత్సాహంతో ఎద్దుల ఈశ్వర్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1941లో జాతిపిత మహాత్మా గాంధీ పిలుపుతో చెన్నూరులో సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఈశ్వర్ రెడ్డి.. 1945లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.

ఎద్దుల ఈశ్వర్ రెడ్డి చెల్లెలి అల్లుడు భాస్కర్ రెడ్డి

 

1947లో ఆయన స్వగ్రామమైన పెద్దపసుపల గ్రామంలో నిర్వహించిన ద్వితీయ రైతు మహాసభ సంచలనంగా మారింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు 1949 సెప్టెంబర్ 27వ తేదీ అర్ధరాత్రి పార్టీపై నిషేధం విధించారు. కమ్యూనిస్టు పార్టీ నాయకులను అరెస్ట్ చేయడానికి యంత్రాంగం రంగంలోకి దిగింది. అరెస్ట్ అయిన వారిలో ఎద్దుల ఈశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న పెద్దపసుపుల గ్రామస్తులు పోలీసులపై తిరుగుబాటు చేశారు. ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో లక్కిరెడ్డి కొండారెడ్డి అనే కార్యకర్త ప్రాణాలు కోల్పోయారు.

స్వరాజ్య స్థాపన కోసం పోరాటం చేసిన వారిలో ఎద్దుల ఈశ్వరరెడ్డి జీవితం ఆదర్శం. భూస్వామ్య వర్గ దోపిడీ, దౌర్జన్యాలకు, అరాచకాన్నీ ఎదురొడ్డిన ఆయన పేదల పక్షపాతిగా నిలవడమే కాదు వారి కోసం తన జీవితాన్ని, ఆస్తులను ధారాదత్తం చేసిన గొప్ప వ్యక్తి కూడా. కడప పార్లమెంటు స్థానం నుంచి నాలుగు సార్లు ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతోనే జనం గుండెల్లో ఆయన ఎంతగా స్థానం సంపాదించుకున్నారనేది స్పష్టం అవుతుంది. దీనిపై ఓ వ్యక్తి మాట్లాడుతూ..

" ఆయన నిస్వార్థపరుడు. శిథిలం కావడంతో ఇల్లు కూడా ఈ మధ్యనే కూలగొట్టేశాం" అని పెద్ద పసుపుల పంచాయతీ వార్డు సభ్యుడు, ఎద్దుల ఈశ్వరరెడ్డి చెల్లెలు రామసుబ్బమ్మ మనవడు ముద్దన భాస్కరరెడ్డి తెలిపారు. ఆయన గురించి విన్నాం, తెలుసుకున్నాం. ప్రజల కోసం బతకాలని పెద్దల ఈశ్వరరెడ్డి మా కుటుంబాలకు సందేశం ఇచ్చి వెళ్లారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

అజ్ఞాతంగా పోరాటం

దేశంలో క్విట్ ఇండియా ఉద్యమంతో పాటు ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం సాగుతున్న రోజులవి. ఎద్దుల ఈశ్వర్ రెడ్డి కూడా జిల్లాలో కమ్యూనిస్టు నేతగా అజ్ఞాతంలో ఉంటూనే దళాలను పని చేయించారు. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేసిన తర్వాత 1942 నుంచి బహిరంగంగా కమ్యూనిస్టులు సభలలో పాల్గొనడం జనాన్ని పార్టీ వైపునకు సమీకరించడం వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పని చేశారు. కడప జిల్లాలో పొన్నతోట వెంకటరెడ్డి, సంగమేశ్వర్ రెడ్డి, పందెం నరసింహారెడ్డి, గజ్జల మల్లారెడ్డి, కేవీ నాగిరెడ్డి, వరదారెడ్డితో కలిసి ఈశ్వర్ రెడ్డి అనేక రాజకీయ సమావేశాలు నిర్వహించారని చెబుతారు.

పీడితుల కోసం పోరాటం

కడప జిల్లా పెద్దముడియం మండలం పెద్దపసుపుల గ్రామానికి చెందిన ఎద్దుల ఈశ్వర్ రెడ్డి దళితులు, అణగారిన పేద వర్గ ప్రజానీకం కోసం అహర్నిశలు శ్రమించారు. భూస్వాములు దళితులపై ఎక్కడ దాడి చేసినా ఈశ్వర్ రెడ్డి ఆ గ్రామానికి వెళ్లి పోరాటాల్లో ముందుండేవారని ఆయనను చూసిన వారు చెప్పే మాట. ఎంపీగా ఉన్నప్పటికీ సైకిల్ మీద తిరిగే వారిని చెబుతారు.

నేలపై టవలు పరుచుకుని..

ఒకరోజు ఎన్నికల ప్రచారం నుంచి ప్రొద్దుటూరులోని సిపిఐ కార్యాలయానికి ఎద్దుల ఈశ్వరరెడ్డి తిరిగి వచ్చారు. "అప్పటికే ఆయన పరుపుపై ఆఫీస్ బాయ్ నిద్రపోతున్నాడు" అతన్ని నిద్రలేపడానికి ప్రయత్నించిన పార్టీ కార్యకర్తలను వారించిన ఈశ్వర రెడ్డి తన భుజం మీద ఉన్న టర్కీ టవల్ కటిక నేలపై పరుచుకుని పడుకున్నారు" అని ఆ సంఘటనను ప్రొద్దుటూరు ప్రాంత నాయకులు గుర్తు చేసుకుంటారు.

అన్నా.. అనేవారు

ప్రొద్దుటూరు ప్రాంతంలోనే కాదు. బహు భాషలు సాహిత్య రంగంలో సరస్వతీ పుత్రుడుగా పుట్టపర్తి నారాయణాచార్యులుకు పేరు ఉంది. ఆయన ఎద్దుల ఈశ్వరరెడ్డిని అన్న అని గౌరవంగా సంబోధించే వారిని చెబుతారు. ఈశ్వర్ రెడ్డి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న రోజుల్లోనే కడప జిల్లాలో ఆకాశవాణి కేంద్రం, మైలవరం రిజర్వాయర్ నిర్మాణం, ప్రధానంగా ఎర్రగుంటలో సిమెంట్ కర్మాగారాలు రావడానికి కృషి చేశారు. రాజకీయంగానే కాకుండా సాహిత్య కళా రంగాలలో కూడా అనేక మందిని ఆయన ప్రోత్సహించారని చెబుతారు. రా.రా.. గజ్జల మల్లారెడ్డి, వైసిపి రెడ్డి, సదుం సోదరులు, కేతు విశ్వనాథరెడ్డి, ఆర్విఆర్ వంటి వారిని కూడా ప్రోత్సహించే వారని ఓ సందర్భంలో కేతు విశ్వనాథరెడ్డి గతాన్ని గుర్తు చేసుకుంటూ వ్యాఖ్యానించారు. 1986 ఆగస్టు మూడో తేదీ ప్రొద్దుటూరు సిపిఐ కార్యాలయంలో ఆయన తుది శ్వాస విడిచారు. అప్పటివరకు ఆయన తన జీవితాన్ని, ఆస్తులను కమ్యూనిస్టు ఉద్యమం కోసం, పార్టీ కోసం ధారపోశారు.

గండికోటకు నామకరణం

కడప జిల్లాలో ఎద్దుల ఈశ్వరరెడ్డి ఆదర్శ పార్లమెంటు సభ్యుడిగా నిలిచారు. కమ్యూనిస్టు పార్టీ నేతల అభ్యర్థన గౌరవంగా సాగించిన దీవెనలతో సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అప్పటికే పూర్తయిన గండికోట ప్రాజెక్టుకు " ఎద్దుల ఈశ్వరరెడ్డి ప్రాజెక్టు"గా నామకరణం చేసి, సముచిత గౌరవం ఇచ్చారు. కమ్యూనిస్టు పార్టీ సానుభూతిపరుడైన దివంగత సీఎం వైయస్సార్ తండ్రి వైయస్ రాజారెడ్డి కూడా ఆనాటి ఎన్నికల్లో ఎద్దుల ఈశ్వర్ రెడ్డికి సహకారం అందించిన వ్యక్తుల్లో ఒకరిగా చెబుతారు.

జమ్మలమడుగు ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఆయన సోదరుడు నారాయణరెడ్డి కుటుంబాలు ఒకప్పటి కమ్యూనిస్టు సానుభూతిపరులే. ఎద్దుల ఈశ్వర్ రెడ్డిపై ఉన్న అభిమానం గౌరవంతో 2008లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ స్థలం పోలీస్ శాఖది అని చెప్పడంతో, ఎద్దుల ఈశ్వర్ రెడ్డి విగ్రహాన్ని అక్కడి నుంచి కదిపి 2021 నవంబర్ 8వ తేదీ జమ్మలమడుగు పాత బస్టాండ్‌లో పునఃప్రతిష్టించారు. ఈ కార్యక్రమానికి అప్పటి సీపీ రాష్ట్ర నేత డాక్టర్ కే నారాయణ, జమ్మలమడుగు ఎమ్మెల్యే శ్రీరెడ్డి కూడా హాజరై, ఎద్దుల ఈశ్వర్ రెడ్డి త్యాగాలను స్మరించుకున్నారు.

" ఆయన చాలా మంచి వ్యక్తి. మా పెద్దపసుపుల గ్రామానికి గొప్ప పేరు ఆయన వల్లే వచ్చింది" అని దళిత సామాజిక వర్గానికి చెందిన దళిత సర్పంచ్ కటారి నిర్మలమ్మ భర్త కటారి సుధాకర్ వ్యాఖ్యానించారు. "మేము పిల్లలం కాబట్టి మాకు తెలియదు. ఈశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులను చూస్తుంటే అర్థమవుతుంది. వారు ఎంత గొప్పోళ్ళో" అని అన్నారు.

నేను చూశా.. మాట్లాడా...

" విలువలకు నిలువెత్తు సాక్ష్యం. కడప జిల్లా రాజకీయ చరిత్రలో ఒక మరపురాని మహా మనిషి ఎద్దుల ఈశ్వరరెడ్డి" అని ప్రొద్దుటూరుకు చెందిన సీనియర్ జర్నలిస్టు షేక్ మహమూద్ బాషా వ్యాఖ్యానించారు. ప్రజాసేవకు జీవిత సర్వస్వాన్ని త్యాగం చేసిన మహా పురుషుడు. కడప సిపిఐ ఎంపీగా ప్రజాసేవలో చివరి వరకు తరించారు. తపించారు. ప్రజలు, ప్రజాసేవలో ఆయనకున్న నిబద్ధతకు అది నిదర్శనం" అని మహమూద్ బాషా అన్నారు. శేష జీవితం కూడా కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలోనే గడిపారంటూ.. తాను ఈశ్వరరెడ్డితో మాట్లాడిన, గడిపిన ఆ రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. "గండికోట ప్రాజెక్టుకు, ప్రొద్దుటూరులో ఓ ప్రాంతానికి ఈశ్వరరెడ్డినగర్" అని పేరు పెట్టారు. నేటి తరం రాజకీయ నాయకులు ఈశ్వర్ రెడ్డి జీవితాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News