నువ్వు నాన్ లోకల్.. కాదు నేను లోకల్..
సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని.. సుజనా చౌదరిల మాటల యుద్ధం మొదలైంది. చర్చగా మారిన ఇరువురు ఘాటైన వ్యాఖ్యలు.
By : The Federal
Update: 2024-04-02 12:57 GMT
జి. విజయ కుమార్
విజయవాడలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. టీడీపీ, జనసేన, బిజెపీ నేతలు, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధాలు మొదలయ్యాయి. సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని, విజయవాడ పశ్చిమ నియోజక వర్గం బిజెపీ అభ్యర్థి సుజనా చౌదరిల మధ్య చోటు చేసుకున్న మాటల యుద్ధం స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. నువ్వు నాన్‌లోకల్ అని నాని అంటే నేను లోకల్.. నాది విజయవాడని సుజనా చౌదరి ధీటుగా సమాధానం చెప్పారు. ఇది ముస్లింల సీటు, బిజెపీకి ఎలా కేటాయించారు.. ముస్లింలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాలని నాని అంటే, ప్రతి వార్డులో ప్రచారం చేస్తానని, అన్ని వర్గాలు తనకు అండగా నిలబడుతాయని.. ఇక్కడ నుంచి గెలిచి చూపిస్తానని సుజనా చౌదరి అంటున్నారు. ఇలా అనేక అంశాలపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం స్థానికుల్లో చర్చగా మారింది.
ముస్లీంలున్న చోట బిజెపీకి ఎలా సీటు కేటాయిస్తారు–నాని
ఎన్నికల ప్రచారంలో నాని మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజక వర్గం ఎక్కడుందో నీకు తెలుసా.. అక్కడ ఎన్ని రోడ్లుంటాయో తెలుసా.. విమానాల్లో తిరిగే నువ్వు విజయవాడ పశ్చిమ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసేది నిజమేనా అని విజయవాడ పశ్చిమ నియోజక వర్గం టీడీపీ, జనసేన, బిజెపీ కూటమి అభ్యర్థి అయిన సుజనా చౌదరిపై వ్యంగాస్త్రాలు సంధించారు నాని. సుజనా చౌదరి గతంలో కేంద్ర మంత్రిగా పని చేశారని, రెండు సార్లు రాజ్య సభ సభ్యుడుగా పని చేశారని, నాడు ఎప్పుడైనా విజయవాడకు కానీ, విజయవాడ పశ్చి నియోజక వర్గానికి కానీ ఒక్క రూపాయి కూడా కేటాయించ లేదని.. అలాంటి వ్యక్తి నేడు విజయవాడ వెస్ట్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తామంటే స్థానికులు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ఇది బీసీలు, ముస్లింలు, పేదలు, ఎస్సీలు అధికంగా ఉండే నియోజక వర్గమని, మొన్నటి వరకు బీసీలకు ఈ సీటును కేటాయిస్తారని చెబుతూ వచ్చారని, కానీ దానికి విరుద్దంగా ఒక ధనికుడైన వ్యక్తిని తీసుకొచ్చి బిజెపీ అభ్యర్థిగా ప్రకటించారని విమర్శించారు. న్యాయంగా ఇది బీసీలు, ముస్లింల సీటని, అందుకే గతంలో తన కుమార్తె ఇక్కడ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగిందని, దానిని అప్పుడే ఖండించానని చెప్పారు. నేను కానీ, నా కుటుంబ సభ్యులు ఇక్కడ నుంచి పోటీ చేయరని గతంలోనే చెప్పానన్నారు. ఇది బీసీలు, ముస్లింలకు చెందాల్సిన సీటని, వారికి కేటాయించడమే న్యాయమన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సామాన్యుడైన ఒక ముస్లిం నాయకుడు ఆసిఫ్‌ని వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారన్నారు. కానీ టీడీపీ, బీజెపీ, జనసేన కూటమి బీసీలు, ముస్లింలు, ఎస్సీలను కాదని చార్టెడ్ ఫైట్లల్లో తిరిగే ఒక వ్యాపార వేత్తను, ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగలిగిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి విజయవాడ వెస్ట్ అభ్యర్థిగా చేశారన్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చెప్పినట్లు ఇది ముమ్మాటికీ పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధమే అన్నారు. బీసీలను, మైనారిటీలను మోసం చేస్తూ బిజేపీకి సీటు కేటాయించడం ఒక తప్పైతే.. ఒక ధనవంతుడికి సీటు కేటాయించడం ఇంకా పెద్ద తప్పని ధ్వజమెత్తారు. ఈ సీటు బిజెపీకి ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు.
కేశినేని వ్యాఖ్యలకు ధీటుగా సుజనా స్పందన
కేశినేని వ్యాఖ్యలకు సుజనా చౌదరి ధీటుగా సమాధానం చెప్పారు. తాను లోకలేనని.. తనది విజయవాడేనన్నారు. చదువు కోసం చాలా మంది ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నట్లు నేను బయట రాష్ట్రాలకెళ్లాను. కేశినేని నానిలా తాను దిగజారి మాట్లాడను. అనవసరంగా నోరు పారేసుకోనని బదులిచ్చారు. అంత త్వరగా కేశినేని నాని రాజకీయాల్లో దిగజారి పోతారని తాను అనుకోలేదని.. ప్రత్యర్థులపై దిగజారుడు వ్యాఖ్యలు చేయనని వ్యంగంగానే సమాధానం చెప్పారు. అందరికీ అన్ని ప్రాంతాలు తెలియవని, అవసరమైతే జీపీఎస్ పెట్టుకొని విజయవాడ పశ్చిమలోని ప్రతి వీధి తిరుగుతానని.. ప్రచారం చేస్తానని చెప్పారు. విజయవాడ పశ్చిమలోని జనసేన నేత పోతిన మహేష్‌ను కూడా తమతో కలిసి పని చేస్తారని, మా మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పోతిన మహేష్‌తో మాట్లాడుతారని అన్ని సమస్యలు సర్దుకుంటాయన్నారు. మూడు పార్టీలు కలిసి పని చేస్తాయని .. ఇక్క నుంచి గెలచి చూపిస్తారన్నారు. గెలిస్తే అభివృద్ధింటే ఏమిటో చూపిస్తానన్నారు. ప్రారంభంలోనే ఇలాంటి ఘాటైన మాటల యుద్ధం ఉంటే రాను రాను ఎలాంటి యుద్దాలు చూడాల్సి వస్తోందని స్థానికులు చర్చించుకుంటున్నారు.