జగన్ తిరుమల పర్యటన రద్దు.. రాజకీయ వర్గాల విస్మయం

తిరుమల తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన తిరుపతి పర్యటన రద్దయింది.

Update: 2024-09-27 09:28 GMT

తిరుమల తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన తిరుపతి పర్యటన రద్దయింది. వైసీపీ అధినేత జగన్‌పై దాడి జరగొచ్చని ఊహాగానాల నేపథ్యంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఆయన పర్యటనకు ముందే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు అత్యవసరంగా భేటీ అయ్యి.. జగన్ పర్యటనను అడ్డుకోకూడదని నిర్ణయించారు. ఈ నిర్ణయం వెలువడిన రెండు గంటల్లోపు జగన్ పర్యటన రద్దయినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అన్యమతస్తుల వల్ల తిరుపతి లడ్డూ అపవిత్రమైందన్న చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఈనెల 28న రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పూజలు చేయాలని పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అదే రోజు తిరుమల నుంచి శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం శుక్రవారం సాయంత్రం బయలుదేరి తిరుపతి చేరుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన రద్దయింది.

జగన్ మోహన్ రెడ్డి తిరుమల వస్తే అలిపిరి వద్ద డిక్లరేషన్ ఇచ్చి కొండపైకి రావాలంటూ బీజేపీ, టీడీపీ, జనసేన సహా మరికొన్ని హిందూ మత సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. డిక్లరేషన్ ఇచ్చేది లేదంటూ వైసీపీ స్పష్టం చేసింది. 2009లోనే జగన్ మోహన్ రెడ్డి.. తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చారని, అందువల్ల తిరిగి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని వైసీపీ వాదిస్తోంది. దీనికి తగ్గట్టుగా రాష్ట్రప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం కూడా వైఎస్ జగన్ 2009లో డిక్లరేషన్ ఇచ్చారని ప్రకటించారు. అయితే టీడీపీలోని ఒక వర్గం మాత్రం జగన్ మరోసారి తన డిక్లరేషన్ ఇవ్వాలని పట్టబడుతోంది. ఇందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో తిరుమలలోని అనేక హిందూ ధార్మిక సంస్థలు జగన్ మోహన్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ ధర్నాలు, ఆందోళనలు, నిరసన ప్రదర్శనలకు దిగాయి.

ఆలయాలకు ఎవరు వచ్చినా సాదరంగా ఆహ్వానించే తత్వం హిందూ ధర్మంలో ఉందని, దీంట్లో భాగంగానే వైఎస్ జగన్ తిరుమల వచ్చినప్పుడు ఆయనను ఘనంగా స్వాగతిస్తామని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. తిరుపతి లడ్డూ వ్యవహారాన్ని రాజకీయ అంశంగా మార్చి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నాయని ఆయన విమర్శించారు.

జగన్ పర్యటన రద్దు కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. భక్తులు సైతం ఊరట చెందారు. పర్యటన రద్దు చేసుకున్న జగన్ మరికొద్ది సేపట్లో మీడియాతో మాట్లాడతానని ప్రకటించారు.

Tags:    

Similar News