రైల్వే జోన్ ఏదన్నా? ఏమైందన్నా?
విశాఖ పాలన రాజధాని అన్న జగన్ వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్. రైల్వే జోన్ ఏది, ఏమైందని ప్రశ్నించారు.
Update: 2024-03-07 09:00 GMT
ఆంధ్ర ఎన్నికలు రోజురోజుకూ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. తమ ప్రత్యర్థులు చేసిన అన్యాయాలు, అవినీతులే టార్గెట్‌గా విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి అధికారంలోకి వస్తే విశాఖ నుంచే పాలన చేస్తామని, అక్కడే తన ప్రమాణ స్వీకారం జరగుతుందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కౌంటరిచ్చారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడానికి ఇన్నాళ్లు ఏం అడ్డొచ్చిందని నిలదీశారు. ఈ ఐదేళ్ల పాలనలో ప్రజలను మోసం, దగా చేయడం తప్ప జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో బడా బడా కంపెనీలన్నీ రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోతుంటే చోద్యం చూస్తూ కూర్చున్నారే తప్ప వారిని ఆపడానికి ఏం చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
అసలు జగన్ ఏమన్నారంటే!
అమరావతిని రాజధానిగా చేయడానికి వైసీపీ వ్యతిరేకంగా కాదని, అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించింది మేమే కదా అని గుర్తు చేశారు. ‘‘విశాఖను హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పోటీ పడేలా పదేళ్లలో మారుస్తాం. ఈ సారి గెలిస్తే అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తా. విశాఖ, రాజధాని అభివృద్ధికి అనుకున్న ప్రణాళికలన్నీ పదేళ్లలో సాకారమవుతాయి. అందులో సందేహం అక్కర్లేదు’’
ఇన్నాళ్లు ఏమైంది: షర్మిల
విశాఖను పరిపాలన రాజధాని చేశామన్న జగన్ ఇన్నాళ్లూ పరిపాలన రాజధాని నుంచి ఎందుకు పాలనను ప్రారంభించలేదని షర్మిల ప్రశ్నించారు. విశాఖ విషయంలో అభివృద్ధి జరగకపోవడానికి, ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు బయటకు వెళ్లిపోవడానికి వైసీపీ చేతకాని కమిట్‌మెంటే కారణమని మండిపడ్డారు. ఆంధ్రకు తలమానికంలా ఉండే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం ప్రవేటు పరం చేస్తుంటూ ప్రేక్షకపాత్ర వహించడమే జగన్ విజనా? రైల్వే జోన్ పట్టాలు ఎక్కకపోయినా జగన్ మౌనం ఎందుకు పాటించారు? ఉన్న గుట్టల్ని తవ్వడం, పోర్టులను అమ్మేయడం, భూములను మింగేయడమే వైసీపీ విజనా? పదేళ్ల వ్యూహాల పేరిట మళ్లీ వైసీపీ నాటకాలు చేస్తోందని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ లక్ష్యం గెలుపు కాదేమో!
2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదపట్లేదని విశ్లేషకులు అంటున్నారు. ఈ సారి ఎన్నికలతో రాష్ట్రంలో కోల్పోయిన గౌరవాన్ని, ప్రజల నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడమే కాంగ్రెస్ టార్గెట్ అని, 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ బరిలోకి దిగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈసారి ఎన్నికల ప్రచారంలో విభజన డిక్లరేషన్, ఆంధ్రకు ప్రత్యేక హోదా ప్రధాన అంశంగా వ్యూహాలు రచిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.