తెరపైకి వైఎస్ వివేకా హత్య కేసు..నలుగురిపై కేసు నమోదు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో కీలక మార్పు చోటు చేసుకుంది. ముగ్గురు మాజీ అధికారులపై కేసు నమోదు చేశారు.;
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారం చేపట్టాక తొలి సారి మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు తెరపైకొచ్చింది. ఇప్పటి వరకు గతంలో టీడీపీ కార్యాలయాలపై దాడుల కేసులు, సోషల్ మీడియా కేసులు, ప్రభుత్వ భూముల ఆక్రమణ కేసులపై దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం తాజాగా వివేకానందరెడ్డి కేసును తెరపైకి తెచ్చింది. వివేకా హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి గతేడాది చేసిన ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేశారు. దస్తగిరి 2023లో నలుగురిపై పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను కడప జైలులో ఉండగా 2023 నవంబరులో కడప జైలుకు వచ్చి సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని ఇదే కేసులో నిందితుడుగా ఉన్న శివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి బెదిరించినట్లు దస్తగిరి తన ఫిర్యాదు చేశాడు.
సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే తనకు రూ. 20 కోట్లు ఇస్తామని చైతన్య రెడ్డి చెప్పారని, జైలు సూరింటెండెంట్ ప్రకాశ్ తనను ఇబ్బంది పెట్టారని, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు మద్దతుగా మాట్లాడాలని డీఎస్పీ నాగరాజు, సీఐ ఈ శ్వరయ్య బెదిరించినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ మేరకు వివేకా హత్య కేసులో నిందితుడుగా ఉన్న శివశంకర్‌రెడ్డి కుమారు డాక్టర్ చైతన్యరెడ్డి, ఇది వరకు జమ్మలమడుగు డీఎస్పీగా పని చేసిన నాగరాజు, ఎర్రగుంట్ల సీఐగా పని చేసిన ఈశ్వరయ్య, కడప జైలు సూపరింటెండెంట్‌గా పని చేసిన ప్రకాశ్‌ల మీద 2023లో దస్తగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా దీనిని తెరపైకి తీసుకొచ్చారు. దస్తగిరి ఫిర్యాదు మేరకు ఈ నలుగురిపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు.