గత ప్రభుత్వ పాపాలే నేడు ప్రజల పాలిట శాపాలయ్యాయి: చంద్రబాబు

గత ప్రభుత్వ నిర్లక్ష్యం, అలసత్వం, స్వార్థపూరిన నిర్ణయాల వల్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో వరదలు అతలాకుతలం చేశాయని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు.

Update: 2024-09-07 17:12 GMT

గత ప్రభుత్వ నిర్లక్ష్యం, అలసత్వం, స్వార్థపూరిన నిర్ణయాల వల్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో వరదలు అతలాకుతలం చేశాయని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. నీటి ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం తన కర్తవ్యాన్ని సరైన క్రమంలో నిర్వర్తించి ఉంటే ఈరోజున లక్షలాది మందిన ఆహారానికి అల్లాడుతూ చీకటి గదుల్లో బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురుచూడాల్సిన అవసరం వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం చేసిన పాపాలు ప్రజల పాలిట శాపాలు అయ్యాయంటూ సీఎం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు శనివారం కూడా పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించి, వాటి గురించి పూర్తి వివరాలను అధికారులను ఆరా తీశారు. ప్రజలకు అన్ని వేళల్లో అందుబాటులో ఉండి, వారికి కావాల్సిన సహాయం అందించాలని, ప్రజలకు అందించే సహాయక చర్యల విషయంలో రాజీ పడొద్దని ఆదేశించారు. తమ ప్రభుత్వం అన్ని విధాలు ప్రజలకు అండగా ఉంటుందని, ఏ కష్టం వచ్చినా వారిని ఆదుకుంటామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. పర్యటన అనంతరం విజయవాడ కలెక్టరేట్ దగ్గర ప్రజలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

మేము గత ప్రభుత్వంలా కాదు

‘‘గత ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు పులిచింతల, గుండ్లకమ్మ గేట్లను పట్టించుకోలేదు. బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేసేశారు. దాని వల్లే ఇప్పుడు బుడమేరుకు పలు చోట్ల గండ్లు పడ్డాయి. కానీ మేము గత ప్రభుత్వంలా కాదు. బుడమేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. మళ్ళీ ఇటువంటి పరిస్థితులు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటాం. వరద ప్రాంతాల్లో ఇంకా సహాయక చర్యలు శరవేగంగా కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఇంకా 4అడుగుల మేర వరద నీరు ఉంది. ఇప్పుడు మళ్ళీ పడుతున్న వర్షం కారణంగా రోడ్లపై నిలిచిన నీరు అధికం అవుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా నీటిమట్టం మళ్ళీ అధికం అవుతోంది. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు సహాయక చర్యలకు కొనసాగిస్తాం. ఆదివారం, సోమవారం కూడా వరద బాధితులకు ఆహారం, తాగునీరు, ఔషధాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. శుక్రవారం ఒక్కరోజు 66 వేల మందికి ఆహారం అందించాం. వరద బాధితులకు పాలు, పండ్లు కూడా అందిస్తున్నాం. వరద బాధితులకు ఇంటింటికీ వెళ్లి సరుకుల కిట్ అందించేలా ప్లాన్స్ చేస్తున్నాం’’ అని చెప్పారు.

ప్రజలు డిమాండ్ చేయాలి..

‘‘ఎవరికైనా సహాయక చర్యలుకానీ, ఆహారం ప్యాకెట్లు, నిత్యావరసరాల కిట్ అందకపోతే ఏ అధికారిని ప్రాధేయ పడొద్దు. డిమాండ్ చేసి మీకు అందాల్సిన వాటిని తీసుకోవాలి. ప్రజలు ఎవరికీ భయపడాల్సిన పని లేదు. మేము అందించే సహాయం పొందడం మీ హక్కు. మీ హక్కును మీరు డిమాండ్ చేయాలే తప్ప రిక్వస్ట్ కాదు’’ అని ప్రజలకు సూచించారు. ‘‘ఇవాళ రాయితీ ధరపై 64 టన్నుల కూరగాయలు విక్రయించాం. వరద ప్రాంతాల్లోని రోడ్లను 78శాతం శుభ్రం చేశారు. ఇంకా కొన్ని ప్రాంతాలు మినహా అన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా కూడా పునరుద్దరించాం. ఇంకా నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో కూడా విద్యుత్‌ను పునరుద్దరించేలా చర్యలు చేపడుతున్నాం. సెల్ టవర్లు పునరుద్దరణ పనులను వేగంగా చేస్తున్నాం. 1.40 లక్షల ఇళ్లలో సామాగ్రి పాడైంది. తమకు ఉపాధి కల్పించాలని చాలా మంది కోరుతున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలతో చర్చలు చేస్తున్నాం. చర్చలు సఫలమైన వెంటనే ఉపాధి అవకాశాలు అందుతాయి. కేంద్రానికి వరద నష్టానికి సాయంగా మొదటి విడతగా రూ.6,880 కోట్లు కోరాం’’ అని ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News