వైఎస్‌ఆర్‌సీపీది వింత పోకడ

పెరిగిన విద్యుత్‌ ఛార్జీలపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా రేపు వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు ధర్నాలు, నిరసనలు చేపట్టనున్నారు.

Update: 2024-12-26 08:32 GMT

ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన విద్యుత్‌ ఛార్జీలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీది వింత పోకడని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ విమర్శించారు. విద్యుత్‌ ఛార్జీలను పెంచింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వమేనన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ ∙చార్జీలను, మళ్లీ వాళ్లే తగ్గంచమని ధర్నాలకు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి గొట్టిపాటి రవి ఎద్దేవా చేశారు. పెంచిన వాళ్లే తగ్గించమని ధర్నాలు చేయడం వింతగా ఉందన్నారు. ఈ తరహా వింత పోకడలు ఎక్కడా చూడలేదని మండిపడ్డారు. విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాలని కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయడం కాదని, ఆ ఛార్జీలను పెంచిన మాజీ సీఎం జగన్‌ ఇంటి ముందుకెళ్లి ధర్నాలు చేయాలని విమర్శించారు. ప్రజలపై విద్యుత్‌ భారాలు మోపాలని ఈఆర్‌సీకి సిఫార్సు చేసింది నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. విద్యుత్‌ రంగ సంస్థలను జగన్‌ ఎలా నాశనం చేశారో అందరికీ తెలుసన్నారు. జగన్‌ తన అనుయాయులకు దోచి పెట్టేందుకు విద్యుత్‌ను అధిక ధరలకు కొనుగోలు చేసి ప్రజలపై భారాలు మోపారని విమర్శించారు. 2014–19లో తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు మిగులు విద్యుత్‌ ఇచ్చిందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన విద్యుత్‌ ఛార్జీలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనలకు పిలుపు ఇచ్చింది. ఈ నెల 27న అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేపట్టాలని నిర్ణయించింది. ఆ మేరకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ర్యాలీలు, నిరసనలు చేపట్టాలని, అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపు ఇచ్చారు. దీనిలో పాల్గొని జయప్రదం చేయాలని తన పార్టీ శ్రేణులకు సూచించారు. దీంతో అన్ని చోట్ల శుక్రవారం నిరసనలు, ధర్నాలు చేసేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ స్పందించారు. విద్యుత్‌ ఛార్జీలను పెంచిన వాళ్లే తగ్గించాలని ధర్నాలకు పిలుపు ఇవ్వడం వింతగా ఉందని విమర్శలు చేశారు.
Tags:    

Similar News