వైసీపీలో నేనుండలేనన్న ఈ ఎమ్మెల్యే ఎవరు?

వైఎస్ఆర్‌సీపీకి మరో షాక్ తగిలింది. నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు బీజేపీలో చేరారు. తిరుపతి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది.

Update: 2024-03-24 09:09 GMT
వరప్రసాదరావును పార్టీలోకి ఆహ్వానిస్తున్న కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్


(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్‌సీపీకి మరో షాక్ తగిలింది. గూడూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ వెలగపల్లి ప్రసాదరావు ఆదివారం బీజేపీలో చేరారు. తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి ఆయన పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతి ఎస్సీ రిజర్వుడ్ ఎంపీ స్థానం నుంచి కర్ణాటక రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ కే రత్నప్రభ లేదా ఆమె కుమార్తె నిహారిక ప్రయత్నాల్లో ఉన్నారు.

తిరుపతి నగరంలో స్థానికుడైన తన అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలించాలని ముని బాలసుబ్రమణ్యం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన సత్యవేడు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా ఉన్నారు. కూటమి పార్టీల పొత్తు ఉండడం వల్ల, ఎలాగైనా గెలవచ్చని ధైర్యంతో బీజేపీలో కూడా ఆశావహుల సంఖ్య వేళ్ళ మీద లెక్కించే స్థాయిలోనే ఉంది. ఆ కోవలోనే గూడూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ విలక్ పల్లి ప్రసాద్ రావు కూడా చేరినట్లు కనిపిస్తోంది.

ప్రజారాజ్యంతో రాజకీయాల్లోకి..

తూర్పుగోదావరి జిల్లా పాసర్లపూడికి చెందిన డాక్టర్ వెలగపల్లి ప్రసాదరావు 1983 బ్యాచ్ తమిళనాడు క్యాడర్ ఐఏఎస్ అధికారి. 2007 వరకు తమిళనాడు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఉన్నత స్థాయిలో ఆయన పనిచేశారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీతో ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. తిరుపతి ఎంపీ సీటు నుంచి పోటీ చేసిన వెలగపల్లి వరప్రసాదరావు ఓటమి చెందారు. తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన వైఎస్ఆర్‌సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో తిరుపతి నుంచి వైఎస్ఆర్‌సీపీ తరపు ఎంపీగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో ఆయన నెల్లూరు జిల్లా గూడూరు ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

సర్వే ఫలితాల్లో పనితీరు బాగాలేదన్న కారణంగా గూడూరు సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావుకు ఈ ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వలేదు. వరప్రసాద్ స్థానంలో స్థానంలో నేరుగా మురళిని సమన్వయకర్తగా నియమించడమే కాకుండా, అభ్యర్థిగా కూడా ప్రకటించింది. తిరుపతి ఎంపీ ఆ తర్వాత నెల్లూరు జిల్లా గూడూరు వైఎస్ఆర్‌సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ వెలగపల్లి ప్రసాదరావుపై అనేక ఆరోపణలు ఉన్నాయి.

చెన్నైలో నివాసముండే వరప్రసాదరావు కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే నియోజకవర్గాల్లో అందుబాటులో ఉంటారని ఆరోపణ ఉంది. ఇద్దరు పిల్లలు నియమించుకుని వారి ద్వారా కార్యకలాపాలు సాగిస్తుంటారని అపవాది కూడా లేకపోలేదు. ఎంపీగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఆయన పార్టీ నాయకులు సహచర ఎమ్మెల్యేలతో సఖ్యత లేదనే విషయం బాహాటంగా వినిపిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అవినీతి మరక కూడా అంటించుకున్నట్లు సమాచారం. దీనివల్లే ఆయనకు టికెట్ ఇవ్వడానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరస్కరించినట్లు తెలిసింది.

రాజకీయాల్లో కొనసాగాలనే తపనతో.. కమలం గూటికి..

గూడూరు నుంచి మళ్లీ టికెట్ దక్కే అవకాశం లేదని భావించిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు నెలరోజుల నుంచి బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు సాగించారు. ఎట్టకేలకు ఆదివారం ఆయన ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ సమక్షంలో కాషాయ కండువా వేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. " నేను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదు" అని డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు స్పష్టం చేశారు. " పనితీరు బాగాలేదనే నెపంతో దళితులు ప్రాతినిధ్యం వహిస్తున్న సీటులో మాత్రమే అభ్యర్థులను మార్చారు" అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా దెప్పి పొడిచారు. "ప్రజారాజ్యంలో కొణిదెల చిరంజీవి, వైఎస్ఆర్‌సీపీలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాకు మంచి అవకాశాలు ఇచ్చారు. వారికి ధన్యవాదాలు’’ అని వ్యాఖ్యానించారు.

తిరుపతి సీటుపై కన్ను

చిత్తూరు జిల్లా తిరుపతి ఎస్సీ రిజర్వుడ్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయడానికి గూడూరు సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ పల్లి ప్రసాద్ రావు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తిరుపతి పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి కేటాయించింది. 2014 ఎన్నికల్లో తిరుపతి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన వెలగపల్లి ప్రసాదరావుకు ఢిల్లీలోని బీజేపీ నేతలతో సత్సంబంధాలు ఉండేవని చెబుతారు. తమిళనాడు బీజేపీ నాయకులతో కూడా ఆయనకు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. పార్టీలో చేరేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ఢిల్లీలోని పార్టీ నాయకులతో లాబీయింగ్ చేయడంలో వరప్రసాద్ సఫలమైనట్లు కనిపిస్తోంది. కూటమికి కేటాయించిన సీట్లలో పోటీ చేయించేందుకు అభ్యర్థుల కోసం బీజేపీ కసరత్తు చేస్తోంది. ఆ జాబితాలో తన పేరు ఉండేటట్లు చూసుకోవాలని వెలగపల్లి ప్రసాదరావు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిసింది.



Tags:    

Similar News