కాంగ్రెస్‌లోకి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే
వైఎస్సార్‌సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇందుకు సంబంధించి రంగం సిద్ధమైంది.
Byline : The Federal
Update: 2023-12-30 16:51 GMT
వైఎస్సార్‌సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇందుకు సంబంధించి రంగం సిద్ధమైంది. ఇటీవల ఆయన ఎమ్మెల్యే పదవికి, వైఎస్సార్‌సీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇంకా స్పీకర్ ఈ రాజీనామాను ఆమోదించలేదు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశం ఉంది. వైఎస్సార్‌సీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆర్‌కే ఆ తరువాత మీడియాకు దూరంగా ఉన్నారు. మూడు రోజుల క్రితం వైఎస్‌ఆర్‌టీఎఫ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కలిసి తన రాజకీయ భవిష్యత్‌పై చర్చించారు. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కాదని బయటకు వచ్చిన ఆర్‌కే మొదటి నుంచీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి సన్నిహితంగా ఉంటూ వచ్చారు. వైఎస్ విజయమ్మతో ఏ విషయాన్నైౖనా నేరుగా చెప్పడం ద్వారా వైఎస్ కుటుంబంలో ఒక సన్నిహితమైన వ్యక్తిగా మెలగగలుగుతున్నారు.
షర్మిలతోనే రాజకీయ పయనం
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో వైఎస్‌ఆర్‌టీఎఫ్‌ను విలీనం చేయడం ద్వారా ఏపీ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పలు సార్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మాట్లాడారు. ఎప్పుడు కాంగ్రెస్‌లో చేరుతారనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం క్లారిటీ ఇంకా లేదు. త్వరలోనే చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరుతుందో అప్పుడు ఆర్‌కే కూడా కాంగ్రెస్‌లో చేరి మంగళగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి వస్తారని ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది.
తన రాజకీయ జీవితం గురించి షర్మిలతో చర్చ
ఆళ్ల రామకృష్ణారెడ్డి తన రాజకీయ జీవితం గురించి వైఎస్ షర్మిలతో చర్చించారు. ఆళ్ల రాజకీయ జీవితానికి వచ్చిన ఢోకా ఏమీలేదని షర్మిల భరోసా ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే మనం కాంగ్రెస్‌లోకి వెళుతున్నాం, నాతోనే నీ పయనం కూడా అంటూ షర్మిల ఇచ్చిన భరోసాతో ఆర్‌కే తిరిగి మంగళగిరి చేరుకున్నారు. శనివారం ఉదయం మంగళగిరిలోని తన కార్యాలయంలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ‘తన రాజకీయ భవిష్యత్ వైఎస్ షర్మిలతో ముడిపడి ఉందని, ఆమెతోనే కలిసి రాజకీయంగా అడుగులు వేస్తానని, కాంగ్రెస్‌లో చేరే విషయంలో షర్మిలకు ఇంకా స్పష్టత రాలేదని వెల్లడించారు’ దీనిని బట్టి ఆర్‌కే కాంగ్రెస్‌లో ఉంటారనేది స్పష్టమైంది.