TDP vs YSRCP | కోట్లు పెట్టయినా ఆ పోస్టుల్ని కొట్టేయాల్సిందే

ఉపఎన్నికలతో జడ్పీటీసీ, కార్పొరేటర్లకు గిరాకీ పెరిగింది. వారిని కాపాడుకునేందుకు వైసీపీ క్యాంపు రాజకీయాలకు తెరతీసింది.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-03-24 13:48 GMT

ప్రసుతం ఐపీఎల్ ఫీవర్ తో ఆంధ్రరాష్ట్రం ఊగిపోతోంది. గుట్టుచప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగులు సాగుతుంటే మరోపక్క రాష్ట్రంలో పదవులు కోట్లలో పలుకుతున్నాయి. పోస్టులకు రేట్లు కట్టి చేజిక్కించుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు కుస్తీ పడుతున్నాయి. దీనికంతటికీ కారణం స్థానిక సంస్థల పదవులకు గంట మోగడమే. స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు మార్చి 27న ముహూర్తం ఖరారు చేశారు. దీంతో అధికార టీడీపీ కూటమి ఎలాగైనా పట్టు సాధించాలని చూస్తుండగా ఎలాగైనా ఉన్నవాటిని నిలబెట్టుకోవాలని ప్రధానప్రతిపక్షమైన వైసీపీ చూస్తోంది.

కడప జెడ్పీ చైర్మన్, కర్నూలు, విశాఖపట్టణం నగర మేయర్ పదవులు కీలకంగా మారాయి. చివరాఖరికి ఆధ్యాత్మికంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన తరుపతి రూరల్ ఎంపీపీ పదవికి కూదా ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పదవుల్లో ప్రస్తుతం వైసీపీ ప్రతినిధులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా మాజీ సీఎం వైఎస్. జగన్ కాస్త ముందుజాగర్తలు తీసుకున్నట్లు స్పష్టమైంది.

ఎలాగంటే...

నగర పాలక సంస్థలో కార్పొరేటర్ మేయర్ పదవిని దక్కించుకుంటారు. పార్టీ నిర్ణయించే కార్పొరేటర్ ను మిగతా వారు పరోక్ష పద్ధతిలో ఎన్నుకోవడం ఆనవాయితీ చేశారు. మున్సిపాలిటీలో కౌన్సిలర్లు కలిసి చైర్మన్ ను, ఎండల ప్రజా పరిషత్తులో ఎంపీటీసీ సభ్యులు అధ్యక్షుడిని ఎన్నుకునే పద్ధతి అమలులో ఉంది.

వైస్. జగన్ సీఎంగా ఉన్న సమయంలో పదవుల కోసం పోటీ నివారించడానికి ఇద్దరిని డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీలో ఇద్దరు వైస్ చైర్మన్లను నియమించే పద్ధతికి తెర తీశారు.

కాపాడింది ఆ నిర్ణయమే : వైసీపీ అధికారంలో ఉండగానే జగన్ తీసుకున్న నిర్ణయం మేయర్లు, మున్సిపల్ చైర్మన్లకు వరమైంది. "అధికారం చేపట్టిన రోజు నుంచి నాలుగేళ్లు అవిశ్వాసం పెట్టడానికి వీలు లేదు" అనే ఉత్తర్వులతో వారి పదవులకు రక్షణ కల్పించారు.య దీంతో ఇప్పటి వరకు ఆ పదవుల్లో ఉన్న వైసీపీ ప్రతినిధులు నిర్భీతిగా ఉన్నారు.

రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. తొమ్మిది నెలల తరువాత స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేయడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ మేరకు జెడ్పీ, నగర మేయర్, డిప్యూటీ మేయర్, ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవుల భర్తీకి ఈ నెల 27వ తేదీ ముహూర్తంగా నిర్ణయించింది. వచ్చే ఏడాది ఈ సంస్థలకు మళ్లీ సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో

రగిలిన రాజకీయ వేడి

ఎన్నికల కమిషన్ ఆదేశంతో రాజకీయంగా కాక రగిలింది. వైసీపీ ఆధీనంలోని పాలక మండళ్లలో పాగా వేయాలని టీడీపీ కూటమి రంగం సిద్ధం చేసింది. దీనిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వైసీపీకి పాట్లు తప్పడం లేదు. తమ సభ్యులను పొరుగు రాష్ట్రాల్లో క్యాంపులకు తరలించారు విందు, వినోదాలలో సేదదీరుస్తున్నారు.

కడప నుంచి ప్రతిష్టాత్మకం

కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవి రాజంపేట ఎమ్మెల్యే ఏ. అమరనాథరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీ అయింది. ఈ పదవికి బి.మఠం జెడ్పీటీసీ సభ్యుడు రామ గోవిందరెడ్డిని వైసీసీ ఎంపిక చేసింది. కడప జెడ్పీలో 50 మంది జడ్పీటీసీ సభ్యుల్లో గోపవరం నుంచి టీడీపీ ప్రతినిధి ఒకరే విజయం సాధించారు. మిగతా 49లో ఒంటిమిట్ట నుంచి గెలిచిన అమరనాథరెడ్డి రాజీనామా చేయడం, పులివెందుల జెడ్పీటీసీ అనారోగ్యంతో మరణించడం వల్ల ఏడాది నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. అంటే 47 మంది సభ్యుల బలం వైసీపీకి ఉంది.

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఎనిమిది మంది వైసీపీ సభ్యులు జంప్ అయ్యారు. అయినా, వైసీపీ బలానికి కొరత లేదు. ఈ సీటులో పాగా వేయాలని టీడీపీ లోలోన ప్రయత్నాలు సాగిస్తుండడం గమనించిన వైసీపీ నేతల సమాచారంతో జగన్ అలర్ట్ అయ్యారు.

క్యాంపులకు తరలింపు

కడప జెడ్పీటీసీ సభ్యుల్లో కొందరిని బెంగళూరు, ఇంకొందరిని హైదరాబాద్ కు విహారయాత్రకు తరలించినట్లు సమాచారం. వైఎస్. జగన్ ఆదేశాల నేపథ్యంలోనే వైసీపీ నేతలు ఇందులో కీలక బాధ్యతలు తీసుకుని, ఒకరు కూడా చేజారకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు కడప నుంచి అందిన సమాచారం. ఒకో జడ్పీటీసీ సభ్యుడికి భారీగానే నజరానాలు సమర్పించినట్లు చెబుతున్నారు.

భయం దేనికి ? : ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ పాలనలో ఛోటోమోటా నేతలు కూడా కాంట్రాక్టులు చేశారు. అయితే, పెద్ద నేతలకు మంజూరు అయినంగా బిల్లలు వారికి మాత్రం కాలేదు. ఒక్కొక్కరికి తక్కువలో తక్కువ అంటే రెండు కోట్లకు పైగానే బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత స్థానిక సంస్థల ప్రతినిధులు వడ్డీలు చెల్లించకపోతున్నట్లు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల తరువాత మొదటిసారి పులివెందుల పర్యటనకు వచ్చిన సమయంలో జగన్ ను కౌన్సిలర్లే గట్టిగా నిలదీశారనే వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విషయంలోనే వైసీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు కలవరం చెందుతున్నట్లు భావిస్తున్నారు. అధికార పార్టలోకి వెళితే ఆర్థికంగా నిలబడడానికి ఆస్కారం ఉంటుందనే భావనలో ఉన్నట్లు తెలిసింది. ఈ కారణంగానే వైసీపీ తమ సభ్యులను కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలకు తెరతీసి, పొరుగు రాష్ట్రాలకు తరలించినట్లు తెలిసింది.

తిరుపతి అత్యంం ప్రతిష్టాత్మకం

తిరుపతి రూరల్ మండల పరిషత్ కూడా వైసీపీకి కీలకంగా మారింది. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఈ మండలం నుంచి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి ఎంపీపీగా రాజకీయ అరంగేట్రం చేశారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి మోహిత్ ఎంపీపీ పదవికి రాజీనామా చేయడంతో ఆ పదవి ఖాళీ అయింది. దశాబ్దాల కాలం తరువాత చంద్రగిరిలో టీడీపీ ఎమ్మెల్యేగా పులివర్తి నాని గెలిచారు. ఈ మండలంలో పాగా వేయాలని టీడీపీ పావులు కదుపుతోంది. దీంతో గత్యంతరం లేని స్థితిలో వైసీపీ ఎంపీటీసీ సభ్యులను మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ముంబై పర్యటనకు తీసుకుని వెళ్లినట్టు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది.

తిరుపతి రూరల్ మండలంలో మొత్తం 40 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. వారిలో వైసీపీ 35 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ నుంచి నలుగురు, స్వత్రంత్రులు ఒకరు ఎంపీటీసీ సభ్యులు గెలిచారు. గత సార్వత్రిక ఎన్నికల నాటికే చెవిరెడ్డిపై అసంతృప్తితో కొందరు టీడీపీకి మద్దతుగా నిలిచారు. దీంతో ఈ నెల 27వ తేదీ ఎంపీపీ పదవికి జరగనున్న ఎన్నిక కోసం ఉన్న వారిని కాపాడుకోవాలనే లక్ష్యంగా దాదాపు 26 మంది పార్టీ ఎంపీటీసీలను ముంబైకి తరలించారని విశ్వసనీయ సమాచారం. వారి వద్ద మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి దగ్గరే ఉండి, అన్ని సదుపాయాలు కల్పించడానికి శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిసింది. కాగా, వారిలో కూడా కొందరిని ఓటింగ్ సమయానికి తమ వైపునకు తిప్పుకుని తిరుపతి రూరల్ ఎంపీపీ పదవి దక్కించుకోవడానికి టీడీపీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

కర్నూలు: మాకు బలం ఉందిగా...

కర్నూలు నగర మేయర్ పదవికి కూడా ముప్పు ఏర్పడినట్లు కనిపిస్తోంది. మేయర్ బీవై. రామయ్యకు పదవీ గండం ఏర్పడినట్లు కనిపిస్తోంది. పాలక మండలి ఏర్పడి ఈ నెల 19వ తేదీ నాటికి నాలుగేళ్లు పూర్తయింది. దీంతో ఇక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టడం ద్వారా ఈ పదవిని దక్కించుకుకోవాలని టీడీపీ ఆరాట పడుతోంది.

కర్నూలు నగరంలో 52 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు 43 డివిజన్లలో విజయం సాధించారు. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిపి 24 సభ్యులు అయ్యారు.

కాగా, ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆరుగురు కార్పొరేటర్లు టీడీపీ పక్కన చేరారు. దీంతో వైసీపీ బలం 37కి తగ్గింది. ఇదే అదునుగా ఇంకొందరు కార్పొరేటర్లను లాగేయడం ద్వారా మేయర్ పదవి దక్కించుకోవాలనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. దీనికి ధీటుగానే తమ ఆధిపత్యం కొనసాగించడానికి వీలుగా వైసీపీ కూడా క్యాంపు రాజకీయాలకు తెరతీసినట్లు సమాచారం. అందుకు ప్రధానంగా..

కర్నూలు నగరంలో మాత్రమే 36 మంది సభ్యులు ఉన్నారు. పాణ్యం నియోజకవర్గంలో మిగతా 16 మంది, కోడుమూరు సెగ్మెంట్ పరధిలో ముగ్గురు కార్పొరేటర్లు ఉండడం గమనించతగిన విషయం. ఈ సెగ్మెంట్లలోని టీడీపీ ఎమ్మెల్యేలు తమ పరిధిలోని కార్పొరేటర్లను మచ్చిక చేసుకునే దిశగా మంత్రాంగం సాగిస్తున్నట్లు సమాచారం.

కర్నూలు నగర పాలక సంస్థలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఓ ఎంపీ కూడా ఓటు హక్కు కలిగి ఉండడం టీడీపీ మేయర్ పదవి దక్కించుకోవడానికి మార్గం ఏర్పడినట్లు అంచనా వేస్తున్నారు. ఇక్కడ 28 ఓట్లు ఏ పార్టీకి దక్కితే వారు మేయర్ కావడానికి ఆస్కారం ఏర్పడింది.

Similar News