మిస్టర్ ప్రైమినిస్టర్, పాలిటిక్స్ నుంచి తప్పుకున్నా! గల్లా జయదేవ్

చోటా మోటా నాయకులందరి గమ్యం పొలిటికల్ ఫీల్డ్.. ఎంతో పేరు ప్రఖ్యాతలున్న ఈ వ్యక్తి ...రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

Update: 2024-01-31 03:00 GMT
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటిస్తున్న గల్లా జయదేవ్

కాస్త హంగూ ఆర్భాటం ఉన్న వాళ్లందరూ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న సమయంలో ఎంతో పేరు ప్రఖ్యాతలున్న ఈ వ్యక్తి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆయనే గల్లా జయదేవ్.. గుంటూరు లోక్ సభ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ. రాజకీయంగా.. వ్యాపారపరంగా.. విద్యాపరంగా గుణసంపన్నుడు. మంచి వక్త. నిండు సభలో ప్రధానమంత్రిని పట్టుకుని ‘మిస్టర్ ప్రైమిస్టర్‘ అని సంబోధించే సత్తా ఉన్నవాడు. సమర్ధనీయుడు. “మూడేళ్ల నుంచి ప్రజలకు దూరంగా ఉన్నా. రాజకీయ కార్యకలాపాల్లో తక్కువగా పాల్గొన్నా. పార్లమెంటులో మాత్రం సమస్యలపై రాజీ లేకుండా పోరాడా. ఎంపీగా చిత్తశుద్ధితో సేవలందించా. నేను ప్రజల మధ్యకు రాకపోయినా.. నా కార్యాలయం, నా సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉన్నారు. నన్ను రెండుసార్లు ఆదరించిన గుంటూరు పార్లమెంటు ప్రజలకు కృతజ్ఞుడిని. వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటా. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా’ అని గుంటూరులో ప్రకటించారు గల్లా జయదేవ్‌. వయసుడిగిన వాళ్లూ, ఏ సత్తా లేని వాళ్లు సీట్ల కోసం వెంపర్లాడుతుంటే అమెరికా చదువుకుని వచ్చిన ఈయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించినప్పుడు అందరూ ముక్కున వేలేసుకున్నారు. వాళ్ల అమ్మ, మాజీ మంత్రి గల్లా అరుణ అయితే ఏకంగా కళ్ల నీళ్లు పెట్టుకుంటా కొడుకుని ముద్దాడి తన నిర్ణయాన్ని గౌరవిస్తున్నామన్నారు.


ఆయన్ను అంతగా ఏమి బాధించింది ?

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అని గల్లా జయదేవ్ ప్రకటించేంతగా ఆయన్ను ఏమి ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. ‘గల్లా జయదేవ్ చాలా సున్నిత మనస్కుడు. వ్యాపారవేత్త. తెలుగుదేశం ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు ఏమీ ఇబ్బంది లేకపోయి ఉండవచ్చు. ఇప్పుడున్నది వైసీపీ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఆయన అటు ఇంటా బయట ఇబ్బందులు పడి ఉండొచ్చు. దానికి మంచి అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీని చిత్తూరు నుంచి హైదరాబాద్ కి తరలించడమే పెద్ద సాక్ష్యం’ అన్నారు సీనియర్ జర్నలిస్టు మన్నే శ్రీనివాస్. టీడీపీలో కూడా అంతర్గతంగా చాలా గొడవలే ఉన్నాయి. అవి ఒక ఎత్తయితే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే వత్తిడిని తట్టుకోవడం చాలా కష్టం. “రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో గళం విప్పినందుకే తన వ్యాపార సంస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా చేసుకుని ఇబ్బంది పెట్టాయి” అని సాక్షాత్తు జయదేవ్‌ చెప్పారు. వాటికి భయపడి పార్టీ మారితే ఆయనపై ఎలాంటి వేధింపులూ ఉండేవి కావేమో. కానీ ఆయన ఆ పని చేయలేదు. రాజకీయాలకు విరామం ఇచ్చినందున ఇకపై పూర్తి స్థాయిలో వ్యాపారంపై దృష్టి పెట్టే చాన్స్ ఉంది. పాండవులు, శ్రీరాముడు ఎలాగైతే అరణ్యవాసం చేసి తిరిగి బలంగా వెనక్కి వచ్చి పరిపాలించారో.. తాను కూడా అలాగే తిరిగొచ్చి రాజకీయాల్లో రాణిస్తానని చెప్పారు.

అనుమతులు తెచ్చుకున్నా వేధింపులు...

ఏమైతేనేం.. గల్లా జయదేవ్‌ పదేళ్ల క్రియాశీల రాజకీయ ప్రస్థానం ముగిసింది. 1996 మార్చి 24న చిత్తూరు జిల్లా దిగువమాఘం గ్రామంలో జన్మించిన గల్లా జయదేవ్ ఎలియాస్ జయ్ గల్లా దేశ పారిశ్రామిక వేత్తల్లో ఒకరు. అమరరాజా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్. 2014, 2019లో గుంటూరు నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఎగువ మధ్యతరగతి వర్గానికి చెందిన గల్లా జయదేవ్ కుటుంబానికి రాజకీయాలతో సంబంధం ఉంది. వాళ్ల తాత (అరుణకుమారి తండ్రి) పాటూరి రాజగోపాలనాయుడు పాలిటీషియన్. స్వాతంత్ర్య సమరయోధుడు, ఆచార్య ఎన్ జి రంగా సన్నిహితుడు, మాజీ పార్లమెంటేరియన్. ఇక జయదేవ్ నాన్న రామచంద్ర నాయుడు మంచి వ్యాపారవేత్త. తల్లి అరుణ కుమారి మంత్రిగా కూడా పని చేశారు. రామచంద్రనాయుడు అమర రాజా గ్రూప్‌ను స్థాపించి అనేకమందికి ఉపాధి చూపించారు. జయదేవ్ అక్క రమాదేవి డాక్టర్. తన తల్లిదండ్రులతో పాటు జయదేవ్ USకు వెళ్లారు. అక్కడ దాదాపు 22 ఏళ్లు ఉన్నారు. యూనివర్శిటీ ఆఫ్ ఇల్లినాయిస్ లో రాజకీయ, ఆర్థిక శాస్త్రాలను అభ్యసించాడు. 1991 జూన్ 26న ప్రముఖ నటుడు కృష్ణ ఘట్టమనేని కుమార్తె పద్మావతి ఘట్టమనేనిని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు - సిద్ధార్థ్ గల్లా, అశోక్ గల్లా. నటుడు మహేష్ బాబు అతని బావమరిది. పెళ్లి చేసుకున్న తర్వాత అమెరికా నుంచి వచ్చేశారు.

సంపన్న రాజకీయవేత్తల్లో గల్లా ఒకరు...


దేశంలోని అత్యంత సంపన్న రాజకీయ నాయకులలో గల్లా ఒకరు. 2014 సాధారణ ఎన్నికలలో ఆయన చూపిన ఆస్తుల విలువ రూ.683 కోట్లు. గ్రాడ్యుయేషన్ తర్వాత జే USAలోని GNB బ్యాటరీ టెక్నాలజీస్‌లో అంతర్జాతీయ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశాడు. 1992లో అమెరికా నుంచి వచ్చిన గల్లా జయదేవ్ అమర రాజా బ్యాటరీ విభాగానికి సేల్స్, సర్వీస్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు వ్యాపారాన్ని బాగా విస్తృతం చేశారు. ఓ అమెరికన్ కంపెనీ జాన్సన్ కంట్రోల్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని వ్యాపారాన్ని మూడు పూవులు ఆరు కాయలుగా పెంచారు.

రాజకీయాల్లోకి ఎలాగంటే...

తాత వారసత్వాన్ని స్వీకరించాలన్న తల్లి అరుణ కోరిక మేరకు జయదేవ్ రాజకీయాల్లోకి వచ్చారని చెబుతుంటారు. తన రాజకీయ ఆరంగేట్రం వెనుక తల్లి ప్రోత్సాహం చాలా ఉంది. రాజకీయాల్లోకి ప్రవేశించడం ద్వారా తన తల్లి అడుగుజాడల్లో నడవాలని ఆయన ఉత్సాహం చూపారు. టీడీపీ తరఫున 2014 లోక్‌సభ ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. రాష్ట్రం మొత్తం వైఎస్సార్ సీపీ గాలి తోలినా 2019లోనూ ఆయన అదే నియోజకవర్గం నుంచి రెండోసారీ గెలిచారు.

పార్లమెంటులో ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అనేక అంశాలపై మాట్లాడిన వారిలో జయదేవ్ ఒకరు. లోతైన విశ్లేషణ, సాధికారత ఆయన సొంతం. భారతదేశంలో సహనం అనే అంశంపై ఆయన మాట్లాడిన తీరును పార్లమెంటు యావత్తు మెచ్చుకుంది. 2018 కేంద్ర బడ్జెట్ లో ఏపీ చేసిన కేటాయింపులపై ఆయన వేసిన చెణుకు ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించిన నిధుల కంటే బాహుబలి సినిమా కలెక్షన్లు ఎక్కువ’ అని చెణుకు వేసినప్పుడు యావత్ సభ నివ్వెరపోయింది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం ఏమీ చేయలేదని సోదాహరణంగా వివరించింది గల్లా జయదేవ్ ఒక్కరేనని చెప్పవచ్చు. లోక్‌సభలో తన 16 నిమిషాల ప్రసంగంలో జయదేవ్.. కేంద్రం తీరును తూర్పారబట్టారు. ఏపీ విభజన చట్టంలోని బాధ్యతలను నెరవేర్చడంలో కేంద్రం చూపుతున్న అపారమైన జాప్యం, ఉదాసీనతను ఎత్తిచూపిన జయదేవ్, ఏపీ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ వివరణ ఇవ్వాలని నిలేసినంత పని చేశారు. కేంద్రం అనుసరిస్తున్న చౌకబారు వైఖరితో రాష్ట్ర ప్రజలు తీవ్ర ద్రోహానికి గురవుతున్నారనే భావాన్ని గల్లా బలంగా వినిపించారు. జయదేవ్ ఉద్వేగభరిత ప్రసంగం అన్ని వర్గాల ప్రశంసలు పొందిందనడంలో సందేహం లేదు. ‘మిస్టర్ ప్రైమినిస్టర్.. ఇలాంటి కేటాయింపులతో మీరు మీ ప్రస్తుత మిత్రులకు, కాబోయే మిత్రులకు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు సర్’ అని కడిగిపారేస్తారు. ‘బహుశా ఇంత కటువుగా మాట్లాడడమే ఆయన పాలిట శాపమై ఉంటుందేమో. అందుకే గల్లా జయదేవ్ రాజకీయాలకు విరామం ప్రకటించి ఉండవచ్చునని’ గుంటూరు నగర ఓటరు కట్టా వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించడం గమనార్హం.

జగన్ తో వచ్చిన విభేదాలేమిటీ..


‘మిస్టర్ ప్రై మినిస్టర్‘ అని పిలిచినందుకే గల్లా జయదేవ్ పై అన్ని వైపుల నుంచి దాడి జరిగిందన్నది టీడీపీ నేతల ఆరోపణ. తిరుపతికి సమీపంలోని అమర్ రాజా కంపెనీకి విద్యుత్ శాఖ పవర్ కట్ చేసింది. కాలుష్య నియంత్రణ మండలి క్లోజర్ నోటీసు ఇచ్చింది. ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. కారణాలు ఏవైతేనేం సుమారు 15వేల మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానే ఉపాధి కల్పించిన ఆ సంస్థ చివరకు ఆ ఫ్యాక్టరీ హైదరాబాద్ తరలిపోయింది. ‘తన బి-టీమ్ జగన్మోహన్ రెడ్డి తరపున కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీకార రాజకీయాలు చేస్తోంది. లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీని మిస్టర్ ప్రై మినిస్టర్ అని పిలిచినందుకే జయదేవ్‌పై ఐటీ దాడులు జరిగాయి. రకరకాల ఆరోపణలతో చిత్తూరు జిల్లాలోని అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీని తెలంగాణకు తరలిపోయేలా చేశారు. ఎటువంటి పారిశ్రామిక కాలుష్యం లేకపోయినా జయదేవ్ ను వేధింపులకు గురిచేశారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు ఆయన వేదనలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించేవారిలో జయదేవ్ ఒకరు’’ అన్నారు టీడీపీ అధికార ప్రతినిధి దినకర్. కేంద్ర ప్రభుత్వంతో వైరం, స్థానికంగా వైఎస్ జగన్ తో వచ్చిన రాజకీయ విభేదాలతో గల్లా జయదేవ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావుకు దగ్గరయ్యారు. అమర్ రాజా ఫ్యాక్టరీని హైదరాబాద్ కు తరలించారు. జయదేవ్ టీడీపీ నుంచి బయటకు వెళ్లినా, పార్లమెంటులో మౌనం పాటించినా ఆయనకు ఇబ్బందులు వచ్చి ఉండేవి కావన్న వాదన ఉంది. “పార్లమెంటులో గళం విప్పినందుకే తన వ్యాపార సంస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టార్గెట్ చేశాయి, ఇబ్బంది పెట్టాయి” అని సాక్షాత్తు జయదేవే చెప్పారు. ఈ మాటనే టీటీడీ అధినేత చంద్రబాబు ఇటీవల నెల్లూరులో జరిగిన సభలోనూ చెప్పారు. అయితే ఈ మాటల్ని పొలిటికల్ జిమ్మిక్ గా వైసీపీ తోసిపుచ్చింది. ‘గల్లా జయదేవ్ ను, ఆయన కుటుంబాన్ని చంద్రబాబు ఓ రాజకీయ పావుగా వాడుకున్నారు. 2024 ఎన్నికల్లో లబ్ధి పొందడానికి గల్లా కుటుంబాన్ని చంద్రబాబు ఎరగా వేశారు’ అన్నారు వైసీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి.

(గల్లా జయదేవ్ జనవరి 28, 2024 పూర్తికాల రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు)

Tags:    

Similar News