టీఎస్పీఎస్సీ నే అనుకున్నా.. కేపీఎస్సీ కూడా ఇంతేనా?

నిరుద్యోగుల పరిస్థితి రెండు సంవత్సరాలు గా సరిగాలేనట్లుంది. ఒక కమిషన్ అలసత్వంతో పేపర్లు లీక్ చేస్తే.. మరో కమిషన్ ఆధిపత్య పోరుతో నిరుద్యోగుల ఆశలను చిదిమేసింది.

Update: 2024-01-16 10:13 GMT

కర్నాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహరం రచ్చకెక్కింది. అంతర్గత ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరి ఉద్యోగ నియామకాలకు బ్రేక్ పడే పరిస్థితి వచ్చింది. కమిషన్ లీగల్ సెల్ అధికారిని నియమించే విషయంలో సరైన నిబంధనలు పాటించలేదని, కమిషన్ కార్యదర్శి లతా కుమారి(IAS), చైర్మన్ తో కూడిన నియామక కమిటీ పంపిన ఫైల్ పై సంతకం చేయడానికి నిరాకరించారు.

వివాదం ఏంటీ?

ప్రతి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఒక లీగల్ సెల్ ఉంటుంది. దీని నియామకానికి సంబంధించిన కొన్ని విధివిధానాలు ఉన్నాయి. ప్రస్తుత కమిషన్ చైర్మన్ శివశంకరప్పసాహూకర్ తో కూడిన ముగ్గురు సభ్యుల నియామక కమిటి ఇంతకు ముందు జారీ చేసిన కమిటీ లీగల్ సెల్(HLC) పోస్టుకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఈ పోస్టుకు 16 దరఖాస్తులు వచ్చాయి. నోటిఫికేషన్ సమయం ముగిసిన తరువాత మరో రెండు అప్లికేషన్లు వచ్చాయి. అనంతరం సాహూకర్ తనతో పాటు ముగ్గురుతో కూడిన ఎంపిక ప్యానెల్ ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. వచ్చిన అప్లికేషన్లలో రెండింటిని తిరస్కరించి, పదిమంది అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూకు పిలిపించింది. అనంతరం ఒక అభ్యర్థిని ఎంపిక చేసినట్లు ఫైల్ ను కార్యదర్శికి పంపింది.

ఫైల్ లో పూర్తి వివరాలు లేవని, కేపీఎస్సీ నియమాల ప్రకారం ఇంటర్వ్యూకి సంబంధించిన వివరాలు, మూల్యంకన ప్రక్రియ, అభ్యర్థులు పొందిన మార్కుల వివరాలు ఇవ్వాలని కోరారు. అలాగే సెలక్షన్ కమిషన్ లో ఒక ఎస్సీ/ ఎస్టీ మహిళా సభ్యురాలు, మరో సభ్య కార్యదర్శి ఉండాలనే నిబంధన ఉందని, అవి పాటించలేదనే కారణంతో ఫైల్ ను వెనక్కి పంపారు. దీనితో వివాదం ప్రారంభం అయింది.

సమావేశాలకు దూరంగా సభ్యులు

కార్యదర్శి లతా కుమారి నిర్ణయం పై కమిషన్ చైర్మన్ తో సహ ఇతర సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పంపిన ఫైల్ పై సంతకం పెట్టే వరకూ సమావేశాలకు దూరంగా ఉండాలని, ఎలాంటి ఫైల్స్ పై( ఉద్యోగ నోటిఫికేషన్లు, ఫలితాలు సహ) సంతకం చేయరాదని 12 మంది సభ్యులలో ఏడుగురు సభ్యులు నిర్ణయించుకున్నారు. కమిషన్ సభ్యుల నిర్ణయాలను ప్రశ్నించే అధికారం కార్యదర్శికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెడ్ ఆఫ్ లా పోస్టుకు గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా కార్యదర్శి తన అధికారాలను దుర్వినియోగం చేశారని చైర్మన్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆరోపించారు. "కార్యదర్శి అన్ని నిబంధనలు ఉల్లంఘించారు, పరిపాలన సంస్కరణల శాఖ, ముఖ్య అధికారులు దీనిపై దృష్టి సారించాలి " చైర్మన్ సాహూకర్ అన్నారు.

అయితే హెచ్ ఎల్ సీ పోస్ట్ రిక్రూట్ మెంట్ ప్రక్రియ పారదర్శకంగా జరగనందునే లతా కుమారీ ఫైల్ ను తిప్పి పంపారని, మాజీ లీగల్ సెల్ హెడ్ హోసగౌడ రాజీనామా కోసం చైర్మన్ ఒత్తిడి చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫైల్ తిరిగి పంపిన తరువాత ఎటువంటి సమాధానం రాకపోవడంతో కార్యదర్శి లతా కుమారి నవంబర్ 15, 2023న జారీ చేసిన నోటిఫికేషన్ ను రద్దుచేశారు. అలాగే జనవరి 9,2024న కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు.

కార్యదర్శి లేకుండా అత్యవసర సమావేశం

కార్యదర్శి ప్రకటించిన కొత్త నోటిఫికేషన్ వ్యవహరాన్ని కమిషన్ సభ్యులు వ్యతిరేకిస్తూ జనవరి 9 న అత్యవసరంగా సమావేశం అయ్యారు. ఈ కొత్త నోటిఫికేషన్ ను అంగీకరించేది లేదు అని తీర్మానించారు. తాము నియమించిన వ్యక్తికి అపాయింట్ మెంట్ లెటర్ ఇచ్చే వరకూ సమావేశాలకు రాబోమని లిఖితపూర్వకంగా తెలిపారు. చైర్మన్ సాహూకర్, సభ్యులు విజయ్ కుమార్ కూచనూరె, ఎంబీ హెగ్గన్నవర్, డాక్టర్ శాంత హోసమణి, డాక్టర్ హెచ్ ఎస్ నరేంద్ర, బీవీ గీత, ముస్తఫా హుస్సేన్ ఉన్నారు.అయితే ఈ లేఖ మాత్రం కేపీఎస్సీ చైర్మన్, మరో ఐదుగురు సభ్యులు మాత్రం సంతకాలు చేయలేదు. అయితే నిబంధనల ప్రకారం కార్యదర్శి లేకుండా చేసే అత్యవసర సమావేశాలు చెల్లవని నిఫుణులు చెబుతున్న మాట.

నోటిఫికేషన్ల పై ప్రభావం

కమిషన్ సభ్యులు సమావేశాలను బహిష్కరించడంతో ఉద్యోగ నోటిఫికేషన్లపై ప్రభావం చూపింది. సెక్రటరీ 1000 పోస్టుల భర్తీ కోసం సిద్దంగా ఉన్న నోటిఫికేషన్ ను నిలిపివేశారు. అలాగే తొమ్మిది ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన అభ్యర్థన ప్రక్రియను నిలిపివేశారు. ఇదీ నిరుద్యోగుల్లో ఆందోళన పెంచింది. గ్రూప్ ఏ, బీ, సీ, డీ లో సుమారు 2000 పోస్టుల నియమాకానికి సంబంధించిన కార్యదర్శి ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించే వరకు కమిషన్ కూడా ఆమోదించవద్దని సభ్యులు నిర్ణయించారు. మరో వైపు ఇదే 2000 ఉద్యోగాల నియమాకానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయడానికి కమిషన్ నిరాకరించింది.

నిరుద్యోగుల ఆందోళన

ఈ అంశం మొదట ఉద్యోగ భవన్ వద్ద నిరుద్యోగులు ఆందోళన చేసినప్పుడే ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఉద్యోగాలను కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారని కర్నాటక స్టేట్ స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కాంతకుమార్ ఆరోపించారు. వెంటనే చైర్మన్ శివశంకర్ సాహూకర్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. కమిషన్ లో ఆధిపత్య పోరు, వేలాదిమంది నిరుద్యోగుల జీవితాలను డోలాయమానంలోకి నెట్టేసిందని ఆరోపిస్తూ ఉద్యోగ సౌధ ఎదుట ఆందోళన చేపట్టారు. ఒక్క సంవత్సరంలో పూర్తి చేయాల్సిన నోటిఫికేషన్లను ఐదు ఏళ్లు అవుతున్న పూర్తి చేయట్లేదని, కొన్ని పరీక్షలు రాసి రెండేళ్ల అవుతున్నా ఇంకా ఫలితాలు ఇవ్వలేదని కాంతకుమార్ ఆరోపించారు.

Tags:    

Similar News