‘జూబ్లీ’ లో కాంగ్రెస్ ను ఓడిస్తే ఆరు గ్యారంటీలు అమలవుతాయి
షేక్ పేట రోడ్ షోలో కెటీఆర్
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో హస్తం పార్టీకి డిపాజిట్లు కోల్పోతేనే ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలవుతాయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ అన్నారు. శుక్రవారం రాత్రి షేక్ పేటలో రోడ్ షో జరిగింది. బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తరపున ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చిందన్నారు. బిఆర్ఎస్ భయంతోనే కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలు గుర్తుకు వచ్చారన్నారు. మైనార్టీ సబ్ ప్లాన్, మైనార్టీల సంక్షేమానికి కేటాయించిన నాలుగువేల కోట్లు ఏమయ్యాయి అని కెటీఆర్ ప్రశ్నించారు. రెండేళ్లలో గుర్తుకురాని ప్రభుత్వ ఉద్యోగులు, సినీ కార్మికులకు ఏదో చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామిలు ఇస్తుందన్నారు.
జూబ్లిహిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయం. మెజార్టీ ఎంతో తేలాల్సి ఉందని కెటిఆర్ అన్నారు. వరుసగా మూడు పర్యాయాలు జూబ్లిహిల్స్ ఎమ్మెల్యేగా మాగంటి గోపినాథ్ గెలిచారని, ఈ ఉప ఎన్నికలో మాగంటి సునీత గెలుపొందడం పక్కా అని కెటిఆర్ అన్నారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో నాలుగు లక్షల వోటర్లు కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెబితేనే రాష్ట్రంలో నాలుగు కోట్ల మందికి మేలు జరుగుతుందని కెటిఆర్ అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తేనే ఆ పార్టీ ఇచ్చిన 420 హామిలు, ఆరు గ్యారంటీలు అమలవుతాయని కెటీఆర్ అన్నారు.
పొరపాటున కాంగ్రెస్ పార్టీ గెలిస్తే , తానేం చేయకపోయినా గెలిచానని వచ్చే ఎన్నికల్లో కూడా గెలుస్తానని రేవంత్ రెడ్డి అనుకునే ప్రమాదముందన్నారు. చావు నోట్లో తల పెట్టి ప్రత్యేక రాష్ట్రం కెసీఆర్ సాధిస్తే , రేవంత్ రెడ్డి రెండేళ్లలో అధోగతి పాలు చేశారని కెటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా తయారు చేస్తే, రేవంత్ రెడ్డి రైతాంగం నుంచి ప్రతీ వర్గాన్ని వంచించారన్నారు. ఆడబిడ్డకు రెండున్నర వేలు, వృద్దాప్య పెన్షన్లు నాలుగు వేలు, ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారన్నారు. పేదలకు పథకాలు ఇచ్చేది లేదు. బిఆర్ఎస్ పధకాలను కనీసం కొనసాగించే తెలివి కూడా లేదన్నారు.
బిఆర్ ఎస్ హాయంలో జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో మూడున్నరవేలు, రాష్ట్రంలో లక్ష డబుల్ రూంలు ఇచ్చినట్టు కెటిఆర్ అన్నారు. పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకపోవడం ఇందిరమ్మ రాజ్యమా అని ఆయన ప్రశ్నించారు. హైడ్రాపేరిట పేదల ఇళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం బుల్ డోజర్ పెట్టిందని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అనాలోచిత విధానాల వల్ల పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని కెటిఆర్ అన్నారు. బిఆర్ఎస్ హాయంలో ఉచితంగా తాగునీటిని అందించాం. కాంగ్రెస్ హాయంలో బిల్లులు ఇస్తున్నారని కెటిఆర్ ఎద్దేవా చేశారు.