కొండగట్టు అంజన్నపై భూ ఆక్రమణ వివాదం
షోకాజ్ నోటీజులు జారీ చేసిన అటవీశాఖ.
కొండగట్టు అంజన్న ఆలయం భూవివాదంలో వార్తల్లో నిలిచింది. అటవీశాఖకు చెందిన భూమిని ఆక్రమించిందంటూ ఆలయ నిర్వహణ కమిటీని అటవీశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ అంశం ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీస్తోంది. అటవీశాఖ చర్యలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆలయ నిర్వహణ కమిటీ.. 684 బ్లాక్ పరిధిలోని దాదాపు 6 ఎకరాల భూమిని ఆక్రమించినట్లు అటవీశాఖ తన నోటీసుల్లో స్పష్టం చేసింది. ఆ భూమిలో అక్రమ నిర్మాణాలు కూడా జరిగాయని, ఇది ముమ్మాటికీ అటవీ సంరక్షణ చట్టాలను ఉల్లంఘించడమేనని అధికారులు పేర్కొంటున్నారు.
ఆక్రమించిన ఆరు ఎకరాల స్థలంలో ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన భవనాలతో పాటు అన్నదాన సత్రం, వాటర్ ప్లాంట్, వాహన పూజ షెడ్, ఎగ్జిక్యూటివ్ భవనం, సాగర్ గెస్ట్ హౌస్, పబ్లిక్ టాయిలెట్స్ వంటి భవనాలు నిర్మించారని చెప్పారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ ఫారెస్ట్ కన్సర్వేష్ యాక్ట్ కింద నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. కన్సర్వేషన్ యాక్ట్ 2ఏ ప్రకారం అటవీ భూమిలో నాన్-ఫారెస్ట్ పనులు చేపట్టడానికి అనుమతులు తప్పనిసరి అని అటవీశాఖ తన నోటీసుల్లో వివరించింది.
దాంతో పాటుగా ఫారెస్ట్ వైల్డ్‌లైఫ్ కన్సర్వేషన్ యాక్ట్‌లోని 3ఏ, 3బీ సెక్షన్ల కింద నోటసులు జారీ చేశామని, నోటీసులకు తగిన వివరణ ఇవ్వాలని సూచించారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అటవీశాఖ హెచ్చరించింది.