సాఫ్ట్ వేర్ ఉద్యోగులకి షాకింగ్ న్యూస్ చెప్పిన 2025

సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో 84 శాతం మంది ఫ్యాటి లివర్ తో బాధపడుతున్నారని ఓ అధ్యయనం తేల్చింది.

Update: 2025-12-16 07:49 GMT

2025 ….సాఫ్ట్వేర్ ఉద్యోగులలో కలవరం రేపింది. సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో 84 శాతం మంది ఫ్యాటి లివర్ తో బాధపడుతున్నారని ‘స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ,ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ హాస్పటల్’ సంయుక్తంగా చేసిన అధ్యయనంలో తేల్చేసింది. అంతే కాకుండా సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో 70-72 % మంది ఊబకాయంతో, 76.52 % అధిక కొలెస్ట్రాల్ తో, 69.86 % మంది నిద్రలేమి తో బాధపడుతున్నారని,ఈ కారణాల వల్లే వారి కాలేయాల్లో అధిక కొవ్వు చేరి ,ఫ్యాటీ లివర్ కి కారణమైందని కూడా ఒక హెచ్చరిక కూడా చేసింది ఈ అధ్యయనం.ఇప్పటికే ఒక పక్క ఈ 2025 లో హెచ్ ఐ వి లో కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పెరిగిపోయారు అని ఎయిడ్స్ డే రోజు నివేదికలతో సహా వచ్చాయి. ఇంతలోపే ఈ 2025 ఇదే సాఫ్ట్ వేర్ ఉద్యోగులకి ‘ఫ్యాటి లివర్’ ఇంకో షాక్ ఇచ్చింది.

సాఫ్ట్వేర్ జాబ్ …ఇది ఒక ఉద్యోగం మాత్రమే కాదు,ఎందరికో ఒక కల. ఆర్ధిక భద్రతను,సమాజంలో హోదాను పెంచడమే కాకుండా ఒక విలాసవంతమైన లైఫ్ స్టైల్ ని కూడా ఉద్యోగులు అనుభవించడానికి అవకాశం ఉన్న ఉద్యోగం ఇది. అంతేకాదు భారతదేశ ఆర్ధిక వృద్దిలో కూడా ఈ రంగానికి ప్రాధాన్యత ఉంది. 2023–2024 ఆర్థిక సంవత్సరంలో, ఈ రంగం దేశ స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 7 శాతం వాటాను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ ప్రస్తుతం 5.43 మిలియన్ల మంది ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తోంది, వీరిలో 36 శాతం మంది మహిళలు ఉన్నారు. 2026 నాటికి, ఈ రంగంలో 9.5 మిలియన్ల నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరం అవుతారని అంచనా. ముఖ్యంగా, హైదరాబాద్ లో దాదాపు 1500 ఐటీ కంపెనీలు మరియు 5.8 లక్షలకు పైగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో ఒక ప్రధాన ఐటీ మహానగరంగా ఉంది.

అయితే, ఈ రంగంలోని పని సంస్కృతి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది. ఐటీ ఉద్యోగులు ఎక్కువగా శారీరక శ్రమ లేని ఉద్యోగంతో పాటు, వ్యక్తిగతంగా కూడా అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కలిగి ఉన్నారు. ఈ కారణాల వల్ల వారిలో ఊబకాయం,టైప్ -2 డయాబెటిస్ ,అధిక రక్తపోటు,అధిక కొలెస్ట్రాల్ వంటి లైఫ్ స్టైల్ డిసిజెస్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. వీటి వల్ల తర్వాత వారి లివర్ లో అధిక కొవ్వు చేరి అది ‘ఫ్యాటీ లివర్’ వ్యాధికి కూడా కారణమవుతుంది. అయితే ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో ఎక్కువ అవ్వడం ఆందోళనకరంగా మారింది. దీని గురించి ‘స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ,ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ హాస్పటల్’ కలిసి ఒక సమగ్ర అధ్యయనం 2023 జూలై నుండి 2024 జూలై వరకు హైదరాబాద్‌లో చేసారు.

దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని ఐటీ హబ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను యాదృచ్ఛికంగా ఎంపిక చేశారు.మొదట 758 మంది ఉద్యోగుల నుండి స్పందనలు రాగా, చివరికి 345 మంది ఐటీ ఉద్యోగులను ఈ అధ్యయనంలో చేర్చుకున్నారు.వీరి వయస్సు 30 నుండి 60 సంవత్సరాల మధ్య ఉంది. తక్కువ ఆల్కహాల్ తీసుకునే వారిని మాత్రమే చేర్చుకున్నారు.

పాల్గొన్న ఉద్యోగులు తమ పని సంబంధిత అలవాట్లు (ఎక్కువసేపు కూర్చోవడం, షిఫ్ట్ పని), ఒత్తిడి, నిద్ర సమయం, ధూమపానం మరియు ఆహార అలవాట్లపై ప్రశ్నావళికి సమాధానాలు ఇచ్చారు.వారి శారీరక కొలతలు (బరువు, ఎత్తు), జీవరసాయన (రక్త పరీక్షలు), జీవక్రియ మరియు కాలేయ పనితీరు కొలమానాలను అంచనా వేశారు.

ఎం ఏ ఎఫ్ ఎల్ డి (మెటబాలిజం అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్) వ్యాధి నిర్ధారణ కోసం, వైబ్రేషన్-కంట్రోల్డ్ ట్రాన్సియెంట్ ఎలాస్టోగ్రఫీ అనే ఫైబ్రోస్కాన్ పరీక్షను ఉపయోగించారు. ఈ పరీక్షను హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రిలో నిర్వహించారు.



Full View

ఐటీ ఉద్యోగుల ఆరోగ్యంపై ఆందోళన కలిగించే విధంగా ఈ పరిశోధనలో ఈ కింది ముఖ్య అంశాలు వెల్లడయ్యాయి:

ఎం ఎఫ్ ఏ ఎల్ డి వ్యాప్తి శాతం: అధ్యయనంలో పాల్గొన్న మొత్తం ఉద్యోగులలో 290 మందికి (అంటే 84.06 శాతం మందికి) కాలేయంలో కొవ్వు చేరినట్లు ఫైబ్రోస్కాన్ పరీక్ష ద్వారా తేలింది.

ఊబకాయం: ఉద్యోగులలో ఎక్కువ మంది (సుమారు 70.72 శాతం) అధిక శరీర బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారు.

నిశ్చల జీవనశైలి: దాదాపు 71.88 శాతం మంది ఉద్యోగులు ఎక్కువ గంటలు (సుమారు 8 గంటలకు పైగా) కూర్చొనే పనిచేస్తున్నారు.

నిద్ర లేమి: దాదాపు 69.86 శాతం మంది ఉద్యోగులు తగినంత నిద్ర పొందడం లేదు.

ఒత్తిడి: 37.97 శాతం మంది ఉద్యోగులు పని సంబంధిత ఒత్తిడిని కలిగి ఉన్నారు.

షిఫ్ట్ పని: 25.80 శాతం మంది షిఫ్టుల వారీగా పనిచేస్తున్నారు.

జీవక్రియ లోపాలు:

మొత్తం ఉద్యోగులలో 34.20 శాతం మందిలో జీవక్రియ సక్రమంగా లేదు.

అధిక కొలెస్ట్రాల్: 76.52 శాతం మందిలో అధిక సాంద్రత లేని లిపోప్రొటీన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి.

అధిక చక్కెర: దాదాపు 20.87 శాతం మంది ఉద్యోగులలో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి.

ఐటీ ఉద్యోగులలో ఈ ఫ్యాటి లివర్ ఉన్న వారు 84.06% ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నిశ్చల జీవనశైలిని తగ్గించడం, ఆహారపు అలవాట్లలో మార్పులు (కొవ్వు, ఉప్పు, చక్కెర అధికంగా ఉన్న ఆహారాన్ని తగ్గించడం), మరియు క్రమం తప్పకుండా కాలేయ పనితీరు పరీక్షలు నిర్వహించడం అత్యవసరం అని పరిశోధకులు సిఫార్సు చేస్తున్నారు.ఈ 2025 సాఫ్ట్ వేర్ ఉద్యోగుల ఆరోగ్య పరిశోధన ఫలితంతో షాక్ ఇలా ఇచ్చింది.

* * *

Tags:    

Similar News