గాన గంధర్వుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తీవ్ర నిరసనల మధ్య రవీంద్రభారతిలో ఆవిష్కరణను పూర్తి చేసుకుంది. పలువురు తెలంగాణ వాదులు.. ఎస్‌పీబీ విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టాన్ని తప్పుబట్టారు. అందెశ్రీ వంటి వారికి గౌరవం దక్కిన తర్వాతనే మిగిలిన వారికి గౌరవం దక్కాలని కూడా కొందరు నినాదాలు చేశారు. కొన్ని రోజులుగా ఎస్‌పీబీ విగ్రహ అంశంలో తీవ్ర నిరషనలు జరుగుతున్నాయి. రవీంద్రభారతిలో ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడానికి వీలు లేదని కూడా కొందరు అడ్డగించారు. ఈ తరహా గొడవలు, నిరసనలు, ఆందోళనల మధ్య సోమవారం.. ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి శ్రీధర్ బాబు,హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు, గాయని ఎస్‌పీ శైలజ సహా తదితరులు.. ఈ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా తయారు చేయించిన 7.2 అడుగుల కాంస్య విగ్రహాన్ని రవీంద్రభారతిలో ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణ సందర్భంగా రవీంద్రభారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఇష్టమైన 20 పాటలతో సాయంత్రం 50 మంది కళాకారులతో సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించనున్నారు.
అయితే, ఈ విగ్రహ ఏర్పాటుపై తెలంగాణ వాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ఉద్యమకారుడు పృథ్వీరాజ్‌తో పాటు పలువురు తెలంగాణ వాదులు విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడటానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిరాకరించారనే కారణంతో ఆయన విగ్రహాన్ని రవీంద్రభారతిలో ఏర్పాటు చేయరాదని వారు డిమాండ్ చేస్తున్నారు. రవీంద్రభారతిలో తెలంగాణ కళాకారుల విగ్రహాలను మాత్రమే ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్నారు.
ఈ నేపథ్యంలో విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిచ్చిన తెలంగాణ వాదులను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు. రవీంద్రభారతి చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
ఇదిలా ఉండగా, కొన్ని రోజుల క్రితం కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ అంశంపై నటుడు శుభలేఖ సుధాకర్‌తో ఉద్యమకారుడు పృథ్వీరాజ్ సహా మరికొందరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని తెలంగాణ ఉద్యమకారులను అక్కడి నుంచి పంపించివేశారు.