గ్రామీణ ప్రాంతాల్లో బిఆర్ ఎస్ హోదా పెంచిన సర్పంచ్ ఎన్నికలు

అన్ని ప్రతికూల పరిస్థితులే, అయినా కేటిఆర్, హరీష్ నాయకత్వంలో పార్టీకి అండగా నిలిచిన ప్రజలు

Update: 2025-12-15 10:29 GMT
BRS working president KTR and Harish Rao

*రేవంత్ సొంతగ్రామం కొండారెడ్డి పంచాయితీ సర్పంచ్ గా మాజీ మావోయిస్టు మల్లిపాకుల వెంకటయ్య గెలిచాడు.

*ఆర్ధిక, సమాచార శాఖల మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి చెరువుమాదారం పంచాయితీలో బీఆర్ఎస్ మద్దతుతో అమరగాని ఎల్లయ్య 343 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.

*పంచాయితీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క సొంత గ్రామం ఏటూరినాగారం పంచాయితీలో బీఆర్ఎస్ మద్దతుదారు భారీ మెజారిటీ 3,230 ఓట్లతో కాకులమర్రి శ్రీలత గెలిచారు.

*జడ్చర్ల కాంగ్రెస్ ఎంఎల్ఏ జానంపల్లి అనిరుధ్ రెడ్డి గ్రామం రంగారెడ్డిగూడ పంచాయితీలో బీజేపీ బలపరిచిన కాకిపాటి రేవతి 31 ఓట్లతో గెలిచింది.

*మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంఎల్ఏ మురళీనాయక్ సొంగగ్రామం సోమ్లాతండా పంచాయితీలో ఇక్లావత్ సుజాత అనే ఇండిపెండెంట్ అభ్యర్ధి 27 ఓట్లతో గెలిచింది.

*షాద్ నగర్ నియోజకవర్గంలోని వీర్లపల్లి పంచాయితీలో కాంగ్రెస్ ఎంఎల్ఏ వీరపల్లి శంకర్ బలపరచిన కాంగ్రెస్ మద్దతుదారుడు శేఖర్ గౌడ్ పై బీఆర్ఎస్ మద్దతుదారుడు చిందం పాండు గెలిచాడు.

*మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎంఎల్ఏ జీ మధుసూదన్ రెడ్డి సొంగ గ్రామం ధమగ్నాపూర్ పంచాయితీలో బీఆర్ఎస్ బలపరిచిన ఎన్మగండ్ల పావని 120 ఓట్ల మెజారిటీతో గెలిచింది.

*కరీంనగర్ జిల్లా మానుకొండూరు కాంగ్రెస్ ఎంఎల్ఏ కవ్వంపల్లి సత్యనారాయణ సొంతగ్రామం పచ్చనూర్ పంచాయితీ ఎన్నికలో బీఆర్ఎస్ మద్దతుదారుడు కేశవ్ గెలిచాడు.

*భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకటరావు బీఆర్ఎస్ తరపున గెలిచినా ప్రస్తుతం కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. దమ్మపేట మండలం చిన్నబండిరేవు పంచాయితీలో బీఆర్ఎస్ మద్దతుదారుడు మడకం జోగయ్య గెలిచాడు.

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో మొత్తంమీద కాంగ్రెస్ హవా నడుస్తుంటే కొన్ని పంచాయతీల్లో మాత్రం ప్రతిపక్షాలు మద్దతు పలికిన అభ్యర్ధులు గెలువటమే విచిత్రం. ప్రతిపక్షాలు మద్దతుపలికిన పంచాయతీల్లో అభ్యర్ధులు గెలవకూడదని ఎక్కడా లేదు. కాకపోతే కొందరు మంత్రులు, మరికొందరు ఎంఎల్ఏల సొంత పంచాయితీల్లో భారత రాష్ట్రసమితి (బీఆర్ఎస్), బీజేపీ బలపరిచిన అభ్యర్ధులు గెలవటమే ఆశ్చర్యంగా ఉంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలని పెద్దలు చెప్పారు. రచ్చ గెలిచిన ఎంఎల్ఏలు ఇంట అంటే పంచాయతీ ఎన్నికల్లో వోడారు.

రేవంత్ పంచాయితీలో మాజీ మావోయిస్టు ఏకగ్రీవం

కొండారెడ్డి పల్లి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సొంతగ్రామం. కొండారెడ్డిపల్లి పంచాయితీలో రేవంత్ మద్దతుతో నామినేషన్ దాఖలుచేసిన నేతకు తిరుగుండకూదనే అందరు అనుకుంటారు. కాని ఇక్కడ సర్పంచ్ గా మాజీ మావోయిస్టు మల్లిపాకుల వెంకటయ్య ఏకగ్రీవంగా గెలిచాడు. ఇక ఆర్ధిక, సమాచార శాఖల మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి సొంతగ్రామం చెరువుమాదారం పంచాయితీలో బీఆర్ఎస్ మద్దతుతో అమరగాని ఎల్లయ్య 343 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. పంచాయితీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) సొంతగ్రామం ఏటూరినాగారం పంచాయితీలో బీఆర్ఎస్ మద్దతుదారు కాకులమర్రి శ్రీలత భారీ మెజారిటీ 3,230 ఓట్లతో గెలిచారు. అలాగే జడ్చర్ల కాంగ్రెస్ ఎంఎల్ఏ జానంపల్లి అనిరుధ్ రెడ్డి గ్రామం రంగారెడ్డిగూడ పంచాయితీలో బీజేపీ బలపరిచిన కాకిపాటి రేవతి 31 ఓట్లతో గెలిచింది.

మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంఎల్ఏ మురళీనాయక్ సొంగగ్రామం సోమ్లాతండా పంచాయితీలో కాంగ్రెస్ అభ్యర్ధి మీద ఇక్లావత్ సుజాత అనే ఇండిపెండెంట్ అభ్యర్ధి 27 ఓట్లతో గెలిచింది. షాద్ నగర్ నియోజకవర్గంలోని వీర్లపల్లి పంచాయితీలో కాంగ్రెస్ ఎంఎల్ఏ వీరపల్లి శంకర్ బలపరచిన కాంగ్రెస్ మద్దతుదారుడు శేఖర్ గౌడ్ పై బీఆర్ఎస్ మద్దతుదారుడు చిందం పాండు గెలిచాడు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎంఎల్ఏ జీ మధుసూదన్ రెడ్డి సొంతగ్రామం ధమగ్నాపూర్ పంచాయితీలో బీఆర్ఎస్ బలపరిచిన ఎన్మగండ్ల పావని 120 ఓట్ల మెజారిటీతో గెలిచింది.

కరీంనగర్ జిల్లా మానుకొండూరు కాంగ్రెస్ ఎంఎల్ఏ కవ్వంపల్లి సత్యనారాయణ సొంతగ్రామం పచ్చనూర్ పంచాయితీ ఎన్నికలో బీఆర్ఎస్ మద్దతుదారుడు కేశవ్ గెలిచాడు. భద్రాచలం ఎంఎల్ఏ తెల్లం వెంకటరావు బీఆర్ఎస్ తరపున గెలిచినా ప్రస్తుతం కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. దమ్మపేట మండలం చిన్నబండిరేవు పంచాయితీలో బీఆర్ఎస్ మద్దతుదారుడు మడకం జోగయ్య గెలిచాడు. పైన చెప్పిన మంత్రులు, ఎంఎల్ఏలు పార్టీ మద్దతుదారులను గెలిపించాలని ప్రచారం చేసినా జనాలు మాత్రం ప్రతిపక్షాలు బలపరిచిన అభ్యర్ధులనే గెలిపించారు. మంత్రులు, ఎంఎల్ఏల నియోజకవర్గాల్లో ప్రతిపక్షాలు మద్దతుపలికిన అభ్యర్ధులు గెలిచారంటే అర్ధముంది. కాని మంత్రులు, ఎంఎల్ఏల సొంత గ్రామపంచాయితీల్లో కూడా ప్రతిపక్షాలు అందులోను ఎక్కువగా బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారంటే ఎలా అర్ధంచేసుకోవాలి ?


సరే, పై పంచాయితీలను వదిలేస్తే మొత్తంమీద కాంగ్రెస్ మద్దతుదారులు వేలాది పంచాయితీల్లో గెలిచారన్నది వాస్తవమే. అయితే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ను తక్కువగా అంచనా వేసేందుకు లేదన్న విషయం ఇపుడు రుజువయింది. ఇప్పటికి రెండు విడతల పంచాయితీల్లో ఎన్నికలు ముగిసాయి. 4,230 పంచాయితీలకు జరిగిన మొదటివిడత ఎన్నికలో కాంగ్రెస్ మద్దతుదారులు 2,426 చోట్ల గెలిస్తే, బీఆర్ఎస్ బలపరచిన అభ్యర్ధులు 1155 మంది గెలిచారు. అలాగే రెండోవిడతలో 4,332 పంచాయితీలకు ఎన్నికలు జరిగాయి. వీటిల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 2,331 పంచాయితీల్లో, బీఆర్ఎస్ మద్దతుదారులు 1195 మంది గెలిచారు. ఇక్కడొక ఇంట్రస్టింగ్ పాయింట్ ఏమిటంటే రెండు విడతల్లో కలిపి బీజేపీ మద్దతుతో 454 మంది గెలిస్తే, స్వతంత్రులు 872మంది గెలవటం. సీపీఐ బలపరచిన వాళ్ళు 53 మంది, సీపీఎం మద్దతుదారులు 58 మంది గెలిచారు. 4,158 పంచాయితీలకు మూడోవిడత పోలింగ్ డిసెంబర్ 17వ తేదీన జరగబోతోంది. చివరివిడతలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారులు ఎంతమంది గెలుస్తారన్నది ఆసక్తిగా మారింది.

మొత్తంమీద గమనించాల్సింది ఏమిటంటే కాంగ్రెస్ మద్దతుదారుల గెలుపుతో పోల్చుకుంటే బీఆర్ఎస్ మద్దతుదారులు ఏమంతగా వెనకబడిలేరు. రెండు విడతల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 4756 పంచాయితీల్లో గెలిస్తే, బీఆర్ఎస్ బలపరచిన అభ్యర్ధులు 2350 పంచాయితీల్లో జెండా ఎగరేశారు. ఏ విధంగా చూసుకున్నా కాంగ్రెస్ మద్దతుదారులు సాధించిన ఫలితాల్లో సుమారు 50శాతం సీట్లను బీఆర్ఎస్ మద్దతుదారులు కూడా గెలిచారు. ఇన్నివేల పంచాయితీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలవటంలో కీలకమైన అంశం ఏమిటంటే అధికారంలో ఉండటమే. కాంగ్రెస్ అధికారంలో ఉండటం వల్ల గ్రామపోరులో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుస్తున్నారని అనుకోవాలి.

సంక్షేమపథకాలు ఏమయ్యాయ్ ?

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే పేదలకు డైరెక్టుగా లబ్దిచేకూర్చే ఉచితబస్సు ప్రయాణం, మహాలక్ష్మి పథకంలో భాగంగా రు. 500కే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం అందిస్తోంది. అలాగే పేదలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకం కూడా అమలవుతోంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని రు. 10 లక్షల నుండి రు. 25 లక్షలకు పెంచింది. రైతు రుణమాఫీ, రైతుబంధు పథకాల్లో భాగంగా లక్షలాది మంది రైతులకు వేలాది కోట్లు జమచేసింది. అంటే రేవంత్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథాల్లో అత్యధిక లబ్దిదారులు పేదలే. అందులోను గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాల్లో డైరెక్టు లబ్దిదారులుగా ఉన్నారు. ఈమధ్యనే సన్నబియ్యం పంపిణీ మొదలైంది. సన్నబియ్యం పంపిణీ మొదలైన తర్వాత రేవంత్, మంత్రులు పేదల ఇళ్ళల్లో భోజనాలు చేసి భేష్ అన్నారు.


మరి పేదలు అందులోను కోట్లాదిమంది గ్రామీణ పేదలకు ప్రభుత్వం నుండి ఇన్ని సంక్షేమపథకాలు అందుతున్నా కూడా 2350 పంచాయితీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారంటే అర్ధమేంటి ? రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందనా ? లేకపోతే బీఆర్ఎస్ పై జనాల్లో ఇంకా ఆధరణ తగ్గలేదని అనుకోవాలా ? ఒకటైతే వాస్తవం ఏమిటంటే పంచాయితీ పోరులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన, విధానాలు, అవినీతి లాంటి అంశాలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. పంచాయితీ పోరులో పోటీచేసేది గ్రామాల్లోని వ్యక్తులే, ఓట్లేసేదీ గ్రామాల్లోని జనాలే. వీళ్లంతా ఏదో ఒక పథంక లబ్దిదారులే. ఎవరెవరిక ఏమి అందాయో వోటేసేవాళ్లకి బాగా తెలుసు. అయినా సరే, పథకాలు అందించిన కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిని కాదని ప్రతిపక్ష పార్టీకి ఓటేశారు. కారణం ఏమిటి?


బీఆర్ ఎస్ కు అదరణ తగ్గలేదనేనా?

2023 నుంచి బిఆర్ ఎస్ కు అన్ని ప్రతికూల పరిస్థితులే ఎదురవుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు (కెసిఆర్) ఫామ్ హౌస్ కే పరిమితమైపోయారు. ఇది పార్టీ కార్యకర్తలను, అభిమానులను బాగా నిరుత్సాహపరిచింది. కెసిఆర్ కుటుంబంలో కలతలు మొదలయ్యాయి. కెసిఆర్ కూతురు కవిత ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణం చిక్కుకుని తీహార్ జైలు లో చాలా గడిపి బెయిలు మీద బయటకు వచ్చారు. తర్వాత కవిత, పార్టీకి దూరం పెరిగింది. కవితకు, సోదరుడు కేటీ రామారావు( పార్టీ వర్కింగ్ ప్రెశిడెంట్కు)విబేధాలు వచ్చాయి. కవితను పార్టీలో నుండి గెంటేయటంతో ఆమె వేరుకుంపటి పెట్టుకుని జనంబాట పేరుతో జనాల్లో కెటిఆర్ తో పాటు మంత్రుల మీద అవినీతి ఆరోపణలు చూస్తూ రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. ఇక మిగిలింది మరో కీలక నేత తన్నీరు హరీష్ రావు మాత్రమే. కేటీఆర్ తో పోల్చుకుంటే హరీష్ జిల్లాల్లో ఎక్కువగానే తిరుగుతున్నారు. గత రెండేళ్లుగా పార్టీ ఇలా సంక్షోభంలో కూరుకుపోయింది.ఇది పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలను, కార్యకర్తలను, అభిమానులు నిరాశపరిచే పరిణామం.

ఇంతేనా, ఇంకా చాలా ఉంది...

ఇదేసమయంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా కాళేశ్వరం అవినీతి, టెలిఫోన్ ట్యాపింగ్ ల మీద విచారణ జరుగుతోంది.. అలాగే కేసీఆర్ తో పాటు హరీష్ మీద కూడా కాళేశ్వరం విచారణ జరుగుతోంది. కేటీఆర్ మీద ఫార్ములా కార్ రేసు కేసు, విచారణ జరుగుతోంది. ఆయనను విచారించేందుకు గవర్నర్ కూడా అనుమతి ఇచ్చారు.ఇప్పటికే కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయి బెయిల్ మీద తిరుగుతున్నారు. వీటన్నింటికి తోడు, ఈమధ్యనే జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి 25 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇన్ని ప్రతికూల పరిణామాల మధ్య పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నపుడు కాంగ్రెస్ పార్టీ సర్పంచుపదవులన్నంటిని వూడ్చేసుకుని పోతుందని అనుకుంటారు. కానీ అలా జరగలేదు.


రేవంత్ రెడ్డి ఉధృత దాడి

2023లో అఖండ విజయం సాధించాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకతనుకు తిరుగు లేదని ధీమాలో రాష్ట్రపాలన మొదలుపెట్టారు. కెసిఆర్ లాంటి జాతీయ స్థాయిలో పేరున్న నాయకుడిని ఓడించంతో అలాంటి ధీమా రావడం సహాజమే. అందుకే గత రెండేళ్లుగా కొత్త రాజకీయ పోరాటం మొదలుపెట్టారు. అదే బిఆర్ ఎస్ ను తెలంగాణ నుంచి తరిమేయడం. ఈ మాటని ఆయన చాలా సార్లు ప్రయోగించారు. కెసిఆర్ ను ఫామ్ హౌస్ నుంచి బయట రానీయన్నాడు. ప్రాంతీయ పార్టీ ప్రమాదం అన్నాడు. పార్టీ మీద దాడి ఎక్కు పెట్టాడు. కెసిఆర్ కుటుంబ సభ్యుల మీద గురిపెట్టాడు. విచారణ కమిషన్లు వేశాడు. మీడియా మద్దతు సంపాదించాడు. నిజానికి బిజెపిని ఆయన ముట్టుకోనేలేదు. దృష్టి అంతా బిఆర్ ఎస్ మళ్లీ లేవకుండా దెబ్బతీయడం మీద పెట్టాడు.

బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులు

పార్టీ క్యాడర్, అభిమానులు ఇంకా నిరాశచెందేలా ఎమ్మెల్యేల ఫిరాయింపులు మొదలయ్యాయి. బిఆర్ ఎస్ ఖాళీ అవుతుందనే భయాన్ని ముఖ్యమంత్రి కలిగించాడు. దీనికితోడు జరిగిన రెండు మూడు ఉప ఎన్నికల్లో కూడా బిఆర్ ఎస్ ఓడిపోయింది. ఏవిధంగా చూసినా గత రెండేళ్లు బిఆర్ ఎస్ కు ఏ మాత్రం అనుకూలంగా లేదు. ఎంత కమిట్ మెకంటు ఉన్నా నిరాశలపోడిపోయే వాతావరణ తెలంగాణ మొత్తం ఆవరించింది. ఇన్ని ప్రతికూల పరిణామాల మధ్య పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నపుడు కాంగ్రెస్ పార్టీ సర్పంచుపదవులన్నంటిని వూడ్చేసుకుని పోతుందని అనుకుంటారు. కానీ అలా జరగలేదు. రేవంత్ ప్రచారాన్ని చాలా మంది నమ్మడంలేదని గ్రామ సర్పంచుల ఎన్నికలు చెబుతాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక హెచ్చరిక లాంటిదే.


కెటిఆర్, హరీష్ రావుల బలమయిన నాయకత్వం

ఇలా ప్రతికూల పరిణామాల మధ్య క్యాడర్, అభిమానులను ఉత్సాహపరిచేందుకు వాళ్ల లో పార్టీ మీద ఉన్న నమ్మకం పట్టుసడలకుండా ఉండేందుకు తీవ్రప్రయత్నాలు చేశారు. 2023 నుంచి ఇప్పటి దాకా ప్రభుత్వం లో అవినీతి ఉందని క్యాంపెయిన మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ చేపడుతున్న ప్రాజక్టులన్నీ రియల్ ఎస్టేట్క పథకాలని పోరాటం మొదలుపెట్టారు. ఉద్యమాలు ప్రారంభించారు. సోషల్ మీడియాలో తిరుగుబాటు తీవ్రం చేశారు. సంక్షేమ హాస్టళ్లో ఉన్న మురికి మొదలుకుని ఫ్యూచర్ సిటి దాకా అన్నింటిమీద విరామం లేకుండా ఏదో ఒక కార్యక్రమం చేపడుతూ వచ్చారు. ఇదంతా పార్టీని సర్పంచు ఎన్నికల్లో గౌరవ ప్రదమయిన స్థానంలో నిలబెట్టింది. ఇద్దరు కేంద్ర మంత్రల నాయకత్వంలో ఉన్న భారతీయజనా పార్టీ పంచాయతీ ఎన్నికల్లో అతితక్కువ స్థానాలు గెల్చుకుని పరువు పోగొట్టుకుంటే, రెండోస్థానంలో, ప్రశంసనీయంగా నిలబడింది. దీనర్థఏమిటి?

కాంగ్రెస్ ప్రభుత్వం అధికార గర్వంతో, పోలీసుల బలంతో బిఆర్ ఎస్ మద్దతుదారులను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ప్రలోభాలకు గురిచేసినా తట్టుకొని బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచులు గెలవడం వారి పోరాట పటిమ నిదర్శనం అని మాజీ మంత్రి హరీష్ రావు ఎన్నికల ఫలితాల మీద వ్యాఖ్యానించారు.


అడ్డదారిలో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఇక కాలం చెల్లిందని పల్లె ప్రజలు తమ ఓటు ద్వారా మరోసారి తేల్చిచెప్పారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అన్నారు.

ప్రభుత్వ పెద్దలు ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ కోటలు బీటలు వారడం, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖచిత్రానికి నిదర్శనమని కెటిఆర్ అన్నారు.

పుంజుకునే అవకాశముంది : ప్రొఫెసర్ ఇ వెంకటేశ్వర్లు

‘‘మొదటి రెండువిడత ఫలితాలను విశ్లేషిస్తే కాంగ్రెస్ మద్దతుదారులు 50శాతంకు పైగా పంచాయితీలను గెలవటంలో ఆశ్చర్యంలేదు’’ అని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకుడు ఈ వెంకటేశ్వర్లు అన్నారు. ‘‘ఎందుకంటే అధికారంలో ఉండటమే అతిపెద్ద అడ్వాంటేజ్’’ అని చెప్పారు.

‘‘బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీఇచ్చి మాటతప్పిన రేవంత్ ప్రభుత్వంపై గ్రామీణ ప్రాంతాల్లోని బీసీల్లో ఆగ్రహంతో ఉన్నారు’’ అని చెప్పారు. ఈ కారణంగానే కొన్నిచోట్ల గ్రామీణ ఓటర్లు బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపిస్తుండవచ్చు’’ అని తెలిపారు. ‘‘రెండోస్ధానంలో ఉందంటే గ్రామీణ ప్రాంతంలోని జనాల్లో ఇంకా బీఆర్ఎస్ పై నమ్మకం ఉంది’’ అని అర్ధమవుతోందన్నారు. ‘‘గ్రామీణప్రాంతాల్లో గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువసీట్లు కాంగ్రెస్ గెలిచినా ఇపుడు పంచాయితీల్లో బీఆర్ఎస్ చెప్పుకోదగ్గ స్ధానాల్లో మద్దతుదారులు గెలవటం కారుపార్టీకి ఊరటే’’ అని అన్నారు. ‘‘పంచాయితీ ఫలితాలతో తొందరలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పుంజుకునేందుకు బీఆర్ఎస్ కు గట్టి అవకాశాలున్నాయని అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘రెండో స్ధానంలోనే బీఆర్ఎస్ ఉంటుందా లేకపోతే మొదటిస్ధానంకు చేరుకుంటుందా అన్నది తొందరలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తేలుతుంది’’ అని అన్నారు.

బలమైన పునాదులున్నాయి : కూరపాటి

‘‘లోకల్ బాడీ ఎన్నికల్లో ఫలితాలు ఎక్కువగా అధికారపార్టీకి మద్దతుగానే ఉంటుంది‘‘ అని కాకతీయ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ రిటైర్డ్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకుడు కూరపాటి వెంకటనారాయణ అన్నారు. ‘‘దశాబ్దాల ఎన్నికలను విశ్లేషిస్తే చాలా రాష్ట్రాల్లో స్ధానిక ఎన్నికల ఫలితాలు అధికారపార్టీకే అనుకూలంగా ఉంటాయి’’ అని చెప్పారు. ‘‘బీఆర్ఎస్ పైన గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మద్దతు ఉన్నట్లు అర్ధమవుతోంది’’ అని కూడా అన్నారు. ‘‘బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ళు అధికారంలో ఉన్నకారణంగా ఆర్ధికంగా కారుపార్టీ నేతలు చాలాబలంగా తయారయ్యారు’’ అని అన్నారు. ‘‘ప్రజాప్రతినిధులు, మాజీలు లేదా వాళ్ళ మద్దతుదారులు గ్రామీణ ప్రాంతాల్లో బలంగా ఉన్నారు’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘అధికార-ప్రధాన ప్రతిపక్షాల మధ్య గట్టి పోటీ అన్నది ప్రజాస్వామ్యానికి చాలా మంచిది’’ అన్నారు. ‘‘బీఆర్ఎస్ కు గ్రామీణ ప్రాంతాల్లో పునాదులు బలంగా ఉన్నాయని అర్ధమవుతోంది’’ అని కూరపాటి అభిప్రాయపడ్డారు.


బీఆర్ఎస్ 25శాతం పంచాయితీల్లో గెలిచింది: చలసాని

‘‘స్ధానికఎన్నికలు మామూలుగా అధికారపార్టీకి అనుకూలంగానే ఉంటాయి’’ అని సీనియర్ జర్నలిస్టు చలసాని నరేంద్ర అన్నారు. ‘‘అంతమాత్రాన సాధారణ ఎన్నికల్లో తామే గెలుస్తామని కాంగ్రెస్ అనుకుంటే కష్టమే’’ అనికూడా చెప్పారు. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ కు పటిష్టమైన నాయకత్వం ఉందన్న విషయాన్ని గుర్తించుకోవాలి’’ అన్నారు. ‘‘బీఆర్ఎస్ కు గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ నిర్మాణం కూడా లేకపోయినా గణనీయసంఖ్యలోనే గెలిచింది’’ అని చెప్పారు. ‘‘రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఇమేజీకి పరీక్షగా మారింది కాబట్టే పార్టీ నేతలు గట్టిగా పనిచేశారు’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘అధికారంలో ఉండటం కాంగ్రెస్ కు పెద్ద అడ్వాంటేజ్’’ అన్నారు. ‘‘బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండికూడా 25శాతం పంచాయితీల్లో మద్దతుదారులు గెలుచుకోవటం చిన్న విషయంకాదు’’ అని అన్నారు.

Tags:    

Similar News