2029 ఎన్నికల్లో పోటీకి కవిత రెడీ
ఎక్స్(ట్విట్టర్) వేదికగా క్లారిటీ ఇచ్చిన కవిత. రాజకీయాల్లో నిలదొక్కుకుంటానని స్పష్టత.
తెలంగాణలో 2029లో వచ్చే ఎన్నికల్లో తాను కూడా పోటీ చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఆమె ప్రజలు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు. ఇందులో భాగంగానే ఎన్నికల్లో పోటీపై స్పష్టతనిచ్చారు. దాంతో పాటుగా ప్రస్తుత రాజకీయ పార్టీల మధ్య నిలదొక్కుకుంటానని స్పష్టం చేశారు. తన విజన్‌పై స్పందించిన కవిత, “2047 నా లక్ష్యం. ఉచిత విద్య, ఉచిత వైద్యం నా విధానం” అంటూ స్పష్టం చేశారు. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుల కారణంగా నష్టపోయిన రైతులను కలుస్తారా? అనే ప్రశ్నకు స్పందించిన కవిత, త్వరలోనే ఆ రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటానని తెలిపారు. అభివృద్ధి పేరుతో రైతులు నష్టపోవడం సరికాదని, వారి హక్కుల కోసం పోరాటం చేస్తామని చెప్పారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై మీ అభిప్రాయం ఏమిటని ఓ నెటిజన్ అడగగా, కవిత తీవ్రంగా స్పందించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని, చేస్తామన్న పనులను కూడా సక్రమంగా అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనపై ప్రజలు పూర్తిగా నిరాశతో ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు. మొత్తంగా, 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని స్పష్టమైన రాజకీయ ప్రణాళికతో ముందుకు వెళ్లనున్నట్లు కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.