మోదీ పరువు తీసేసిన తెలంగాణ బీజేపీ ఎంపీలు

భేటీ అయిన ఎంపీల్లో ఎవరో మొత్తం వివరాలను పూసగుచ్చినట్లుగా లీక్ చేసేశారు

Update: 2025-12-16 09:15 GMT
Narendra Modi with Telangana BJP MPs and MLAs

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరువును తెలంగాణ బీజేపీ ఎంపీలు సాంతం తీసేశారు. మోదీ చెప్పినమాటను ఏమాత్రం లెక్కచేయలేదు. దాంతో పార్టీ పరువంతా పోయింది. ఈ విషయం స్వయంగా మంగళవారం కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి(Kishan Reddy) మాటల్లో అర్ధమైపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే నాలుగురోజుల క్రితం (Narendra Modi)మోదీతో తెలంగాణ ఎంపీ(Telangana BJP MPs)లు సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఎంపీల పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేయటమే కాకుండా పనిచేయాల్సిన విధానంపై ఫుల్లుగా క్లాసుకూడా తీసుకున్నారన్న విషయం ప్రధానమీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యింది.

ఇపుడు విషయం ఏమిటంటే ఆభేటీలో మాట్లాడుకున్న విషయాలను బయటకు చెప్పవద్దని ఎంపీలకు మోదీ స్పష్టంగా చెప్పారు. అయినా భేటీ అయిన ఎంపీల్లో ఎవరో మొత్తం వివరాలను పూసగుచ్చినట్లుగా లీక్ చేసేశారు. దాంతో మరుసటిరోజు మెయిన్ మీడియాలో తెలంగాణ ఎంపీలకు మోదీ క్లాసు పీకిన వార్త ప్రముఖంగా వచ్చింది. అప్పటికే సోషల్ మీడియాలో బాగా వైరల్ కూడా అయిపోయింది.

ఈరోజు అదే విషయమై ఢిల్లీలో కిషన్ మాట్లాడుతు ప్రధానితో భేటీ వివరాలను లీక్ చేసిన వారిపై ఓరేంజిలో మండిపోయారు. మోదీతో మాట్లాడిన వివరాలను మీడియాకు ఎవరు లీక్ చేశారో తనకు తెలియాలంటు రెచ్చిపోయారు. పార్టీని బద్నాం చేయటం కోసమే ఎవరో ఉద్దేశ్యపూర్వకంగా లీక్ చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. భేటీ వివరాలను బయటకు చెప్పవద్దని మోదీ గట్టిగా చెప్పినా పట్టించుకోకుండా ఎవరో కావాలనే లీకులు ఇచ్చారని కిషన్ అన్నారు. ఎంపీలందరితో మాట్లాడుతు మోదీతో భేటీవివరాలను బయటకు ఎవరు లీక్ చేశారో తనకు తెలియాలని ఎంపీలను నిలదీశారు. లీకులు ఇచ్చింది ఎవరో తెలిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎంపీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లో బాగా ప్రచారం చేయాలని మాత్రమే చెప్పినట్లు ఇపుడు కిషన్ చెప్పారు. అందరు కలిసికట్టుగా పనిచేసి పార్టీని తెలంగాణలో మరింత బలోపేతం చేయాలని హితబోధ చేసినట్లు కిషన్ అన్నారు. మరి కిషన్ చెప్పిందే నిజమైతే లీకుల రూపంలో వైరల్ అయిన అంశాల మాటేమిటి ? బీజేపీ ఎంపీలకన్నా ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉన్నారని మోదీ అన్నట్లుగా వార్తలు వచ్చాయి.

పార్టీ తరపున 8మంది ఎంపీలు, 8మంది ఎంఎల్ఏలు ఉండికూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాల్సిన పోరాటాలు చేయటంలేదన్న అసంతృప్తిని మోదీ వ్యక్తంచేసినట్లుగా ప్రచారం జరిగింది. మొత్తంమీద పార్టీ ఎంపీలు, ఎంఎల్ఏల పనితీరుపైన మోదీ తీవ్రఅసంతృప్తిని వ్యక్తంచేసినట్లుగా వార్తలువచ్చాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మీడియా లేదా సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు తప్పని కిషన్, ఎంపీ లేదా ఎంఎల్ఏ కూడా ఇప్పటివరకు ఖండించలేదు. ఖండించలేదంటే ప్రజాప్రతినిధుల పనితీరుపై మోదీ అసంతృప్తి, ఆగ్రహం నిజమన్నట్లే కదా.

Tags:    

Similar News