నాగారం భూముల అంశంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకెళ్లిన పిటిషనర్‌కు షాక్.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కొనుగోలు చేసిన భూముల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. వారు కొనుగోలు చేసిన భూములు భూదాన్ భూములని పేర్కొంటూ బీర్ల మల్లేష్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. మల్లేష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై మల్లేష్ తొలుత హైకోర్టును ఆశ్రయించారు. కాగా ఈ వ్యవహారాన్ని విచారించిన న్యాయస్థానం ఐఏఎస్, ఐపీఎస్‌లకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. దీంతో ఉన్నత న్యాయస్థానం తీర్పును ఛాలెంజ్ చేస్తూ మల్లేష్.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు.. హైకోర్టును తీర్పును సమర్థిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. సుప్రీం నిర్ణయంతో కొన్ని సర్వే నంబర్ల భూముల కొనుగోలుదారులకు తాత్కాలిక ఊరట లభించినట్లయింది.
కేసు నేపథ్యం
ఈ వివాదం ప్రధానంగా నాగారం గ్రామంలోని సర్వే నంబర్లు 181, 182, 194, 195లలో ఉన్న సుమారు 103 ఎకరాల భూములకు సంబంధించినది. ఇవి 1950వ దశకంలో వినోబా భావే పిలుపు మేరకు దాతలు ఇచ్చిన భూదాన్ భూములుగా రికార్డులలో ఉన్నాయి. పేదలకు పంపిణీ చేయాల్సిన ఈ భూములు ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండాల్సి ఉండగా, కాలక్రమేణా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు జరిగాయని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండటంతో ఈ భూముల విలువ ప్రస్తుతం రూ.1,000 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.
అక్రమాల ఆరోపణలు
పిటిషనర్లు దర్యాప్తు సంస్థల ప్రాథమిక నివేదికల ప్రకారం, ఈ భూములను పట్టా భూములుగా చూపించేందుకు రెవెన్యూ రికార్డుల్లోని ‘భూదాన్’ అనే పదాన్ని తొలగించి ప్రైవేటు వ్యక్తుల పేర్లు చేర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. దశాబ్దాల క్రితమే మరణించిన వ్యక్తుల పేర్లతో నకిలీ వారసత్వ పత్రాలు సృష్టించి, భూములను తమ పేర్లకు మార్చుకున్నారని కూడా ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో సుమారు పది మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వారి కుటుంబ సభ్యులు బిల్డర్లు భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు రావడం రాజకీయంగా పరిపాలనా పరంగా సంచలనం సృష్టించింది.
ED దర్యాప్తు, హైకోర్టు పాత్ర
ఈ వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలవడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కోణంలో విచారణ ప్రారంభించింది. ఫోర్జరీ డాక్యుమెంట్లు రికార్డుల మానిపులేషన్ జరిగిందని ED ప్రాథమికంగా గుర్తించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. తెలంగాణ హైకోర్టు ఈ భూములను వివాదాస్పదమైనవిగా పరిగణించి నిషేధిత జాబితా (సెక్షన్ 22A)లో చేర్చాలని ఆదేశించింది. దీని వల్ల ఈ భూములపై అమ్మకాలు కొనుగోళ్లు రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట పడింది. స్టే ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ, కొన్ని భూముల్లో భారీ నిర్మాణాలు కొనసాగుతున్నాయన్న ఆరోపణలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అప్పటి జిల్లా అధికారులకు నోటీసులు జారీ చేసింది.
తాజా పరిణామాలు
2025 నవంబర్‌లో హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక నిర్ణయం తీసుకుంది. సర్వే నంబర్లు 194, 195లలోని భూములు పట్టా భూములని కొనుగోలుదారులు సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకుని ఆ సర్వే నంబర్ల వరకు స్టేను పాక్షికంగా సడలించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను డిసెంబర్ 16, 2025న అత్యున్నత న్యాయస్థానం కొట్టివేయడంతో ఆ భూముల విషయంలో డివిజన్ బెంచ్ తీర్పే కొనసాగనుంది.
పెండింగ్‌లో ఉన్న అంశాలు
ఈ కేసులో మొత్తం భూముల్లో కొంత భాగం పట్టా భూమిగా మరికొంత భాగం భూదాన్ భూమిగా ప్రభుత్వ రికార్డులు పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. భూదాన్ బోర్డు రికార్డులు రెవెన్యూ శాఖ రికార్డులకు పొంతన లేకపోవడమే ఈ వివాదానికి మూలకారణమని న్యాయపరంగా కూడా చర్చ సాగుతోంది. ప్రస్తుతం సర్వే నంబర్లు 181, 182లకు సంబంధించిన భూములపై న్యాయపోరాటం కొనసాగుతూనే ఉంది.
ప్రభుత్వ కమిటీ నివేదిక, ED తుది నివేదిక ఆధారంగా ఈ భూముల భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి అధికారుల ప్రమేయంపై ఆరోపణలు కోర్టు ఆదేశాల ఉల్లంఘన అంశాలు ఈ కేసును మరింత సున్నితంగా మార్చాయి. భూదాన్ ప్రభుత్వ భూముల రక్షణ కోసం మరిన్ని దర్యాప్తులు న్యాయపరమైన చర్యలు కొనసాగనున్నాయని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.