రేవంత్ కు కాంగ్రెస్ ఎంఎల్ఏల ’డివిజన్ల’ షాక్
అధికారపార్టీ నేతలుకూడా ప్రభుత్వనిర్ణయాన్ని తప్పుపట్టడమే రేవంత్ కు షాక్ కొట్టినట్లయ్యింది.
వరుస సక్సెస్ లతో మంచి ఊపుమీదున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి సొంతపార్టీ ఎంఎల్ఏలే పెద్ద షాకిచ్చారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక గెలుపు, గ్లోబల్ సమ్మిట్ సక్సెస్, లియోనల్ మెస్సీతో ఎగ్జిబిషన్ మ్యాచ్ గ్రాండ్ సక్సెస్ తో రేవంత్ మంచి ఊపుమీదున్నాడు. అలాంటిది జీహెచ్ఎంసీ డివిజన్ల సంఖ్య పెంపు నిర్ణయంతో అన్నీ వర్గాల నుండి రేవంత్ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. సోమవారం సాయంత్రం గ్రేటర్ మున్సిపల్ కమీషనర్ ఆర్వీ కర్ణన్ తో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టడం, నిలదీయటం, ఆరోపణలతో రెచ్చిపోవటం చాలాసహజం. అయితే వారికిమద్దతుగా అధికారపార్టీ నేతలుకూడా ప్రభుత్వనిర్ణయాన్ని తప్పుపట్టడమే రేవంత్ కు షాక్ కొట్టినట్లయ్యింది. ఏ ప్రాతిపదికన గ్రేటర్ డివిజన్ల సంఖ్యను పెంచారో చెప్పాలని గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు కమిషనర్ కర్ణన్ ను కాంగ్రెస్ ఎంఎల్సీ బల్మూరి వెంకట్ తో పాటు కాంగ్రెస్ లో ఉన్న బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏలు అరెకపూడి గాంధీ, దానం నాగేందర్ నిలదీశారు. బీఆర్ఎస్ ఎంఎల్ఏలు తలసాని, కాలేరు వెంకటేష్, ముఠాగోపాల్, సురభివాణిదేవి తదితరులు కూడా నిరసన తెలిపారు.
సొంతపార్టీ నేతలే ప్రభుత్వనిర్ణయాన్ని తప్పుపట్టడంతో ప్రతిపక్షాల నేతలు మరింతగా రెచ్చిపోతున్నారు. గ్రేటర్ డివిజన్ల సంఖ్యను రేవంత్ ప్రభుత్వం 150 నుండి 300కి పెంచింది. గ్రేటర్ శివారుప్రాంతాల్లోని 27 మున్సిపాలిటీలతో పాటు కొన్ని పంచాయితీలను గ్రేటర్ పరిధిలోకి తీసుకొచ్చి వాటిని డివిజన్లుగా మార్చేసింది. గ్రేటర్ డివిజన్లను 150 నుండి 300కి పెంచటం కచ్చితంగా రాజకీయలబ్దిపొందటం కోసమే అనటంలో ఎలాంటి సందేహంలేదు. కాకపోతే చేసేపనేదో కాస్త శాస్త్రీయంగా చేసుంటే బాగుండేది. ఇదేవిషయాన్ని కాంగ్రెస్ ఎంఎల్ఏలు మేయర్ ను అడిగినపుడు డివిజన్ల సంఖ్య పెంచే విషయం తనకు కూడా తెలీదని గద్వాల సమాధానం చెప్పటమే ఆశ్చర్యం.
గ్రేటర్ మేయర్ కు కూడా సమాచారం లేకుండానే డివిజన్లు పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటమే విచిత్రం. మేయర్ కే కాదు చాలామంది కార్పొరేటర్లకు కూడా సమాచారంలేదు. మామూలుగా డివిజన్ల సంఖ్యను పెంచాలంటే ముందుగా కార్పొరేషన్ సమావేశంలో చర్చించాలి. కార్పొరేటర్ల అభిప్రాయాలను సేకరించాలి. కార్పొరేషన్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం అవసరమైతే గ్రేటర్లో విలీనం చేయబోయే మున్సిపాలిటీలు, పంచాయితీల్లోని ప్రజల అభిప్రాయాలు సేకరించాలి. ఇటు కార్పొరేషన్ సమావేశంలో అటు ప్రజల్లో మెజారిటి నిర్ణయంప్రకారం శాస్త్రీయంగా డివిజన్ల పునర్విభజన జరగాలి. అయితే రేవంత్ ప్రభుత్వం ఎలాంటి ప్రొసీజర్ ను ఫాలో అయినట్లు కనబడటంలేదు. రేవంత్ కు బుద్ధిపుట్టడం ఆలస్యం వెంటనే అధికారయంత్రాంగం ఆచరణలోకి తీసుకొచ్చేసినట్లుగా అనుమానాలు పెరిగిపోతున్నాయి.
డివిజన్ల పెంపుపై బీఆర్ఎస్ ఎంఎల్ఏ తలసాని శ్రీనివాసయాదవ్, ఎంఎల్సీ దాసోజు శ్రవణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు తదితరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఎంఐఎం కోసమే పెంచారు : కిషన్
గ్రేటర్ డివిజన్లపెంపు కేవలం మజ్లిస్ పార్టీ లబ్దికోసమే అని కేంద్ర బొగ్గుగనుల శాఖమంత్రి జీ కిషన్ రెడ్డి మండిపడ్డారు. డివిజన్ల పెంపులో శాస్త్రీయత కనబడలేదని ఆరోపించారు. కేవలం రాజకీయలబ్దికోసమే రేవంత్ ప్రభుత్వం తనిష్టం వచ్చినట్లు డివిజన్లను పునర్విభజించటంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. డివిజన్ల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
న్యాయపోరాటం తప్పదు : తలసాని
గ్రేటర్ డివిజన్ల పెంపులో పారదర్శకత లేదని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎంఎల్ఏ తలసాని శ్రీనివాసయాదవ్ ఆరోపించారు. తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘రాజకీయపార్టీలను, ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా, ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా ఆఫీసులో కూర్చుని బుర్రకు తోచినట్లు పునర్విభజన చేశారు’’ అని ఎద్దేవాచేశారు. ‘‘హడావుడిగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గ్రేటర్ లో విలీనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది’’ అని నిలదీశారు. ఇదే అంశంపై మంగళవారం జరిగిన గ్రేటర్ కౌన్సిల్ సమావేశంలో కూడా తలసాని మేయర్ గద్వాలతో పాటు కమిషనర్ కర్ణన్ ను గట్టిగా ప్రశ్నించారు. ‘‘డివిజన్లు పెంచటం రాజకీయపార్టీలకు, ప్రజాప్రతినిధులకు మాత్రమే సంబంధించిన అంశంకాదని మొత్తం ప్రజలకు సంబంధించిన అంశం’’ అని తలసాని గుర్తుచేశారు. ‘‘ఇపుడున్న 150 డివిజన్లకే సరిపడా మౌళిక సదుపాయాలు, మ్యాన్ పవర్ లేనపుడు 300 డివిజన్లకు పెంచటంలో రేవంత్ ఉద్దేశ్యం ఏమయ్యుంటుంది’’ అని మాజీమంత్రి ఎద్దేవాచేశారు. ‘‘డివిజన్లపెంపు విషయం తనకు కూడా తెలీదని మేయర్ గద్వాలవిజయలక్ష్మి కూడా చెప్పారు’’ అని తలసాని అన్నారు. డివిజన్ల జనాభాలో వ్యత్యాసం కూడా ఉందన్నారు. ప్రభుత్వం గనుక తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే పార్టీపరంగా న్యాయపోరాటం కూడా చేస్తాము’’ అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రాజకీయ కుట్ర : రామచంద్రరావు
గ్రేటర్ పరిధిలోకి కొత్తగా 150 డివిజన్లను చేర్చటం రేవంత్ ప్రభుత్వ రాజకీయ కుట్రగా బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయంవల్ల 27 మున్సిపాలిటీల్లోని ప్రజలకు లాభాలు లేకపోగా నష్టాలు తప్పవన్నారు. మున్సిపాలిటీలు, పంచాయితీలను గ్రేటర్ పరిధిలోకి తీసుకురావటంతో ప్రజలపై అన్నీరకాల పన్నుల భారం పెరిగిపోతుందని చెప్పారు. ఎంఐఎం సహకారంతో అత్యధిక డివిజన్లను గెలుచుకోవాలన్న ఆలోచన తప్ప రేవంత్ కు ప్రజల సమస్యలను పరిష్కరించే ఉద్దేశ్యంలేదని మండిపడ్డారు.
తప్పుడు పాలసీ : ప్రొఫెసర్ కూరపాటి
‘‘హైదరాబాద్ ను ప్రపంచంలోనే అతిపెద్దగా చూపించాలన్న ఉద్దేశ్యంతోనే 150 డివిజన్లను గ్రేటర్ మున్సిపాలిటీలో కలిపేశారు’’ అని కాకతీయ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ రిటైర్డ్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకుడు కూరపటి నారాయణ అభిప్రాయపడ్డారు. ఫెడరల్ తెలంగాణతో మాట్లాడుతు ‘‘సగం గ్రామీణప్రాంత జనాభాను రేవంత్ ప్రభుత్వం గ్రేటర్ పరిధిలోకి చేర్చేసినట్లయ్యింది’’ అని కూరపాటి అన్నారు. ‘‘ప్రభుత్వ నిర్ణయంవల్ల రాష్ట్రం కార్పొరేట్ తెలంగాణ-రూరల్ తెలంగాణగా విడిపోయింది’’ అని చెప్పారు. ‘‘పేదలతెలంగాణ గ్రామీణప్రాంత జిల్లాల్లో ఎడారిగా మారిపోతుంది’’ అని అన్నారు. ‘‘గ్రేటర్ పరిధి మాత్రం ధనవంతుల తెలంగాణగా మారిపోతుంది’’ అని మండిపడ్డారు. ‘‘గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పట్టుసాధించేందుకే 300 డివిజన్లు చేసింది’’ అని అనుమానించారు. ‘‘గ్రేటర్ పరిధిని పెంచేబదులు రాష్ట్రంలో మరో నాలుగు మెగాసిటీలను లేదా శాటిలైట్ సిటీలను ఏర్పాటు చేయచ్చు’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘గతంలో ఆంధ్ర-తెలంగాణ అన్నట్లుగా భవిష్యత్తులో నార్త్ తెలంగాణ-సౌత్ తెలంగాణ అనేభావన పెరిగే అవకాశముంది’’ అని అనుమానించారు. ‘‘రేవంత్ ప్రభుత్వం చేస్తున్నది మంచిది కాదు’’ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో పట్టుసాధించటమే రేవంత్ వ్యూహంగా కనబడుతోందని ప్రొఫెసర్ అనుమానించారు.
కార్పొరేట్ల కోసమే : చలసాని
‘‘గ్రేటర్ పరిధిని పెంచటం అన్నది రియల్ ఎస్టేట్ విలువలు పెంచటం కోసమే అనే అనుమానంగా ఉంది’’ అని సీనియర్ జర్నలిస్టు చలసాని నరేంద్ర అన్నారు. ‘‘పౌర సదుపాయాలు పెంచటం కన్నా భూముల విలువ పెంచటమే ధ్యేయంగా ఉంది’’ అని అనుమానించారు. ‘‘మాదాపూర్, హైటెక్ సిటీ లాంటి ఏరియాల్లో భూముల ధరలు పెరిగిపోయినట్లే కొత్తగా చేరిన 150 డివిజన్లలోని భూముల ధరలు కూడా పెరగటం తప్ప మరే ఉపయోగం ఉండదు’’ అన్నారు. ‘‘పౌరసేవలు పెంచటానికి బదులు, గ్రేటర్ పరిధిని పెంచటం వల్ల జనాలకు నష్టమే’’ అన్నారు. ‘‘పరిధి పెంచే విషయంలో ఎంఎల్ఏలు, ఎంపీలు, కార్పొరేటర్లు, పబ్లిక్ అభిప్రాయాలు తీసుకోలేదు’’ అని ఆరోపించారు. ‘‘గ్రేటర్ పరిధి పెంచటం కేవలం కార్పొరేట్ కంపెనీల లాభాల కోసమే కాని సామాన్య జనాలకు జరిగే ఉపయోగాలు ఏమీలేవు’’ అని చలసాని అభిప్రాయపడ్డారు.
అభివృద్ధి కోసమే :ఫసియుద్దీన్
జీహెచ్ఎంసీ డిప్యుటీ మేయర్ ఫసీయుద్దీన్ మాట్లాడుతు అభివృద్ధిని వేగవంతం చేయటం కోసమే ప్రభుత్వం డివిజన్ల సంఖ్యను 150 నుండి 300కి పెంచిందని చెప్పారు. డివిజన్ల సంఖ్య పెరిగితే ఎక్కువమంది నేతలకు పదవులు కూడా వస్తాయన్నారు. ప్రజలకు మౌళికసదుపాయాలు అందించటం ప్రభుత్వానికి వీలవుతుందని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అందరు స్వాగతించాలని అప్పీల్ చేశారు.
పునరాలోచన తప్పదా ?
డివిజన్ల పెంపు విషయంలో ప్రతిపక్షాల నుండే కాకుండా సొంతపార్టీ నుండి కూడా వ్యతిరేకత పెరిగిపోతుండటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రతిపక్ష నేతలనుండి అభ్యంతరాలు వచ్చినపుడు ప్రభుత్వం లెక్కచేస్తుందని అనుకునేందుకు లేదు. కానీ సొంతపార్టీ నేతలనుండి కూడా అభ్యంతరాలు పెరిగిపోతున్నపుడు రేవంత్ ఏమిచేయాలి ? కచ్చితంగా మెజారిటి నేతలు, ప్రజల అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సిందే. కాబట్టి 300 డివిజన్ల పెంపు నిర్ణయాన్ని ప్రస్తుతానికి హోల్డులో ఉంచే అవకాశాలున్నాయి. కమిషనర్ కర్ణన్ కూడా ఇదే విషయాన్ని కౌన్సిల్ మీటింగులో చెప్పారు. కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధుల అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళతానని తెలిపారు. పునర్విభజనపై ఒకకమిటీని నియమించి అన్నీ వర్గాలనుండి అభ్యంతరాలు, సూచనలు, సలహాలను తీసుకుని తర్వాత శాస్త్రీయంగా పునర్విభజన చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్న విషయాన్ని రేవంత్ మన్నిస్తారా ?