సిడ్నీలో కాల్పులు జరిపిన సాజిద్ హైదరాబాద్ వ్యక్తే

15 మంది మరణానికి కారకులైన తండ్రి, కొడుకుల్లో తండ్రి(Sajid Akram) సాజిద్ హైదరాబాద్(Hyderabad) వ్యక్తిగా బయటపడటం సంచలనంగా మారింది

Update: 2025-12-16 13:42 GMT
Sajid Akram and Naveed Akram

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆదివారం పర్యాటకులపై కాల్పులు జరిపి 15 మంది మరణానికి కారకులైన తండ్రి, కొడుకుల్లో తండ్రి(Sajid Akram) సాజిద్ హైదరాబాద్(Hyderabad) వ్యక్తిగా బయటపడటం సంచలనంగా మారింది. ఆదివారం ఈ ఇద్దరు జరిపిన కాల్పుల్లో 15 మంది చనిపోగా 45మంది తీవ్రంగా గాయపడిన విషయంతెలిసిందే. యూదులు హనుక్కా(Hanukkah celebrations) వేడుకులు జరుపుకుంటున్న సమయంలో తండ్రి సాజిద్ అక్రమ్, కొడుకు నవీద్ అక్రమ్ ఒక్కసారిగా తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్ధలానికి వచ్చి జరిపిన ఎదురు కాల్పుల్లో సాజిద్ అక్కడికక్కడే మరణించగా కొడుకు నవీద్ కు గాయాలయ్యాయి. ఇతడిని పోలీసులు ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయిస్తున్నారు.

మొన్నటివరకు దేశంలో ఎక్కడ ఉగ్రమూలాలు బయటపడినా లేదా ఎక్కడైనా ఉగ్రఘటన జరిగినా వెంటనే దాని మూలాలు హైదరాబాదులో ఉన్నట్లు ఆధారాలు బయటపడేది. అలాంటిది ఇపుడు హైదరాబాద్ వ్యవహారం అంతర్జాతీయస్ధాయికి చేరుకున్నది. చనిపోయిన సాజిద్ గురించి పోలీసులు విచారించినపుడు మృతుడు హైదరాబాద్ వాసిగా బయటపడటం సంచలనంగా మారింది. సాజిద్ 1998లో స్టూడెంట్ వీసీపై ఆస్ట్రేలియాకు వెళ్ళి అక్కడే స్ధిరపడ్డాడు. తర్వాత యురోపియన్ అమ్మాయిని వివాహంచేసుకున్నాడు. వీళ్ళకు నవీద్ అక్కడే జన్మించాడు కాబట్టి కొడుకు జన్మతహ ఆస్ట్రేలియా పౌరుడే. చనిపోయిన సాజిద్ దగ్గర హైదరాబాదులో జారీచేసిన పాస్ పోర్టు ను ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ అధికారులు గుర్తించారు.

ఆదివారం దాడికి ముందు తండ్రి, కొడుకులు ఫిలిప్పీన్స్ కు వెళ్ళొచ్చినట్లు పాస్ పోర్టుల్లో స్టాంపింగ్ ఉంది. అక్కడ ఐఎస్ఐఎస్ దగ్గర ఉగ్రశిక్షణ తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వాళ్ళ వాహనంలో ఇంప్రువైజ్డ్ ఎక్స్ ప్లోసివ్ డివైస్ లు, హోమ్ మేడ్ ఐఎస్ఐఎస్ జెండాలు దొరికాయి. దాడి జరిగిన విధానం చూసిన తర్వాత ఇది ఐఎస్ఐఎస్ భావజాల ప్రేరేపితమని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. ఆస్ట్రేలియా పోలీసులు అందించిన సమాచారం ప్రకారం భారత నిఘావర్గాలు హైదరాబాదులోని సాజిద్ కుటుంబసభ్యుల వివరాల కోసం జల్లెడపడతున్నాయి.

Tags:    

Similar News