ఢిల్లీలో రేవంత్ బిజీబిజీ

కేంద్రమంత్రులతో వరుస భేటీలు అవుతున్న రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో కూడా భేటీ.

Update: 2025-12-16 13:13 GMT

హైదరాబాద్‌కు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌(IIM) కళాశాలను మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్లమెంట్‌లోని ఛాంబర్‌లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయిన సీఎం, తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు అవసరాన్ని వివరించారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. ఇందులో భాగంగా IIMను నిర్మించడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని, కేంద్రం మంజూరు చేయడమే ఆలస్యమని కూడా రేవంత్ పునరుద్ఘాటించారు. తెలంగాణలో ఇప్పటివరకు ఐఐఎం ఒక్కటి కూడా లేదని గుర్తు చేశారు. దేశంలో మొత్తం 19రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కళాశాల ఉందని వివరించారు.

టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి రంగాల్లో హైదరాబాద్ దేశంలో ముందంజలో ఉందని, ఈ నేపథ్యంలో నగరంలో ఐఐఎం ఏర్పాటు చేయడం అత్యవసరమని తెలిపారు.ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రాంగణంలో గుర్తించినట్లు సీఎం తెలిపారు. తరగతులు వెంటనే ప్రారంభించేందుకు ట్రాన్సిట్ క్యాంపస్ కూడా సిద్ధంగా ఉందని, అవసరమైన అనుమతులు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని భరోసా ఇచ్చారు.

హైదరాబాద్‌కు దేశంలోని అన్ని ప్రాంతాలకు అనుసంధానించే ఎయిర్, రైల్, రోడ్ కనెక్టివిటీ ఉన్నదని, అనుకూల వాతావరణం, విభిన్న రంగాల్లో ప్రతిభను అందించిన చరిత్ర నగరానికి ఉందని సీఎం పేర్కొన్నారు. అదేవిధంగా, తెలంగాణలో జిల్లాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో 9 కొత్త కేంద్రీయ విద్యాలయాలు, 16 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న పట్టణీకరణతో పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఈ విద్యాసంస్థలు అవసరమని తెలిపారు.

కొమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, వికారాబాద్, నిర్మల్ జిల్లాల్లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, మెడ్చల్ మల్కాజిగిరి, మెదక్, ములుగు, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలను వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు అవసరమైన భూమి, ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలిపారు.




 


విద్యారంగ అభివృద్ధికి చర్యలు

తెలంగాణలో విద్యారంగ అభివృద్ధికి కూడా తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ‌లో అత్య‌ధిక సంఖ్య‌లో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వ‌ర్గాల‌ పిల్ల‌ల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించేందుకు ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను  వివ‌రించారు. తెలంగాణ‌ వ్యాప్తంగా 105 శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో నిర్మిస్తున్న‌ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల (YIIRS) ప్రాధాన్య‌త‌ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు.

5 నుంచి 12 త‌ర‌గ‌తుల వ‌ర‌కు ఉండే ఒక్కో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ( YIIRS)లో 2,560 మంది విద్యార్థులు ఉంటార‌ని, మొత్తంగా 105 పాఠ‌శాల‌తో 2.70 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు ప్ర‌త్య‌క్షంగా నాణ్య‌మైన విద్యాబోధ‌న ల‌భిస్తుంద‌ని వివ‌రించారు. YIIRSలు స‌మీప ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు విద్యా హ‌బ్‌లుగా ఉండ‌డంతో ప‌రోక్షంగా ల‌క్ష‌లాది మంది విద్యార్థుల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని తెలియ‌జేశారు.


 



అత్యాధునిక వ‌స‌తులు, లేబొరేట‌రీలు, స్టేడియాలతో నిర్మించే ఈ 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ.21 వేల కోట్ల వ్య‌య‌మ‌వుతుంద‌ని తెలిపారు. అలాగే, రాష్ట్రంలోని జూనియ‌ర్‌, డిగ్రీ, సాంకేతిక క‌ళాశాలలు, ఇత‌ర ఉన్న‌త విద్యా సంస్థ‌ల్లో ఆధునిక ల్యాబ్‌లు, ఇత‌ర మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు మ‌రో రూ.9 వేల కోట్లు వెచ్చించ‌నున్న‌ట్లు చెప్పారు.

మొత్తంగా రాష్ట్రంలో విద్యా రంగం స‌మ‌గ్రాభివృద్ధికి త‌మ ప్ర‌భుత్వం రూ.30 వేల కోట్లు వెచ్చించినున్న‌ట్లు ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రి గారికి తెలిపారు. ఈ నిధుల స‌మీక‌ర‌ణ‌కు ప్ర‌త్యేక ప్ర‌యోజ‌న సంస్థ (SPC) ఏర్పాటు చేయనున్నామని, తద్వారా సేక‌రించే రుణాల‌కు ఎఫ్ఆర్‌బీఎం ప‌రిమితి నుంచి మిన‌హాయించాల‌ని ముఖ్యమంత్రి గారు కోరారు. విద్యా రంగంపై ప్ర‌భుత్వం చేస్తున్న వ్య‌యాన్ని మాన‌వ వ‌న‌రుల అభివృద్ధికి చేస్తున్న పెట్టుబ‌డిగా భావించాల‌ని కోరారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల ఏర్పాటు, తెలంగాణ‌లో విద్యా రంగం అభివృద్ధిపై ముఖ్య‌మంత్రి గారు చూపుతున్న చొర‌వ‌ను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ గారు ప్ర‌శంసించారు. YIIRS మోడ‌ల్ బాగుంద‌న్న కేంద్ర మంత్రి గారు SPC కి సంబంధించిన వివ‌రాల‌ను అంద‌జేయాల‌ని సూచించారు.

 

సోనియా గాంధీకి రైజింగ్ డాక్యుమెంట్

తన ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకురాలు సోనియా గాంధీని కూడా కలిశారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 విశేషాలను సోనియా గాంధీ గారికి తెలియజేశారు.

ప్రజా పాలనలో గత రెండేండ్లుగా అమలవుతున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. ఈ సందర్భంగా, తెలంగాణలో ప్రజా ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారి దూరదృష్టిని సోనియా గాంధీ గారు అభినందించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News