ముగిసిన పంచాయతీ ఎన్నికలు, ఏ పార్టీకి ఎన్ని స్థానాలంటే !

మూడో విడత ఎన్నికల్లో 4,159 సర్పంచి స్థానాలకు గాను 2,286 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు విజయం.

Update: 2025-12-18 05:50 GMT

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మూడు విడతలు జరిగిన ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా ప్రతి అభ్యర్థి పోటీ పడ్డారు. ఈ ఎన్నికలకు పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించాయి. తమ మద్దతు అభ్యర్థులకు పూర్తి సపోర్ట్ ఇచ్చాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్.. పంచాయతీ ఎన్నికల్లో కూడా అదే హవాను కనబరిచింది. మూడు విడతల్లో కూడా కాంగ్రెస్ మద్దతు దారులు ఆధిక్యం సాధించారు. మూడు విడతల ఫలితాలను సమగ్రంగా పరిశీలిస్తే.. కాంగ్రెస్ పార్టీ సుమారు 56 శాతం స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని బలాన్ని ప్రదర్శించింది.

మూడో విడత ఎన్నికల్లో 4,159 సర్పంచి స్థానాలకు గాను 2,286 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 1,142 స్థానాలతో రెండో స్థానంలో నిలవగా, బీజేపీ 242 స్థానాలను దక్కించుకుంది. సీపీఐ 24, సీపీఎం 7 స్థానాల్లో గెలుపొందగా, ఇతరులు 479 స్థానాలను సొంతం చేసుకున్నారు.

రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లో ఎన్నికలు జరగగా, సిద్దిపేట జిల్లా మినహా మిగిలిన 30 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,733 పంచాయతీ సర్పంచి పదవుల్లో కాంగ్రెస్ 7,010 స్థానాల్లో విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ మద్దతుదారులు 3,502 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ 688 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్ వంటి కీలక జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ప్రభుత్వ పథకాలు, స్థానిక నాయకత్వ ప్రభావం ఈ ఫలితాల్లో కీలకంగా పనిచేసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికల్లో ఓటర్ల పాల్గొనడం ఉత్సాహంగా సాగింది. మూడో విడతలో 85.77 శాతం పోలింగ్ నమోదుకాగా, మూడు విడతలు కలిపి రాష్ట్ర సగటు పోలింగ్ 85.30 శాతంగా నమోదైంది. జిల్లాల వారీగా యాదాద్రి భువనగిరి జిల్లా 92.56 శాతంతో అత్యధిక పోలింగ్ నమోదు చేయగా, నిజామాబాద్ జిల్లా 76.45 శాతంతో అత్యల్పంగా నిలిచింది. మహిళా ఓటర్లు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. మూడో విడతలో ఓటు వేసిన 43.37 లక్షల మందిలో 22.15 లక్షలు మహిళలే కావడం విశేషం.

ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి వెబ్‌కాస్టింగ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించారు. చెదురుమదురు ఘటనలు తప్ప రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని తొలుత ఈ నెల 20న నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, ముహూర్తాల కారణంగా ఈ నెల 22వ తేదీకి వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News