స్పీకర్ నిర్ణయంపై కోర్టుకెళ్తాం: బీఆర్ఎస్

ఫిరాయింపు నేతల విషయంలో స్పీకర్ నిర్ణయం ఏకపక్షమన్న బీఆర్ఎస్.

Update: 2025-12-17 14:14 GMT

ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఎమ్మెల్యే విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేతలు తోసిపుచ్చారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయంపై తాము న్యాయ పోరాటం చేస్తామని, ఇది ముమ్మాటికీ ఏకపక్ష నిర్ణయమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కే సంజయ్ వ్యాఖ్యానించారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల క్రాస్‌ఎగ్జామినేషన్ చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ బుధవారం తన నిర్ణయం వెల్లడించారు. వారి ఫిరాయింపు పిటిషన్‌ను కొట్టివేశారు. సదరు నేతలు పార్టీ ఫిరాయించారు అని నిరూపించేలా బీఆర్ఎస్ ఎటువంటి ఆధారాలు చూపలేదని ఆయన తన నిర్ణయంలో పేర్కొన్నారు. ఆయన నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గడ్డం ప్రసాద్ నిర్ణయం ఏకపక్షంగా ఉందన్నారు. తమ వాదనలు వినిపించుకోలేదని ఆరోపించారు. స్పీకర్ తీర్పు కాపీని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఈ అంశంపై హైకోర్టుకు వెళ్తామని వారు పేర్కొన్నారు. సింగిల్ లైన్ స్టేట్‌మెంట్‌తో పిటిన్‌ను తోసిపుచ్చడం సరికాదని అన్నారు. ఇది సమగ్ర విచారణ చేసిన నిర్ణయం తీసుకోవాల్సిన అంశమన్నారు.

స్పీకర్, రాజ్యాంగానికి విరుద్ధంగా తీర్పు ఇచ్చారని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలను సమర్థిస్తూనే స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపించారు. పార్టీ మారిన నేతలు బాహాటంగా కాంగ్రెస్ తరుపున ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కఠినంగా హెచ్చరించేటంత వరకు స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని గుర్తు చేశారు. 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News