సింగరేణిని గడగడలాడిస్తున్న పెద్ద పులి
తీవ్ర భయాందోళనల్లో సింగరేణి కార్మికులు. రంగంలోకి దిగిన అటవీశాఖ.
సింగరేణిలో పెద్ద పులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. సంఘమల్లెపల్లి పరిసన అటవీ ప్రాంతంలో పెద్ద పులి కనిపించడంతో సింగరేణి కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కోల్ బెల్ట్ శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 5, ఎస్‌ఆర్‌పీ3 మైన్స్ సమీపంలో పెద్ద పులి కనిపించిందని అటవీశాఖకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన వెంటనే అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఆశిష్ సింగ్ ఆధ్వర్యంలో రెండు బృందాలు పులి జాడ కోసం అన్వేషణ ప్రారంభించాయి.
అయితే సింగరేణి ప్రాంతంలో పెద్ద పులి కనిపించడం ఇది తొలిసారి కాదని, గతంలో కూడా ఇక్కడ పెద్దపులి కనిపించిందని కార్మికులు చెప్తున్నారు. పెద్దపులి కనిపిస్తుండంతో కార్మికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎప్పుడు ఎటునుంచి, ఎక్కడ వస్తుందో తెలియడం లేదని, దాడి చేస్తే పరిస్థితి ఏంటో అన్న భయంతో గుండెలను గుప్పెట్లో పెట్టుకుని గడుపుతున్నామని కార్మికులు చెప్తున్నారు. కాగా పులి సంచరిస్తున్న కారణంగా కార్మికులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా ఎక్కడికీ వెళ్లొద్దని చెప్తున్నారు.
రాత్రి సమయాల్లో ప్రయాణాలను ఎట్టిపరిస్థితుల్లో పెట్టుకోవద్దని అటవీశాఖ హెచ్చరించింది. వీలైనంత త్వరగా పెద్ద పులిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు చెప్పారు. అప్పటి వరకు కార్మికులు, ప్రయాణికులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.