పంచాయతీ ఊపుతో అయినా కేసీఆర్ జనాల్లో తిరుగుతారా ?

కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు రెండు విడతల్లో 4,756 పంచాయతీల్లో గెలవగా బీఆర్ఎస్ మద్దతుదారులు 2350 పంచాయతీల్లో గెలిచారు

Update: 2025-12-17 10:29 GMT
BRS chief KCR

పంచాయతీ ఎన్నికల గెలుపు ఊపుతో అయినా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనాల్లోకి అడుగుపెడతారా ? ఇపుడు పార్టీతో పాటు బయటకూడా వినబడుతున్న సందేహం ఇదే. పంచాయతీ ఎన్నికలు మూడువిడతల్లో జరిగాయి. మొదటి రెండు విడతల్లో కాంగ్రెస్ మద్దతుదారులు మెజారిటి పంచాయతీల్లో గెలిచారు. అయితే బీఆర్ఎస్ బలపరచిన అభ్యర్ధులు కూడా ఎక్కువస్ధానాల్లోనే గెలిచారు. మరీ బీజేపీ అంతగా కారుపార్టీ మద్దతుదారులు వెనకబడిపోలేదు. మొదటి రెండువిడతల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 4,756 పంచాయతీల్లో గెలవగా బీఆర్ఎస్ మద్దతుదారులు 2350 పంచాయతీల్లో గెలిచారు.

నిజానికి కారుపార్టీ మద్దతుదారులు 2350 పంచాయతీల్లో గెలవటం గొప్పనే చెప్పాలి. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ జనాల్లోకి అడుగుపెట్టనేలేదు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి గ్రామంలో జరిగిన పార్టీ రజతోత్సవ సభలో మాట్లాడినపుడు ఇకనుండి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతానని, ప్రభుత్వాన్ని చీరేస్తాను, చీల్చి చెండాడుతానని ప్రతిజ్ఞచేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ ప్రకటనచూసిన పార్టీనేతలు, జనాలు నిజమే కాబోలు అనుకున్నారు. తీరాచూస్తే మరుసటిరోజు నుండి సార్ ఫామ్ హౌస్ వదిలి బయటకు వస్తే ఒట్టు. బహిరంగసభ జరిగి ఐదునెలలు అయినా ఇప్పటివరకు జనాల్లోకి వచ్చిందే లేదు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికలో కూడా బీఆర్ఎస్ ఓడిపోయింది. తర్వాత జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో అసలు పోటీనేచేయలేదు. ఈమధ్యనే జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో కూడా పార్టీ ఓడిపోయింది. వరుస ఓటములు, అంతగా ప్రభావం చూపించలేకపోతున్న కేటీఆర్ నాయకత్వం, ఎంఎల్ఏల ఫిరాయింపులు తదితరాల కారణంగా పార్టీ సీనియర్ నేతలు, క్యాడర్ కు సరిగ్గా దిశానిర్దేశం చేసేవారే కరువయ్యారు. ఇదేసమయంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపైన కేసులు, విచారణలు జరుగుతున్నాయి. అంతర్గత విభేదాలు పెరిగిపోయిన కారణంగా కల్వకుంట్ల కవితను పార్టీలో నుండి గెంటేశారు.

పార్టీనుండి బయటకు వచ్చేసిన దగ్గర నుండి కవిత బీఆర్ఎస్ నాయకత్వానికి కంట్లో నలుసులాగ తయరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కవిత చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. అలాగే తన భర్త అనీల్ రావు టెలిఫోన్ ను కూడా తమప్రభుత్వం ట్యాపింగ్ చేయించిందన్న ఆరోపణ కలకలంరేపాయి. కవిత ఆరోపణల కారణంగా కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు, టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని జనాలకు నిర్ధారణైపోయింది. ఒకరకంగా పార్టీ అంతర్గతంగానే కాకుండా బయటనుండి కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. కేసీఆర్ ఫామ్ హౌసుకే పరిమితమైన నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలో తిరుగుతారని అనుకుంటే తానుకూడా మీడియా, సోషల్ మీడియా లేదా పార్టీఆఫీసుకు మాత్రమే ఎక్కువగా పరిమితమైపోతున్నారు.

జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత జరిగిన సమీక్షలో పార్టీ నేతల మధ్య సమన్వయలోపం కారణంగానే అభ్యర్ధి ఓడిపోయినట్లు సీనియర్ నేతలు ముక్తకంఠంతో తేల్చిచెప్పారు. పార్టీ నేతలమధ్య సమన్వయంలేదన్న విషయం ఆ సమీక్షతో తేలిపోయింది. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో నేతల మధ్య పరిస్ధితి ఇలాగే ఉంది. ఇలాంటి నేపధ్యంలో జరిగిన పంచాయతీ పోరులో పార్టీ మద్దతుదారులు 2350 మంది గెలుస్తారని ఎవరూ ఊహించలేదు. కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచిన సీట్లలో 50శాతం సీట్లను కారుపార్టీ గెలుచుకున్నది. మూడోవిడతలో ఎన్నిపంచాయతీల్లో పార్టీ మద్దతుదారులు గెలిచారన్నది తేలాలి. ఎన్నికలు జరిగిన 3751 పంచాయతీల్లో ఎన్నింటిలో గెలిచినా పార్టీకి అది మంచి ఫలితమనే అనుకోవాలి.

ఇలాంటి సమయంలో పార్టీతో పాటు బయటకూడా కేసీఆర్ వైఖరిపైనే చర్చ జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులు గెలిచిన ఊపులో అయినా కేసీఆర్ జనాల్లోకి వస్తారా అన్నచర్చ పెరిగిపోతోంది. ఎందుకంటే తొందరలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఆతర్వాత మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. కేసీఆర్ బయటతిరగకపోయినా, బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించాలని జనాలకు పిలుపివ్వకపోయినా పార్టీ మద్దతుదారులను జనాలు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే గెలిపించారు. అదే పార్టీ టికెట్లపైన జరిగే స్ధానికసంస్ధల ఎన్నికలకన్నా ముందే కేసీఆర్ రాష్ట్రంలో తిరిగితే పార్టీకి మరింత ఊపువస్తుందని పార్టీలో చర్చ జరుగుతోంది.

ఈనెల 21వ తేదీన పార్టీ విస్తృతస్ధాయి సమావేశం, సీనియర్ నేతలతో సమీక్షకు కేసీఆర్ హాజరవుతున్నారు. మొదట్లో 19వ తేదీన జరపాలని అనుకున్న సమావేశం 21వ తేదీకి మారింది. అలాగే వచ్చేనెలలో మహబూబ్ నగర్లో భారీ బహిరంగసభ జరపాలని పార్టీ ప్లాన్ చేస్తోంది. బహిరంగసభకు కేసీఆర్ ముఖ్య అతిధిగా హాజరవుతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ముఖ్యంగా జలవనరుల వివాదాలు, సంక్షేమపథకాల హామీని తుంగలో తొక్కిందని, నిరుద్యోగం పెరిగిపోతోందని, రైతుల సమస్యలు తదితర అనేక అంశాలమీద రేవంత్ ప్రభుత్వంపై విరుచుకుపడటానికి కేసీఆర్ రెడీ అవుతున్నట్లు పార్టీవర్గాల సమాచారం.

పనిలోపనిగా రెగ్యులర్ గా కేసీఆర్ రాష్ట్రంలో పర్యటిస్తే స్ధానికసంస్ధల ఎన్నికలకు పార్టీ మరింతగా పుంజుకోవటం ఖాయమని సీనియర్ నేతలు అశాభావంతో ఉన్నారు. పార్టీనేతల ఆశాభావం, జనాల ఎదుర్కోల బాగానే ఉంది అసలు పెద్దసార్ మదిలో ఏముందో ఎవరికీ తెలీటంలేదు. ఎల్కతుర్తి బహిరంగసభ తర్వాత చేసినట్లే చేస్తారా ? లేకపోతే పార్టీకి జవసత్వాలు అందించేట్లుగా జనాల్లోకి అడుగుపెడతారా అన్నది ఆసక్తిగా మారింది.

కేసీఆర్ పై దుష్ప్రచారం : దాసోజు

పార్టీ అధినేత కెసిఆర్ కు ప్రజల్లోకి ఎపుడు రావాల్నో బాగాతెలుసునని బిఆర్ ఎస్ ఎమ్మెల్సీ, పార్టీ అధికార ప్రతినిధి డా. శ్రవణ్ దాసోజ్ అన్నారు.

“పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం మేరకే మేమంతా జనాల్లో పనిచేస్తున్నాము. అధినేత ప్రతినిధులుగా మేమంతా జనాల్లోనే పనిచేస్తున్నాము’’ అని ఆయన అన్నారు. పార్టీ కార్యక్రమాలన్నీ రెగ్యులర్ గా కేసీఆర్ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని చెబుతూ ప్రజలకు ఎక్కడ కష్టమొచ్చినా కెసిఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఆఫీసే అడ్డగా మారిపోయిందని ఆయన అన్నారు.

‘‘కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదని, అందుకే ఫామ్ హౌస్ వదిలి బయటకు రావటంలేదన్న దుష్పచారాన్ని రేవంత్ ప్రభుత్వం చేస్తోంది. ‘రేవంత్ ఇచ్చిన హామీలను నెరవేర్చటానికి, కేసీఆర్ జనాల్లో తిరగటానికి ఏమైనా సంబంధం ఉందా’’? అని సూటిగా ప్రశ్నించారు.

కేసీఆర్ బయటకురారు :అమరవాది

‘‘అధికారపార్టీకి 80శాతం ఫలితాలు అనుకూలంగా ఉంటాయని అనుకున్నా అది పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కనిపించలేదు ’’ అని సీనియర్ జర్నలిస్టు అమరవాది రవీంద్రశేషు అన్నారు. ‘‘రెండో విడత ఫలితాల్లో ప్రతిపక్షాలన్నింటితో కలిపితే కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకున్న అభ్యర్ధుల విజయం 50శాతంకన్నా తక్కువే’’ అన్నారు. ‘‘పోటీచేసిన అన్నీ పార్టీలతో పోల్చితే కాంగ్రెస్ సాధించిన విజయం పెద్ద గొప్పేమీకాదు’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘గ్రామీణ ప్రాంతాల్లోని వివిధ వర్గాలు ముఖ్యంగా రైతులు రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారన్న విషయం అర్ధమవుతోంది’’ అని చెప్పారు. ‘‘బీఆర్ఎస్ తో పోల్చితే కాంగ్రెస్ మద్దతుదారులు ఎక్కువ సీట్లలో గెలిచినా అదేమీ అంత చెప్పుకోదగ్గ విజయం కాదు’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘బీఆర్ఎస్ 60శాతం పంచాయతీల్లో గెలిచినా కేసీఆర్ జనాల్లోకి వచ్చే అవకాశం లేదు’’ అని తేల్చిచెప్పారు. ‘‘అధికారంలో ఉన్నపుడు మాత్రమే కేసీఆర్ నీళ్ళల్లో ముసలిలాగ ఉంటారని లేకపోతే ఫామ్ హౌస్ వదిలి బయటకురారు’’ అని ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News