అందరి దృష్టి ఈ ఇద్దరు ఎంఎల్ఏల మీదేనా ?

కడియం, దానంపైన అనర్హత వేటుపడేందుకు ఎక్కువ అవకాశాలున్నట్లు సమాచారం

Update: 2025-12-18 08:22 GMT
BRS Defection MLAs Kadiyam Srihari and Danam Nagendar

ఇపుడు అందరి దృష్టి ఈ ఇద్దరు ఎంఎల్ఏలపైనే నిలిచింది. ఈ ఇద్దరు అంటే ఈపాటికే అందరికీ అర్ధమైపోయుంటుంది. అవును, స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఏ(Kadiyam Srihari) కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎంఎల్ఏ (Danam Nagendar)దానం నాగేందరే. బీఆర్ఎస్(BRS)నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పదిమంది ఎంఎల్ఏల్లో కడియం, దానం రూటు మాత్రం సపరేటు. అందుకనే వీళ్ళ భవిష్యత్తుపైన పార్టీల్లో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతపై సుప్రింకోర్టు ఆదేశాల ప్రకారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ జరిపారు. కడియం, దానం తప్ప మిగిలిన ఎనిమిదిమంది ఎంఎల్ఏలు అరెకపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్, సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాసరెడ్డి, తెల్లం వెంకటరావు స్పీకర్ విచారణకు హాజరయ్యారు.

స్పీకర్ తో పాటు బీఆర్ఎస్ ఎంఎల్ఏల సమక్షంలో జరిగిన విచారణలో తాము పార్టీ మారలేదన్న వాదన వినిపించారు. అంతేకాకుండా తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామనేందుకు 8మంది ఎంఎల్ఏలు ఆధారాలను కూడా చూపించారు. ఇదేసమయంలో ఫిరాయింపులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎంఎల్ఏలు ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయారు. దాంతో బుధవారం ఐదుగురు ఎంఎల్ఏలు తెల్లం వెంకటరావు, అరెకపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లోకి ఫిరాయించలేదని స్పీకర్ తీర్పుచెప్పారు. ఈఐదుగురు కాంగ్రెస్ లోకి ఫిరాయించారు అనేందుకు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు సరైన ఆధారాలను చూపించలేకపోయినట్లు స్పీకర్ తేల్చిచెప్పేశారు.

మిగిలిన ఐదుగురిలో ముగ్గురు ఎంఎల్ఏల విషయంలో స్పీకర్ గురువారం తీర్పు చెప్పబోతున్నట్లు సమాచారం. ఆ ముగ్గురు ఎంఎల్ఏలు ఎవరంటే పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాలేయాదయ్య. వీళ్ళ విషయంలో కూడా బుధవారం తీర్పే పునరావృతమయ్యే అవకాశాలున్నాయని సమాచారం. అయితే మిగిలిన ఇద్దరిలో కడియం, దానం విషయం మాత్రమే ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే, బీఆర్ఎస్ ఎంఎల్ఏగా ఉన్న దానం నాగేందర్ కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎంపీగా పోటీచేశారు. ఒకపార్టీ ఎంఎల్ఏ మరోపార్టీ తరపున ఎంపీగా పోటీచేయటమే విడ్డూరం. అసలు ఆ ఆలోచన దానంకు ఎలావచ్చింది ? దానంకు కాంగ్రెస్ అధిష్ఠానం టికెట్ ఎలాగిచ్చింది ? అన్నది ఆశ్చర్యమే.

ఫిరాయింపుల్లో కూడా దానంది మరీ అన్యాయమనే చెప్పాలి. వడ్డించేవాడు మనవాడైతే...అన్న సామెత అన్నీ సందర్భాల్లోను పనికిరాదన్న విషయం దానం మరచిపోయినట్లున్నారు. అప్పుడు పోటీచేసి ఇపుడు సాంకేతికంగా తగులుకున్నారు. అలాగే కడియం శ్రీహరి కూడా వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా పోటీచేసిన కూతురు కడియం కావ్య ప్రతిపాదకుడిగా నామినేషన్ ఫామ్ లో సంతకం చేసి ఇరుక్కున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి నామినేషన్ ఫామ్ పై బీఆర్ఎస్ ఎంఎల్ఏ ఎలాగ సంతకం చేస్తారు ? ఇద్దరు తండ్రీ, కూతుర్లు అన్నవిషయం ఇంటికిమాత్రమే పరిమితం సాంకేతికంగా కడియం చేసింది తప్పు. అలాగే కావ్య గెలుపుకు మద్దతుగా శ్రీహరి బహిరంగంగా ప్రచారం కూడా చేశారు.

కాబట్టి కడియం, దానంపైన అనర్హత వేటుపడేందుకు ఎక్కువ అవకాశాలున్నట్లు సమాచారం. ఈ విషయాలు తెలిసిన తర్వాతే ఇద్దరు కూడా రాజీనామాలకు సిద్ధపడి ఉపఎన్నికల్లో తిరిగి పోటీచేయటానికి మానసికంగా సిద్ధమైపోయారు.

కేటీఆర్ ఆశలు గల్లంతేనా ?

‘‘పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఎలపై అనర్హతవేటుపడుతుంది, ఉపఎన్నికలు వస్తాయి, బీఆర్ఎస్ అన్నీనియోజకవర్గాల్లో బంపర్ మెజారిటీతో గెలవటం ఖాయం’’ అని కేటీఆర్ చాలాకాలంగా చెబుతున్నారు. టెక్నికల్ గా చూస్తే పదిమంది ఎంఎల్ఏలపైన అనర్హత వేటుపడే అవకాశాలు లేవని కేటీఆర్ కు కూడా బాగా తెలిసే ఉంటుంది. పదిమంది విషయంలో నానా గోలచేసి, కోర్టుల్లో కేసులు వేస్తే కనీసం రెండు నియోజకవర్గాల్లో అయినా ఉపఎన్నికలు రాకపోతాయా అని కేటీఆర్ ప్లాన్ చేసుండచ్చు. రెండు నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరిగినంతమాత్రాన బీఆర్ఎస్ గెలుస్తుందనే గ్యారెంటీ ఏమీలేదు. నేతలు, క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు, మరింతమంది ఎంఎల్ఏలు పార్టీని వదిలిపెట్టకుండా ఉండేందుకు మాత్రమే కేటీఆర్ ప్రకటనలు ఉపయోగపడతాయంతే.

నిజంగానే ఉపఎన్నికలు వస్తే అప్పుడు కేటీఆర్ సత్తా ఏమిటో తెలిసిపోతుంది. ఈమధ్యనే జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఏమైందో అందరు చూసిందే. ఉపఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి ఫలితం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రెఫరెండమే అని పదేపదే ప్రకటించిన కేటీఆర్ ఫలితం వచ్చిన తర్వాత మళ్ళీ నోరెత్తలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ 25 వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది కాబట్టే.

కోర్టులో మళ్ళీ కేసులు

ఐదుమంది ఎంఎల్ఏలు ఫిరాయింపులకు పాల్పడలేదన్న స్పీకర్ తీర్పుపై సుప్రింకోర్టులో కేసు దాఖలు చేయబోతున్నట్లు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కేపీ వివేకానందగౌడ్, పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పారు. స్పీకర్ తీర్పు అప్రజాస్వామికంగా వీళ్ళు ధ్వజమెత్తారు. రాజ్యాంగంతో పాటు చట్టాన్ని కూడా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలరాస్తున్నట్లుగా ఇద్దరు ఎంఎల్ఏలు మండిపోయారు. పదిమంది ఫిరాయింపుల మీద అనర్హత వేటుపడేంతవరకు తాము న్యాయపోరాటాన్ని ఆపేదిలేదని బీఆర్ఎస్ ఎంఎల్ఏలు స్పష్టంగా ప్రకటించారు.

బీఆర్ఎస్ కు చట్టం ఇపుడే గుర్తుకొచ్చిందా ? ఆది

బీఆర్ఎస్ ఎంఎల్ఏలకు రాజ్యాంగం, చట్టం ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతే గుర్తుకొచ్చిందా ? అని వేములవాడ కాంగ్రెస్ ఎంఎల్ఏ ఆదిశ్రీనివాస్ ఎద్దేవాచేశారు. పదేళ్ళు అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్షాలకు చెందిన 38మంది ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, ఎంపీలను కేసీఆర్ బీఆర్ఎస్ లోకి ఎలా చేర్చుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇతరపార్టీలకు చెందిన ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, ఎంపీలను బీఆర్ఎస్ లోకి చేర్చుకున్నపుడు కేటీఆర్ ఎందుకు రాజ్యాంగం, చట్టం గురించి కేసీఆర్ కు చెప్పలేదని నిలదీశారు.

కోర్టుకు వెళితే ఏమవచ్చు ?

స్పీకర్ తీర్పుమీద బీఆర్ఎస్ ఎంఎల్ఏలు మళ్ళీ సుప్రింకోర్టులో కేసులు వేస్తే ఏమవుతుంది ? ఇపుడిదే ప్రశ్న ఆసక్తిగా మారింది. అయితే స్పీకర్ ప్రకటన ప్రకారం చూస్తే ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఎల్ఏల్లో ఎనిమిదిమందికి ఏమీ కాదనే సమాధానం వినబడుతోంది. ఎందుకంటే బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి పదిమంది ఫిరాయించారు అని ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ అందుకు తగ్గట్లుగా సాక్ష్యాధారాలను చూపించలేకపోయింది. కోర్టుకు కావాల్సింది సాక్ష్యాధారాలే కాబట్టి బీఆర్ఎస్ ఎంఎల్ఏల ఫిరాయింపుల ఆరోపణలు కోర్టులో నిలబడవు. పదిమంది ఫిరాయింపులపైన అనర్హత వేటు వేయించాలని అనుకున్న బీఆర్ఎస్ మరి ఎంఎల్ఏల జీతాల్లో నుండి ఎందుకు కోతపెడుతున్నదో అర్ధంకాలేదు. పార్టీ ఫండ్ కింద బీఆర్ఎస్ ఎంఎల్ఏల జీతాల్లో ప్రతినెలా రు. 5 వేలను పార్టీ నాయకత్వం మినహాయించుకుంటున్నది. ఈవిషయాన్ని కడియం శ్రీహరి చెప్పారు. కడియం వాదనకు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈపాయింటు మీదే తాము పార్టీ ఫిరాయించలేదని పదిమంది ఎంఎల్ఏలు గట్టిగా వాదిస్తున్నారు. ఇదేవాదనను కోర్టులో కూడా ఫిరాయింపులు వినిపిస్తే అప్పుడు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు ఏమి సమాధానం చెబుతారోచూడాలి.

Tags:    

Similar News