కరెంట్ బల్బ్ చూడని చీకటి పల్లెలు!
అసలు కరెంట్ తీగ ఎలా ఉంటుందో కూడా తెలియని గ్రామం మాధవరం కుయ్యవంక.
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సౌకర్యం లేని పల్లెల సంఖ్య ఆధికారిక డేటా ప్రకారం 2018 ఏప్రిల్ 28 నాటికి రాష్ట్రంలోని అన్ని సెన్సస్ పల్లెలు విద్యుదీకరణ అయ్యాయి. అంటే, ప్రధాన పల్లెల్లో 100% విద్యుత్ సౌకర్యం అందుబాటులో ఉంది అని ప్రభుత్వ లెక్కల అంచనా. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం ప్రాంతాల్లోని చిన్న హమ్లెట్లు లేదా గుడెంలు ( tribal habitations ) ఇంకా పూర్తిగా విద్యుదీకరణ కాలేదు. 2025 రిపోర్టులు, వార్తల ప్రకారం, ఇలాంటి హమ్లెట్లు సుమారు 80 నుండి 112 వరకు ఉన్నట్లు తెలుస్తోంది ( Pderu ITDA రిపోర్ట్ 2022-23, ఎనర్జీ డిపార్ట్‌మెంట్ 2024-25 ప్లాన్ ప్రకారం రిపోర్ట్ 2022-23 ). ఎఎస్‌ఆర్ జిల్లాలో మాత్రమే 6,700కి పైగా గృహాలు ఇంకా చీకట్లలోనే ఉన్నాయి .. ఈ సమస్య పై ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణలో కొన్ని మారుమూర పల్లెల నుండి ఫెడరల్ తెలంగాణ గ్రౌండ్ రిపోర్ట్
తెలంగాణలోని, ఆసిఫాబాద్ జిల్లా తీర్యాని మండలములోని కుర్సిగూడ, బురద మడుగు, పూసిగోమ్ము, గొయన నాయకపు గూడా, ఖమ్మం జిల్లా లోని వుటావాగు, కొత్త మేడిపల్లి, భద్రాద్రి కొత్త గూడెం జిల్లా కొమరం భీమ్ నగర్, ములకలపల్లి మండలము కొర్రాజుల గుట్ట, సోయం గంగులు నగర్ లో ఇప్పటికీ విద్యుత్ వెలుగులు లేవు. ఈ పల్లెలన్నీ అటవీ ప్రాంతంలో గుట్ట ల మధ్య ఉంటాయి. రహదార సౌకర్యం లేకపోవడం ఒక కారణం అయితే అటవీ చట్టం మరోకారణం. ఈ సమస్యలను అలాగే వదిలేకుండా ఖమ్మం జిల్లా వైరాలో పోలీసు శాఖలో ఎస్.ఐగా పనిచేస్తున్న పుష్పాల రామారావు తనదైన పరిష్కారం కనుగొన్నారు.
దాదాపు 30 ఆదివాసీ తండాలు, గూడేల్లలో వందల కుటుంబాలకు సోలారు లైట్లు సమకూర్చారు. చీకటి పల్లెల్లో కాంతి రేఖలు రావడంతో చిన్నారులు ఆ వెలుగులో హోం వర్క్ చేసుకుంటున్నారు. తల్లులు వంటలు వండుకుంటున్నారు. రైతులు అవసరం ఉన్నపుడు సొలారు లైట్లతో పొలాలకు వెళ్తున్నారు.
‘ ఆదివాసీ గూడేల్లో విద్యుత్ లేక పడుతున్న కష్టాలను చూశాను. చిన్న పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. రైతులు పాముకాట్లకు గురవుతున్నారు. దీనికి పరిష్కారంగా నా జీతం నుండి కొంత కేటాయించి, కొన్ని సంస్ధల సహాయంతో లైట్లు సమకూర్చాం. మరి కొన్నిగ్రామాలను గుర్తించే పనిలో ఉన్నాం. వారికి విడతల వారీగా సోలారు లైట్లు అందచేస్తాం.’ అన్నారు రామారావు. కోవిడ్ సమయంలో కూడా ఆదివాసీలకు సాయం అందించ డానికి కృషి చేశారు రామారావు.
‘చిరుత పులి,ఏనుగుల మధ్య చీకట్లో బతుకుతున్నాం ’
అసలు కరెంట్ తీగ ఎలా ఉంటుందో కూడా తెలియని గ్రామం మాధవరం కుయ్యవంక(తవణం పల్లి మండలం,చిత్తూరు జిల్లా). చుట్టూ అడవి, మధ్యలో చిన్న పూరిళ్లలో యానాది గిరిజన తెగకు చెందిన 25 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అందరికీ రేషన్,ఆధార్ ,ఓటర్ కార్డులున్నాయి. కానీ విద్యుత్ లేదు. కిరోసిన్ గుడ్డిదీపాలతో రాత్రులు గడుపుతున్నారు. పిల్లలను బడికి పంపాలన్నా, రేషన్ సరుకులు,కిరోసిన్ తెచ్చుకోవాలన్నా 3కిలో మీటర్ల దూరంలోని మాధవరం వెళ్లాలి.
‘‘ కరెంట్ బల్బ్ ఎలా ఉంటుందో ఇప్పటికీ మాకు తెలియదు. పిల్లలు హోం వర్క్ చేయడానికి వెలుగు లేదు. కనీసం బడికి వెళ్లాలన్నా రహదారి సరిగా లేక, ఆటో కూడా రావడం లేదు. దీనివల్ల ఇరవై మంది పిల్లలు డ్రాపౌట్స్‌గా మిగిలిపోయారు’’ అంటారు గ్రామస్ధులు. ఇక్కడి ప్రజలు పశువులు,గొర్రెలను మేపుకొంటు, చిన్న కమతాల్లో కూరగాయలు పండిస్తున్నారు. గొర్రెల పై దాడి చేయడానికి తరచూ అడవి జంతువులు వీరి ఇళ్ల మధ్యకు రావడంతో అదొక జీవన్మరణ సమస్యగా మారింది.
టెన్త్ వరకు చదివిన గంగులమ్మ ఈ గ్రామంలో చదువుకున్న ఏకైక వ్యక్తి.పొలం పనులు చేసుకుంటూ సాయంత్రం పిల్లలకు చదువు చెబుతుంది.
‘‘ కరెంట్ కోసం ఎన్నోసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. తరచూ నక్కలు, ఏనుగులు మా గూడెం వైపు వస్తుంటాయి. సమీపంలో ఉన్న తుమ్మపాలెం అడవిలో చిరుత పులి సంచరిస్తుంది. వీటి నుండి కాపాడుకోవడానికి కట్టెలతో రాత్రుళ్లు మంటలు వేసుకొని కొందరు వంతుల వారీగా కాపలా కాయాల్సి వస్తోంది. సెల్ ఫోన్ ఛార్జింగ్‌కి కొండ దిగి 3 కిలో మీటర్లు దూరం పోవాలి. మాకు కనీసం వీధి లైట్లు వేసినా బాగుండేది.’’ అని మాతో ధీనంగా చెప్పింది గంగులమ్మ.
తర తరాలుగా చీకటి...
‘‘ విద్యుత్ లేక పోవడం వల్ల ఈ గ్రామం అభివృద్ధిచెందడం లేదు.పిల్లల చదువుకు దూరమవుతున్నారు. దోమల వల్ల వ్యాధులకు లోనవుతున్నారు. మాధవరం పంచాయితీకి కరెంట్ ఉన్నప్పటికీ దానిలో భాగమైన ఈ కుగ్రామానికి కరెంట్ లైన్ ఇవ్వడం లేదు. అటవీ ప్రాంతంలో ఉండటం వల్ల అటవీశాఖ అనుమతి కావాలని విద్యుత్ శాఖ అంటోంది. తరతరాలుగా వీరు చీకట్లోనే మగ్గుతున్నారు. వారు సాగు చేసుకోవడానికి మా సంస్ధ తరపున పండ్ల మొక్కలు,కూరగాయల విత్తనాలు ఇచ్చాం. దాంతో జీవనోపాధిని పొందుతున్నారు. ’’ అంటున్నారు వీరి తరపున విద్యుత్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతూ కృషి చేస్తున్న మాస్ ఎన్జీఓ సంస్ధ డైరెక్టర్ సునంద.
తూరుపు కనుమల్లో చీకటి పల్లెలు
విశాఖ ఏజన్సీలో విసిరేసినట్టున్న గ్రామాలు గత్తుం, జంగం పుట్టు, గున్నమామిడి.ఇవన్నీ పాడేరు ఐటీడీఏ గ్రామాలు. అరకు వ్యాలీ నుండి పాడేరు వెళ్లే దారిలో ఈ గ్రామాలుంటాయి. ‘గత్తుం’ వరకు మాత్రమే రహదారి ఉంది.మిగిలిన గ్రామాలకు కాలిబాటలో అటవీ మార్గంలో 4 కిలో మీటర్లు నడిచి వెళ్లాలి. ఇక్కడి జనం కిరోసిన్ గుడ్డి దీపాల్లో బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. గున్నమామిడిలో విద్యుత్ లేదు. మిగతా గ్రామాలకు కరెంట్ పోల్స్ వేసినా వారానికో సారి విద్యుత్ వస్తే గొప్ప అంటారు ప్రజలు. ఈ కొండ ప్రాంతంలో గాలులు విపరీతంగా వీయడం వల్ల కరెంట్ తీగెలు తెగి పడుతుంటాయి. లైన్ మేన్ కోసం కబురు చేయాలన్నా సెల్ ఫోన్ ఛార్జింగ్ ఉండదు. సిగ్నల్స్ పనిచేయవు.
విద్యుత్ లేని గత్తుం( paderu ) అంగన్ వాడీ కేంద్రం
మా చుట్టూ, అడవి జంతువులు..
,’’ కరెంట్ లేక పోవడం వల్ల చీకటి పడితే బయటకు రాలేం, పొలాలకు వెళ్లలేం.చుట్టూ కొండలు మధ్యలో మా గ్రామం. అడవి జంతువులు మా చుట్టూ తిరుగుతుంటాయి.వీటి నుండి కాపాడుకోవడానికి మాకు కనీసం సోలారు లైట్లయినా కావాలి మూడేళ్ల క్రితం ఇంటికో సోలారు లైట్‌ను రామకృష్ణమిషన్ వారు పంచారు. కానీ అవికూడా రిపేర్లు వచ్చి మూలన పడ్డాయి. ’’ అంటారు గత్తుం గ్రామస్దులు. ఇక్కడ ఒక అంగన్ వాడీ కేంద్రం ఉంది కానీ దానికీ కరెంట్ లేదు. ఇరవై మంది చిన్నారులు, కొందరు గర్బినీ స్త్రీలు రోజూ ఇక్కడికి వస్తారు.
సుమారు ఏడు వందల మంది ఈ మూడు గ్రామాల్లో జీవిస్తున్నారు. అక్కడక్కడా కొన్ని విద్యుత్ పోల్స్ వేశారు. ఒక్క వీధి లైట్ కూడాలేదు. ఒక్కో పోల్ మధ్య దూరం 300 నుండి 400 మీటర్లు వరకు ఉంటుంది. దాని వల్ల గాలులకు తెగి పడుతుంటాయి. కొన్ని చోట్ల గ్రామస్ధులే అనధికారికంగా పోల్స్ వేసుకోవడం మా దృష్టికి వచ్చింది.
విద్యుత్ లేదు. ఉన్న సోలారు లైట్లు చెడిపోయాయి అంటున్నారు గత్తుం గిరిజనులు
చీకట్లో 172 గ్రామాలు
‘‘ విజయ నగరం, విశాఖ,శ్రీకాకుళం జిల్లాల్లో రెండేళ్ల క్రితం విద్యుత్ లేని 172 గ్రామాలను గుర్తించి సోలారు లైట్లు ఇచ్చాం. కానీ అవి తాత్కాలికమే,వారికి విద్యుత్ సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తే గ్రామాలు మెరుగవుతాయి. ఆ గ్రామాలకు ఇప్పటికైనా కరెంట్ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి త్వరలో క్షేత్ర పర్యటన చేయబోతున్నాం.’’ అని రామకృష్ణామిషన్ ఆశ్రమ కార్యదర్శి ఆత్మవిదానంద అన్నారు.
విద్యుత్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం
‘‘ కొన్ని గ్రామాలకు విద్యుత్ లేని మాట నిజమే. అవి కొండల మీద ఉండటం వల్ల వైర్లు వెళ్లవు. కొన్ని చోట్ల విద్యుత్ లైన్‌లు ఉన్నా కరెంట్ లేక పోవడానికి కారణం తరచూ విద్యుత్‌తీగలు చోరీకి గురవుతుంటాయి. గ్రామస్తులు పోలీసు కంప్లైంట్ ఇస్తేనే మేం ఆ సమస్యను పరిష్కరిస్తాం. కానీ గ్రామస్తులు ముందుకు రారు. ఈ ప్రాంతమంతా ఒరిస్సా సరిహద్దుల్లో ఉండటం వల్ల అక్కడి నుండి వలస వచ్చిన కొన్ని కుటుంబాలు చిన్న ఆవాసాలుగా ఏర్పడతాయి. వారు స్ధిరంగా ఉండక తరచూ మారుతుంటారు. అలాంటి వారికి విద్యుత్ ఇవ్వడం కష్టం. అయినప్పటికీ ప్రతీ ఇంటికీ విద్యుత్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. పోల్స్ వేయడానికి వీలు కాని చోట సోలార్ విద్యుత్ ఇస్తున్నాం.’ అని పాడేరు ఏజెన్సీ విద్యుత్ శాఖ ఉద్యోగి ఒకరు చెప్పారు.
ఈ సమస్యకు ప్రధాన కారణాలు:
1,అడవుల మధ్య కొండల్లో,లోయల్లో ఉన్న హమ్లెట్లకు విద్యుత్ లైన్లు విస్తరించడం కష్టం. రోడ్లు లేకపోవడం వల్ల పనులు ఆలస్యమవుతాయి. కొన్ని ఆవాసాలు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉంటాయి కాబట్టి అక్కడ విద్యుత్ ఇవ్వడానికి ఫారెస్ట్ అధికారులు సుముఖంగా ఉండరు అని పుష్పాల రామారావు చెప్పారు.
2, గుట్టల మీద విసిరేసినట్టు అక్కడక్కడా చాలా చిన్న గుడెంలలో 10-20 గృహాలు మాత్రమే ఉంటాయి, కాబట్టి విస్తరణ ఖర్చు ఎక్కువగా ఉంటుందని కొందరు విద్యుత్ శాఖ అధికారులు అంటున్నారు.
ఉదాహరణకు, బురుగా (Buruga ) , చిన్న కోనెల ( Chinna Konela ) హమ్లెట్లు అల్లూరి సీతారామరాజు ( Alluri Sitharama Raju - ASR ) జిల్లాలో ఉన్నాయి. ఇవి అనంతగిరి మండలం, రొంపల్లి ( (Rompalle ) పంచాయతీ పరిధిలోని దూరపు గిరిజన హమ్లెట్లు. ఈ ప్రాంతం గిరిజనులు ముఖ్యంగా కొండ దొర తెగలు నివసించే పర్వత ప్రాంతం. స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాల తర్వాత ఇక్కడ విద్యుత్ సౌకర్యం ఇటీవలే (2025 ఫిబ్రవరి నాటికి) అందింది.
3, పరిపాలన, ఆర్థిక సమస్యలు: ప్రభుత్వ పథకాలు ( DDUGJY, SAUBHAGYA, RDSS ) ప్రధాన పల్లెలపై దృష్టి పెట్టాయి, చిన్న హమ్లెట్లకు ఆలస్యం. గ్రిడ్ సరఫరా లేకపోవడం, డాక్యుమెంట్ల సమస్యలు కూడా కారణాలు.
ప్రస్తుతం PM-JANMAN, RDSS వంటి పథకాల ద్వారా ఈ హమ్లెట్లకు ఆఫ్-గ్రిడ్ సోలార్ , గ్రిడ్ విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయని అని అధికారులు అంటున్నారు కానీ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేక పోతున్నారు.