బీజేపీ ఆఫీసుల ముందు కాంగ్రెస్ భారీ ధర్నా

నేషనల్ హెరాల్డ్, ఉపాధీ హామీ పథకం అంశాలలో బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చేస్తుందన్న కాంగ్రెస్.

Update: 2025-12-18 07:21 GMT

తెలంగాణలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసు దీనికి అద్దం పడుతోందన్నారు. అంతేకాకుండా ఇటీవల జాతీయ ఉపాధి హామీ పథకం మార్చడంలో కూడా బీజేపీ కావాలనే గాంధీ పేరును తొలగించిందని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముందు కాంగ్రెస్ నేతలు భారీ ధర్నా చేపట్టారు. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా హైటెన్షన్ నెలకొంది. ఈ విషయం తెలిసిన వెంటనే బీజేపీ కార్యాలయాల వద్దకు భారీ సంఖ్యలో పోలీసులు చేరుకుని, భద్రతా చర్యలు చేపట్టారు.

తెలంగాణ వ్యాప్తంగా ధర్నా నిర్వహించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లోని బీజేపీ కార్యాలయాలను ముట్టడించడానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని గాంధీ భవన్ దగ్గర భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.

 

‘బీజేపీ పదేళ్లుగా వేధిస్తోంది’

నేషనల్ హెరాల్డ్ కేసులో పదేళ్లుగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను బీజేపీ ప్రభుత్వం వేధిస్తోందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. అందులో భాగంగానే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఎఫ్ఐఆర్‌లో కూడా యాడ్ చేసిందని అన్నారు. కానీ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు మాత్రం ఈడీ కేసులను తప్పుబట్టిందని గుర్తు చేశారు. బీజేపీ చేసిన అరాచకాలకు డీసీసీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరపాలని మహేష్ కుమార్ ఆదేశించారు. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ అనుబంధ సంఘాలు నిరసనలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

 

మేం చూస్తూ కూర్చోం: రామచందర్

కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. తమ కార్యాలయాలను ముట్టడిస్తామంటే తామేమీ చూస్తూ కూర్చోమన్నారు. ప్రతిఘటిస్తామని, ఒక్కొక్కరి తాటతీస్తామని రామచందర్ రావు అన్నారు. కార్యాలయాల ముట్టడులు, ధ్వంసం చేయడాలు మంచి సంస్కృతి కాదని అన్నారు. విచారణ సంస్థలకు, బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏం జరిగింది అనేది విచారణ సంస్థలు, కోర్టులు చూసుకుంటాయని అన్నారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికే కాంగ్రెస్ ఈ ముట్టడులకు ప్లాన్ చేస్తోందన్నారు.

Tags:    

Similar News