హెటిరో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రజాందోళన
బొంతపల్లిలో ఉన్న హెటిరో డ్రగ్స్ యూనిట్-1ని తక్షణమే మూసేయాలనే డిమాండుతో గ్రామంలోని ఆడ, మగ, పిల్లా, పెద్దా అంతా ర్యాలీ చేశారు.
ప్రముఖ ఔషదాల తయారీ సంస్ధ హెటిరో డ్రగ్స్ కు వ్యతిరేకంగా దోమడుగు గ్రామస్తులు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. సంగారెడ్డి(Sangareddy) జిల్లాలోని గుమ్మడిదల మండలంలో దోమడుగు గ్రామంకు దగ్గరలోనే హెటిరో(Hetero Drugs) సంస్ధ ఉంది. సంస్ధ నుండి ప్రతిరోజు విషవాయువులు గ్రామాన్ని కమ్మేస్తున్నట్లు జనాలు శనివారం మధ్యాహ్నం పెద్దఎత్తున నిరసన ర్యాలీని నిర్వహించారు. గాలి, నీరు, ఆహారాన్ని ఫ్యాక్టరీలో నుండి వస్తున్న వాయువులు విషపూరితం చేస్తున్నట్లు గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేశారు. కాబట్టి బొంతపల్లిలో ఉన్న హెటిరో డ్రగ్స్ యూనిట్-1ని తక్షణమే మూసేయాలనే డిమాండుతో గ్రామంలోని ఆడ, మగ, పిల్లా, పెద్దా అంతా ర్యాలీ చేశారు.
అనారోగ్య వాతావరణం నుండి తమను కాపాడాలని, చెరువు, భూగర్భజలాలు, వ్యవసాయం, పశుపోషణను కాపాడాలని డిమాండ్లు చేస్తు పెద్దగా నినాదాలిచ్చారు. ఫ్యాక్టరి నుండి బయటకు వస్తున్న విషవాయువుల వల్ల భూగర్భజలాలు విషంగా మారిపోతున్నట్లు ఆరోపించారు. వ్యవసాయభూములను కూడా విషవాయువులు నాశనం చేస్తున్నట్లు మండిపడ్డారు. వేలాది జనాల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్న హెటిరో కంపెనీని శాశ్వతంగా మూసేయాలని జనాలు డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ నుండి ఇంతపెద్దఎత్తున విషవాయువులు బయటకు వచ్చి జనాలను ఇబ్బందిపెడుతుంటే ప్రభుత్వం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఏమిచేస్తున్నారంటు జనాలు నిలదీశారు. ఫ్యాక్టరీని మూసేంతవరకు పోరాటం ఆపేదిలేదని గ్రామస్తులు ర్యాలీలో నినాదాలిచ్చారు. మరి వీరి సమస్యను ప్రభుత్వం పట్టించుకుంటుందా ?