ఐదంతస్తుల భవనాన్ని కూల్చేసిన హైడ్రా
సర్వే నెంబరును మార్చేసిన సంస్ధ అపార్టమెంట్లు కట్టడమే కాకుండా అనేకమందికి అమ్మేసింది
మియాపూర్లో నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనాన్ని శనివారం ఉదయం హైడ్రా కూల్చేసింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి, సర్వే నెంబర్లు మార్చిన ఒక నిర్మాణ సంస్ధ భారీ అపార్టమెంటును నిర్మిస్తోంది. ఈ నిర్మాణంపై స్ధానికులు హైడ్రా(HYDRAA)కు అనేక ఫిర్యాదులు చేశారు. సర్వే నెంబరును మార్చేసిన సంస్ధ అపార్టమెంట్లు కట్టడమే కాకుండా అనేకమందికి అమ్మేసింది. ఇదే విషయాన్ని స్ధానికులు హైడ్రాకు ఫిర్యాదుచేశారు. ఫిర్యాదులను పరిశీలించిన హైడ్రా నిజమే అని నిర్ధారణ చేసుకుని ఈరోజు ఉదయం రంగంలోకి దిగింది.
నిర్మాణం దగ్గరకు చేరుకున్న హైడ్రా అధికారులు యాజమాన్యంతో మాట్లాడారు. స్ధలానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకురావాలని సూచించారు. యాజమాన్యం తరపున కొందరు వచ్చి డాక్యుమెంట్లను చూపించారు. హెచ్ఎండీఏ ప్రకారం మియాపూర్లో 100 సర్వే నెంబర్ మాత్రమే ఉండగా డాక్యుమెంట్లలో 100/ 307, 308 సర్వేనెంబర్లున్నట్లుగా నమోదయ్యుంది. దీంతో అనుమానం వచ్చిన అధికారులు రెవిన్యు శాఖ అధికారులతో మాట్లాడితే 100 సర్వే నెంబర్లో 307, 308 అన్ననెంబర్లే లేవని క్లారిటి ఇచ్చారు. దాంతో డాక్యుమెంట్లను సంస్ధ యాజమాన్యం తప్పుగా మార్చేసిందని అర్ధమైంది.
తప్పుడు డాక్యుమెంట్లతోనే యాజమాన్యం అపార్టమెంట్లను కట్టేస్తు కొందరికి అమ్మేసింది కూడా. విషయం పూర్తిగా అర్ధమైన హైడ్రా అధికారులు వెంటనే నిర్మాణాన్ని నిలిపివేయటమే కాకుండా కూల్చివేతలు మొదలుపెట్టేశారు. ప్రభుత్వ స్ధలంలో తప్పుడు డాక్యుమెంట్లతో యాజమాన్యం అపార్టమెంట్ కడుతున్నట్లు హైడ్రా ప్రకటించింది. అందుకనే భవనాన్ని కూల్చేస్తున్నట్లు చెప్పింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్తగా హైడ్రా అధికారులు భారీగా పోలీసులను మోహరించారు.