‘వందేళ్లలో ఇదే తొలిసారి’
ప్రధాని మోదీని ఛాలెంజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.;
తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తుంటే గుజరాత్ వాళ్లకి కడుపుమంట దేనికి అని సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీసీ బిల్లులపై ఢిల్లీలోని జంతర్‌మంతర్ కూడలిలో తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు ‘పోరుబాట’ పేరిట మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగానే ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు ఆమోదం తెలపకపోతే మిమ్మల్ని గద్దె దించడానికి కూడా వెనకాడమంటూ రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్ బిల్లులను అడ్డుకుని బలహీనవర్గాలకు అన్యాయం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు.
ఈ ధర్నాలో పార్లమెంట్ లో ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన పలువురు పార్లమెంట్ సభ్యులు పాల్గొని ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న తెలంగాణ సంకల్పానికి మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగానే 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా శాసనసభలో విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదముద్ర వేయాలని డిమాండ్ చేశారు రేవంత్. ‘‘రాబోవు రోజుల్లో దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో కులగణన తెలంగాణ నమూనా దేశానికి ఆదర్శంగా, రోల్ మాడల్ గా నిలుస్తుంది. ఫిబ్రవరి 4, 2024 రోజున ప్రారంభించి సరిగ్గా ఏడాది కాలంలో 4 ఫిబ్రవరి 2025 నాటికి సర్వే పూర్తి చేసి రిజర్వేషన్లు కల్పిస్తూ పరిష్కార మార్గం చూపించాం’’ అని వ్యాఖ్యానించారు.
‘‘ఆ రిజర్వేషన్లను సాధించుకోవడానికే సడక్ నుంచి సంసద్ వరకు వచ్చాం. యావత్ దేశం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోంది. వందేళ్లలో ఇలాంటి ప్రక్రియ చేపట్టలేదు. రాష్ట్రాలను పాలించిన దాదాపు మూడు వందల మంది ముఖ్యమంత్రులు ఎవరూ చేయలేని సాహసం తెలంగాణ మంత్రిమండలి విజయవంతంగా పూర్తి చేసింది. తెలంగాణ శాసనసభ చేసిన బిల్లులు, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ గవర్నర్ ద్వారా రాష్ట్రపతి గారికి చేరి నాలుగు నెలలైనా ఆమోదముద్ర పడలేదు. ఆ నేపథ్యంలోనే చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టాం’’ అని హెచ్చరించారు.
‘‘తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన బీసీ రిజర్వేషన్లకు వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది పార్లమెంట్ సభ్యులు మద్దతుగా నిలబడ్డారు. జంతర్ మంతర్ ధర్నాతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కుతాయని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. మా డిమాండ్ ను ఆమోదించాలి. రిజర్వేషన్లు సాధించే వరకు నిద్రపోం. ఈ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో నినదించిన విషయాలను తెలంగాణ గ్రామ గ్రామాన చేరవేయాలి. ఒక గొప్ప లక్ష్యంతో ఢిల్లీ వేదికగా పోరాటం సాగిస్తున్నాం. రాష్ట్రపతి గారు మా బిల్లులను వెంటనే ఆమోదించండి..” అని విజ్ఞప్తి చేశారు.