నిర్మాత విశ్వ ప్రసాద్ వ్యాఖ్యలపై మండిపడ్డ సినీ కార్మికులు
హైదరాబాద్ లో సినీ కార్మికుల భారీ నిరసన ర్యాలీ;
By : B Srinivasa Chary
Update: 2025-08-10 09:30 GMT
తెలుగు చిత్ర పరిశ్రమ పూర్తిగా స్థంభించిపోయిది. సినీ కార్మికుల ఆందోళన ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నిర్మాత విశ్వ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన కార్మిక యూనియన్లపై కేసు వేయడాన్ని సినీ కార్మికులు తీవ్రంగా పరిగణించారు. ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో ర్యాలీ కూడా నిర్వహించారు. ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికులు ఆందోళన చేపట్టారు. వేతనాలు పెంచాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనలో 24 క్రాప్ట్ యూనియన్లకు చెందిన సినీ కార్మికులు పాల్గొన్నారు.
సినీ కార్మికుల వేతనాలకు సంబంధించిన అంశం మరింత సమస్యాత్మకంగా మారింది. నిర్మాతలు, కార్మిక సంఘాలకు మధ్య జరిగిన చర్చలు కొలిక్కిరాలేదు. నిర్మాతలు మూడు కేటగిరీలుగా విభజించి, కార్మికుల వేతనాల్ని పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు తేల్చేశారు. అయితే, నిర్మాతల వైఖరిపై కార్మిక సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ఆదివారం నుంచి తమ ఆందోళన తీవ్రతరం చేస్తామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద ఆదివారం ఉదయం సినీ కార్మికులు ఆందోళన చేపట్టారు.
వరుసగా సమ్మెలో పాల్గొనడంతో సినీ కార్మికుల పూట గడవడమే కష్టంగా మారింది. వరుసగా ఎనిమిది రోజుల పాటు షూటింగ్స్ లేకపోవడం వల్ల వారి ఆదాయం పూర్తిగా పడిపోయింది. సినీ కార్మికులకు, నిర్మాతలకు మధ్య జరుగుతున్న చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. 30 శాతం వేతనాలు పెంచేవరకు షూటింగ్స్ లో పాల్గొనొద్దు అని ఫిల్మ్ ఫెడరేషన్ సినీ కార్మికులకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే నిర్మాతలకు, కార్మికుల మధ్య ఉన్న వివాదంలో తాను జోక్యం చేసుకోనని చిరంజీవి స్పష్టం చేశారు. తాను కార్మికుల తరపున మాట్లాడుతున్నట్లు వచ్చిన ప్రచారాన్ని మెగాస్టార్ ఖండించారు. వ్యక్తిగతంగా ఎవరమూ జోక్యం చేసుకోవడం కుదరదని, సినిమా వివాదాలను పరిష్కరించడానికి ఫిలిం ఛాంబర్ వుందని ,అదే ఈ సమస్య కు ముగింపు పలుకుతుందన్నారు.
అన్నపూర్ణ 7 ఎకర్స్ నుంచి ఫిలిం ఫెడరేషన్ కార్యాలయం వరకు జరిగిన ర్యాలీ సందర్బంగా ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్ మాట్లాడుతూ "మూడేళ్ల నుంచి సినీకార్మికులకు జీతాలు పెంచలేదు. 30 శాతం జీతాలు పెంచేవరకు షూటింగ్స్ లో పాల్గొనబోయేది లేదని ఖరాఖండిగా చెప్పారు. ‘‘ పనిగంటలు, వేతనాల సమస్యలు పరిష్కరిస్తేనే షూటింగ్స్ కు వస్తాం. ఎవరైతే 30 శాతం వేతనాలు పెంచారో వారి షూటింగ్స్ లో పాల్గొంటున్నాం’’ అని ఆయన అన్నారు.
‘‘సినీ కార్మికుల పొట్ట కాలితే షూటింగ్స్ కు వస్తారు’’ అని నిర్మాత విశ్వ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలకు వల్లభనేని ఆక్షేపణ వ్యక్తం చేశారు. ‘‘మేమేమి గొంతెమ్మకోర్కెలు అడగడం లేదు. ఈ సంవత్సరం 20శాతం, వచ్చే రెండేళ్ల తర్వాత 10 శాతం పెంచమని మాత్రమే అడిగాం’’ అని ఆయన అన్నారు. ‘‘నిర్మాతలు ఏడాదికో పర్సంటేజి చెబుతున్నారు. ఫైటర్స్, డాన్సర్స్, టెక్నీషియన్లకు పెంచమని చెబుతున్నారు. సినీ కార్మికులందరికీ సమానంగా వేతనాలు పెంచాల్సిందే’’ అని వల్లభనేని అన్నారు. కార్మికులను చులకన చేసి మాట్లాడిన నిర్మాత విశ్వ ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఫిలిం ఫెడరేషన్ కు విశ్వ ప్రసాద్ 90 లక్షలు బాకీ ఉన్నాడు. ఆయనకు ఏదేని ఇబ్బంది ఉంటే ఫిలించాంబర్ కు ఫిర్యాదు చేసుకోవచ్చు. అంతేగాని ఎక్కడపడితే అక్కడ సిని కార్మికులను చులకన చేసి మాట్లాడుతున్న విశ్వ ప్రసాద్ వైఖరిని నిరసిస్తూ ఫిల్మ్ చాంబర్ ముట్టడిస్తామని వల్లభనేని హెచ్చరించారు.
‘‘24 వేల కార్మికులకు ఫెడరేషన్లో సభ్యత్వం ఉంది. వీళ్లంతా అమరణ నిరాహారదీక్షకు సిద్దమయ్యారు’’ అని ఆయన అన్నారు. విశ్వ ప్రసాద్ పై ఫిర్యాదు చేయడానికి ఫెడరేషన్ సినీ పెద్దలను కలవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సోమవారం కలవనుంది.
ఇతర రాష్ట్రాల వారిని రానివ్వం
ఇతర రాష్ట్రాల వారిని షూటింగ్స్ పాల్గొనకుండా అడ్డుకుంటాం అని ఫెడరేషన్ నేతలు చెప్పారు. స్కిల్స్ లేవని కార్మికులను అవమానిస్తున్నారన్నారు.ఈ సందర్భంగా 30 శాతం పెంపుపై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డిని ఫెడరేషన్ నేతలు అభినందించారు.
యూనియన్లపై కేసు
సినీ కార్మికులు నిర్మాతల మధ్య చర్చలు ఓ వైపు కొనసాగుతుండగా పీపుల్స్ మీడియా అధినేత విశ్వ ప్రసాద్ కోర్టు ను ఆశ్రయించారు. యూనియన్లపై ఆయన కేసు వేయడం సినీ కార్మికులకు అగ్రహం తెప్పించింది.ప్రొడక్షన్ యూనియన్ అధ్యక్షుడు బాసాటి వెంకట కృష్ణకు విశ్వ ప్రసాద్ లీగల్ నోటీసులు పంపారు.