నిరుద్యోగుల ర్యాలీలో బిజెపి, బిఆర్ ఎస్ తన్నులాట

గ్రూప్-1 అభ్యర్ధుల ఆందోళనలో క్రెడిట్ తీసుకోవటానికే రెండుపార్టీలు పోటా పోటీ

Update: 2024-10-19 10:46 GMT
Central minister Bnadi Sanjay

ఒకవైపు తమ డిమాండ్ల సాధనకోసం గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రాయబోతున్న వేలాదిమంది అభ్యర్ధులు తీవ్రస్ధాయిలో ఆందోళనలు చేస్తున్నారు. పరీక్షలకు కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉన్న అశోక్ నగర్ ఏరియాలో రకరకాల రూపాల్లో నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. శనివారం ఉదయం నుండి కూడా అభ్యర్ధులు ఆందోళన చేస్తునే ఉన్నారు. ఆందోళనలు జరుగుతుంటే సహజంగానే అక్కడకు ప్రతిపక్షాలు చేరుకుంటాయని అందరికీ తెలిసిందే. ఈ పద్దతిలో ఉదయం కేంద్రమంత్రి బండి సంజయ్ అశోక్ నగర్ చేరుకున్నారు. అభ్యర్ధులను ఉద్దేశించి మద్దతుగా పోరాటంలో పాల్గొంటానని ప్రకటించారు. అభ్యర్ధులు డిమాండ్ చేస్తున్న జీవో 29 రద్దుచేసేంతవరకు బీజేపీ మద్దతుగా నిలబడుతుందని, పోరాటాలు చేస్తుందని హామీ ఇచ్చారు.




 చాలాసేపు అక్కడే ఆందోళనలో పాల్గొన్న బండి చివరకు అభ్యర్ధులతో కలిసి పాదయాత్రగా సచివాలయం వైపు బయలుదేరారు. అశోక్ నగర్ నుండి ఇందిరాపార్క్ మీదుగా లిబర్టీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం మీదుగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ కిందనుండి సచివాలయం చేరుకునేందుకు బండి ప్రయత్నించినపుడు పోలీసులు అడ్డుకున్నారు. ఎప్పుడైతే అభ్యర్ధులకు మద్దతుగా బండి వచ్చారో వెంటనే ఆయన మద్దతుదారులు, బీజేపీ నేతలు, క్యాడర్ అంతా చేరుకున్నారు. దాంతో పై ఏరియాలంతా తీవ్ర ఉద్రిక్తత పెరిగిపోయింది. ఈ విషయాన్ని గమనిస్తున్న బీఆర్ఎస్ నేతలు వెంటనే అలర్టయ్యారు. అభ్యర్ధులకు అండగా కేంద్రమంత్రి బండి రోడ్డుపైన కూర్చోవటం, ర్యాలీని లీడ్ చేయటంతో బీజేపీ బాగా హైలైట్ అయ్యింది. దాంతో వెంటనే బీఆర్ఎస్ నేతలు వాలారు, క్యాడర్ కూడా రంగంలోకి దిగింది .



 సచివాలయంలోకి ప్రవేశించేందుకు బండి, బీజేపీ నేతలు, అభ్యర్ధులు చేసిన ప్రయత్నాలను పోలీసులు గట్టిగానే అడ్డుకున్నారు. దాంతో సచివాలయం ప్రాంతంలో తీవ్ర ఉద్రక్తత చోటు చేసుకున్నది. వీళ్ళ గోల ఇలాగుండగానే ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు నుండి కారుపార్టీ నేతలు దాసోజు శ్రవణ్ తదితరులు తమ క్యాడర్ తో సచివాలయంపైపు బయలుదేరారు. కారుపార్టీ నేతలు, క్యాడర్ను పోలీసులు అడ్డుకున్నా తోసుకుని బీఆర్ఎస్ నేతలు తెలుగుతల్లి ఫ్లై ఓవర్ దగ్గరకు చేరుకున్నారు. రెండుపార్టీల నేతలు ఒకచోటకు చేరుకోవటంతో పార్టీ నేతలు, క్యాడర్ల మధ్య బాగా తోపులటలు జరిగింది. ఒకవైపు బండి సంజయ్, బీజేపీ కార్యకర్తలు, అభ్యర్ధులు, మరోవైపు బీఆర్ఎస్ నేతలు, క్యాడర్, కొందరు అభ్యర్ధులు చెరోవైపు మోహరించటంతో ట్యంక్ బండ్ ఏరియాలో హైటెన్షన్ వాతావరణం పెరిగిపోయింది. సచివాలయంలోకి చొచ్చుకుని పోయేందుకు ఒకవైపు బండి+బీజేపీ క్యాడర్ ప్రయత్నిస్తే మరోవైపు నుండి బీఆర్ఎస్ నేతలు, క్యాడర్ కూడా ప్రయత్నించారు. దాంతో రెండుపార్టీల నేతలు, క్యాడర్ మధ్య తీవ్రమైన తోపులాట జరిగింది. ఇదంతా చూసిన వారికి గ్రూప్-1 అభ్యర్ధుల ఆందోళనల్లో క్రెడిట్ తీసుకోవటానికే పై రెండుపార్టీలు ప్రయత్నించినట్లు అర్ధమైంది.

ర్యాలీ లో పాల్గొన్న బీ ఆర్ ఎస్ నాయకులు వెళ్లిపోవాలని  బీజేపీ నాయకులు నినాదాలు చేశారు. బిజెపికి వ్యతిరేకంగా  బిఆర్ఎస్ నినాదాలు చేసింది. ఇది కొట్టు కునేదాకా వెళ్లింది.  బీ ఆర్ ఎస్ నాయకులు దాసోజ్ శ్రవణ్, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ ను అక్కడి నుంచి  పంపించేశారు.

ఉద్రిక్త పరిస్ధితులను అదుపులోకి తేవటంలో భాగంగా వేరేదారిలేక పోలీసులు బండి సంజయ్ ను వాహనంలోకి బలవంతంగా ఎక్కించిన పోలీసులు నాంపల్లిలోని బీజేపీ ఆఫీసుకు తీసుకెళ్ళి వదిలిపెట్టేశారు. అదే సమయంలో బీర్ఎస్ నేతలను కూడా పోలీసులు విడిగా వాహనాల్లోకి ఎక్కించి మరో వైపు తీసుకెళ్ళిపోయారు. దాంతో కొంతమేరకు ట్యాంక్ బండ్, సచివాలయం, తెలుగుతల్లి ఫ్లైఓవర్ ఏరియాల్లో ఉద్రిక్తతలు తగ్గాయి. బహుశా సోమవారం సుప్రింకోర్టు విచారణ జరిగి తీర్పు వచ్చేంతవరకు పరిస్ధితులు ఇలాగే ఉంటాయా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Tags:    

Similar News