దొంగ ఓట్ల వివాదం.. డిఫెన్స్‌లో పడ్డ బీజేపీ..

దొంగ ఓట్లని కాంగ్రెస్ మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్న బండి సంజయ్.;

Update: 2025-08-26 06:42 GMT

దొంగ ఓట్ల వివాదం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారింది. ఈ అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. ముఖ్యంగా బీజేపీ నేతలంతా దొంగ ఓట్లతో గెలిచారంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణలో బీజేపీకి ఉన్న ఎనిమిది మంది ఎంపీలు అందరూ కూడా దొంగ ఓట్ల సహాయంతోనే గెలిచారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఈ వివాదం ఇంతలా ముదురుతున్న క్రమంలో బీజేపీ డిఫెన్స్‌లో పడిపోయిందన్న చర్చ పుంజుకుంది. దొంగ ఓట్లతో గెలవాల్సిన కర్మ తమకు లేదని కానీ? చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేయడం కానీ? ఎన్నికల్లో పోల్ అయిన ఓట్లపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేయడం కానీ బీజేపీ చేయకపోవడమే ఈ చర్చకు మూలకారణంగా కనిపిస్తోంది. దీంతో దొంగ ఓట్ల అంశం తెలంగాణలో కీలకంగా మారింది. తాజాగా ఈ అంశంపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఆయన సైతం దర్యాప్తు వంటివి డిమాండ్ చేయకపోవడం ఈ చర్చలకు మరింత ఊతమిచ్చింది.

ప్రజలను అవమానించడమే: బండి సంజయ్

దొంగ ఓట్లంటూ నోటికొచ్చిన ఆరోపనలు చేస్తున్న కాంగ్రెస్‌కు కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలంటూ బండి సంజయ్ మండిపడ్డారు. తాను 30 ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్నానని, వార్డు మెంబర్ కానివాళ్లు కూడా విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలకు బండి కౌంటర్ ఇచ్చారు. ‘‘దొంగ ఓట్లు అంటూ కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. అది ప్రజలను అవమానించడమే. అధికారంలోకి వచ్చాక పంచాయతీలకు కాంగ్రెస్ సర్కార్ పైసా అయినా ఇచ్చిందా? కేంద్రం నిధులు ఇస్తుందనే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రాత్రిపూట యాత్రలు చేయడం ఏంటో నాకర్థం కావట్లేదు. రెండు చోట్ల ఓట్లు వేయడం ఎవరికయినా సాధ్యమవుతుందా? కనీస అవగాహన లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఓట్ల చోరీ గురించి కాకుండా సీట్ల చోరీ గురించి మాట్లాడాలి. రొహింగ్యాల విషయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. దేశం ముఖ్యమా? ఓటు బ్యాంకు ముఖ్యమా?అప్పుడు భారత రాష్ట్ర సమితి.. ఇప్పుడు కాంగ్రెస్‌.. రెండూ అదే తరహా రాజకీయాలు చేస్తున్నాయి’’ అని మండిపడ్డారు బండి.

ఎదురుదాడితో బీజేపీ బచావ్ అవుతుందా..?

అయితే దొంగ ఓట్ల వివాదం ముదురుతున్న క్రమంలో బీజేపీ ఎంత వరకు ఇలాంటి ఎదురుదాడి, విమర్శలతో బీజేపీ బచావ్ కాలేదని రాజకీయ విశ్లేషకలు అంటున్నారు. కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు బీజేపీపై నెగిటివ్ ప్రభావం చూపే అవకాశం ఉందని, కాబట్టి ఈ విషయంలో బీజేపీ వీలైనంత త్వరగా క్లీన్ చిట్ తీసుకోవాలని సూచిస్తున్నారు. అదే విధంగా దొంగ ఓట్ల అంశం నిగ్గు తేల్చడం కోసం దర్యాప్తును కోరాలని, అంతేతప్ప కాంగ్రెస్‌పైనా, ఆ పార్టీ నేతలపై విమర్శలు చేయడం వల్ల ఒరిగేదేమీ లేదని విశ్లేషకులు సూచిస్తున్నారు. వీరి విమర్శల్లో ఘాటు పెంచే కొద్ది అది బీజేపీకే మైనస్ అవుతుందని, కాంగ్రెస్ ఆరోపణల్లో నిజం ఉండబటటే బీజేపీ నేతలు భయపడి విమర్శలతో గట్టెక్కాలని చూస్తున్నారన్న భావన ప్రజల్లో అధికం కావొచ్చని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ విషయంపై బీజేపీ నెక్స్ట్‌ స్టెప్ ఏం తీసుకుంటుందో చూడాలి.

మహేష్ కుమార్ ఏమన్నారంటే..

బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారన్న తన మాటలకు తాను కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. తెలంగాణ బీజేపీ ఎంపీల గెలుపుపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఈ క్రమంలోనే వారి గెలుపును పునఃపరిశీలించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని వివరించారు. నిజామాబాద్ జిల్లాలో కూడా దొంగ ఓట్లు ఉన్నాయని, దానిని తాను నిరూపిస్తానని అన్నారు. మహారాష్ట్రలో కోటి దొంగ ఓట్లు ఉన్నాయని మహేష్ కుమార్ ఆరోపించారు. నిజామాబాద్‌లో అనేక మంది మహారాష్ట్ర ప్రజలకు ఓట్లు ఉన్నాయని, కరీంనగర్‌లోని ఓ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో 69 ఓట్లు ఉన్నాయని ఆయన అన్నారు. ఓట్ల చోరీ చేయాల్సిన అవసరం ఉన్నది బీజేపీకి మాత్రమేనని ఆరోపించారు.

Tags:    

Similar News