సమాజానికి హెచ్చరికగా మారాల్సిన తీర్పు..

కఠిన శిక్షలు విధిస్తున్న పోక్సో కోర్టులు.;

Update: 2025-08-26 07:53 GMT

నల్లగొండ జిల్లాలో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు మహ్మద్ కయ్యుమ్‌కు జిల్లా పోక్సో న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. అతడికి 50 సంవత్సరాల కఠిన కారాగారా శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ తీర్పును పోక్స్ కోర్టు ఇన్‌ఛార్జ్ రోజారమణి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పు సమాజానికి ఒక హెచ్చరికాగా నిలవాలన్నారు. రోజురోజుకు బాలికలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని, వాటిని కరికట్టాలంటే కఠినమైన శిక్షలు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. అప్పుడే బాలికలకు భద్రత పెరుగుతుందని, తప్పు చేయాలంటే ఒకరైనా వెనకడుగు వేస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే ఈ కేసులో నిందితుడికి పోక్సో చట్టం కింద 20 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద 20 ఏళ్లు, కిడ్నాప్ కేసు కింద 10 సంవత్సరాల చొప్పున మొత్తం 50 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగిందని ఆమె వివరించారు.

బాధితపై బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు మహ్మద్ కయ్యుమ్‌పై 2021లో తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 2022 నుంచి ఈ కేసు పోక్సో కోర్టు విచారణలో ఉంది. ఇరు వర్గాల వాదనలు, పోలీసులు సేకరించిన సాక్ష్యాలు, ఫోరెన్సిక్ ఆధారాలు వంటి అన్ని అంశాలను పరిశీలించిన న్యాయస్థానం మంగళవారం తన తీర్పును వెలువరించింది. నిందితుడు కయ్యుమ్‌ను దోషిగా నిర్ధారించింది. ఈ మేరకు అతడికి శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు. అయితే తెలంగాణలో పోక్సో చట్టం కింద అత్యధిక శిక్ష విధించిన కేసులలో ఇది ఒకటిగా నిలిచింది.

డబుల్ డెత్ పెనాల్టీ..

ఇలాంటి కొన్ని ఇతర కేసుల్లో కూడా పోక్సో కోర్టు‌లు కఠినమైన శిక్షలు విధించాయి. అందుకు నల్లగొండ జిల్లాలో జరిగిన మైనర్ బాలిక హత్యాచారం కేసు ఒక పెద్ద ఉదాహరణ. ఇందులో నిందితుడికి స్థానిక న్యాయస్థానం మరణశిక్షతో పాటు జరిమానా కూడా విధించింది. ఈ ఘటన 2013లో జరిగింది. ఆ ఏడాది ఏప్రిల్‌లో నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలిక కనిపించకుండా పోయింది. మరుసటి రోజే స్థానికంగా ఓ మాంసాహార దుకాణంలో పనిచేస్తున్న మహమ్మద్ ముకరమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో విస్తుబోయే నిజాలు తెలిశాయి. స్థానకంగా టీ ప్యాకెట్లు అమ్ముకునే బాలికపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతి కిరాతకంగా హతమార్చి.. బాలిక మృతదేహాన్ని ఆమె ఇంటికి సమీపంలోని డ్రైనేజీలో పడేశాడు.

ఈ కేసులో దాదాపు 12 సంవత్సరాల విచారణ తర్వాత న్యాయస్థానం నిందితుడికి రెండు మరణశిక్షలు విధించింది. వాటిలో ఐపీసీ సెక్షన్ 302(హత్య) కింద ఒకటి కాగా మరొకటి పోక్సో చట్టం కింద విధించారు. అంతేకాకుండా నిందితుడికి రూ.1.10 లక్షల జరిమానాతో పాటు బాధిత కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కూడా న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది.

మైగ్రెంట్ వర్కర్‌కు ఉరి శిక్ష

అదే విధంగా సంగారెడ్డి జిల్లా భానూర్‌లో 2023లో న్యాయస్థానం మరో సంచలన తీర్పును వెలువరించింది. ఐదేళ్ల దళిత బాలికను హత్యాచారం చేసిన కేసులో బీహార్‌కు చెందిన 57 ఏళ్ల గఫఫర్ అలి వ్యక్తికి సంగారెడ్డి పోక్సో న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. అంతేకాకుండా బీహార్‌కు చెందిన బాధిత కుటుంబానికి ప్రత్యేక న్యాయమూర్తి జయంతి రూ.10 లక్షల పరిహారాన్ని అందించారు. నిందితుడు అలి, బాధితురాలి కుటుంబం బీహార్ నుంచి వలస కూలీలుగా సంగారెడ్డికి వచ్చారు. భానూర్‌లో నిర్మిస్తున్న బిల్డింగ్‌లోనే కూలీలుగా వారు నివాసం ఉంటున్నారు. ఒకరోజు బాదితురాలికి ఆమె అమ్మమ్మతాతయ్య.. సెక్యూరిటీ గార్డ్‌కు కేర్‌లో ఉంచి వేరే చోట పనికి వెళ్లారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న అలీ.. ఆ అమ్మాయిని సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి తీసుకుని వెళ్లాడు. బాధితురాలి అమ్మమ్మతాతయ్య భోజనం చేయడానికి వచ్చిన సమయంలో సెక్యూరిటీ గార్డ్ వాళ్లకు.. బాధితురాలికి అలీ తీసుకెళ్లాడని చెప్పాడు. దాంతో అనుమానం వచ్చిన వృద్ధ దంపతులు.. బాధితురాలు, అలీ కోసం వెతకడం ప్రారంభించారు. అదే సమయంలో పోలీసులకు కూడా వాళ్లు సమాచారం ఇచ్చారు.

ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. చాక్లెట్లు, బిస్కెట్లు ఇప్పిస్తానని బాధితురాలిని నమ్మించి అలీ తనతో తీసుకెళ్లాడని, ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేశాడని నిర్ధారించారు. అన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు.. అలీని కోర్టు ముందు ఉంచారు. అన్నీ పరిశీలించిన న్యాయస్థానం అలీని దోషిగా నిర్ధారించి ఉరి శిక్ష విధించింది.

Tags:    

Similar News