హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలో విజయం మాదే..!
ఎంఐఎం కోట గోడలు బద్దలు కొడతాం. ప్రజలంతా మావైపే ఉన్నారన్న కిషన్ రెడ్డి.;
కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి
హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ అంతా కూడా బీజేపీ, ఎంఐఎం మధ్యనే ఉంది. ఈ ఎన్నికలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దూరం పాటిస్తున్నాయి. కాంగ్రెస్.. ఎంఐఎంకు మద్దతు పలకనుంది. ఈ క్రమంలో శుక్రవారం బీజేపీ, ఎంఐఎం పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ తరపున స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో గౌతమ్‌రావు నిలుస్తున్నారు. అదే విధంగా ఎంఐఎం తరుపున మాజీ ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ హసన్ బరిలో ఉన్నారు. వీరిద్దరూ ఇప్పటికే తమ నామినేషన్లు కూడా దాఖలు చేశారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి అనురాగ్ జయంతికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ ఎన్నికలను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా ఎంఐఎంను ఓడించాలని, హైదరాబాద్‌లో తమ జెండాను ఎగరవేయాలని బీజేపీ భావిస్తోంది. కాగా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించి తమకు తిరుగులేదని నిరూపించుకోవాలని ఎంఐఎం అనుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఎన్నికలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించి ఎంఐఎం కోట గోడలను బద్దలు కొడతామని అన్నారు. ఈఎన్నికల్లో ఎవరు ఎంత ప్రయత్నించినా విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఎవరు ఉంటే వాళ్లతో అంటకాగి హైదరాబాద్‌ను దోచుకోవడం ఎంఐఎంకు పరిపాటి అయిందంటూ చురకలంటించారు. ఈ సారి వారి ఆటలు సాగవని, వారికి తిరుగులేదనుకుంటున్న హైదరాబాద్‌లోనే వారి కోటను బద్దలు కొడతామని పునరుద్ఘాటించారు. సంఖ్యా బలం ఉంటే బీజేపీనే గెలిచేదని.. సంఖ్యా బలం లేదు కాబట్టే ఓటింగ్ జరుగుతోందన్నారు.
ఈ నియోజకవర్గంలో మొత్తం 120 మంది ఓటర్లు ఉన్నారు. కాగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, సరైన అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దేశంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టే విధంగా, హిందువులకు, హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇచ్చే పార్టీ మజ్లిస్ పార్టీ అంటూ మండిపడ్డారు. గతంలో హైదరాబాద్‌లో అనేక సార్లు మతకలహాలు ప్రేరింపించిందని ఆరోపించారు. అలాంటి పార్టీ అభ్యర్థి ఎన్నికను ఏకగ్రీవం చేయడానికే కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు పోటీ నుంచి తప్పుకున్నాయని, అంతేకాకుండా ఇప్పుడు కూడా తెరచాటు నుంచి పూర్తి మద్దతు పలుకుతున్నాయని విమర్శించారు. ఎంఐఎంకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ బానిసత్వంతో ఉండే పార్టీలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా తమ అభ్యర్థే గెలుస్తారని, హైదరాబాద్‌లో కాషాయజెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికలకు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధం లేదని అన్నారు. ప్రజల ఆకాంక్షలను గౌరవించి మజ్లిస్ పార్టీని ఓడించాలని... బీజేపీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా ఓటర్లను కోరారు. పార్టీలో అంతర్గత విబేధాలు ఉండటం సహజమని చెప్పుకొచ్చారు.