‘రాహుల్‌కు సీబీఐ వద్దు..రేవంత్‌కు సీబీఐ ముద్దు’

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగించడంపై శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన;

Update: 2025-09-01 07:25 GMT

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణను కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించడంపై బీఆర్ఎస్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది.తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ శాసన సభలో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మండలి ఛైర్మన్‌ పోడియాన్ని ఎమ్మెల్సీలు చుట్టుముట్టి నినాదాలు చేశారు.కాళేశ్వరం కమిషన్‌ నివేదిక ప్రతులను భారత రాష్ట్ర సమితి సభ్యులు చించివేసి ఛైర్మన్‌ వైపు విసిరారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు.

‘రాహుల్‌కు సీబీఐ వద్దు..రేవంత్‌కు సీబీఐ ముద్దు’ అంటూ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. సభ్యుల తీరుపై మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పోడియం వద్దకు రావొద్దని,కేటాయించిన స్థానాల్లోనే నిరసన తెలపాలని సూచించారు.
బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్యే మండలిలో మంత్రులు బిల్లులను ప్రవేశపెట్టారు. పంచాయతీరాజ్‌ చట్టసవరణ, పురపాలక సంఘాల చట్టసవరణ, అల్లోపతి ప్రైవేటు వైద్య సంరక్షణ సంస్థల చట్టం రద్దు బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశ పెట్టగా , విపక్ష నిరసనల మధ్యే బిల్లులు సభ ఆమోదం పొందాయి.
Tags:    

Similar News