శరవేగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు

పర్యవేక్షించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Update: 2025-11-10 12:57 GMT
Secundeabad Railway Station Modernization

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను కేంద్రమంత్రి పరిశీలించారు.

దక్షిణ భారత దేశంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ప్రత్యేక స్థానం ఉందని ఆయన అన్నారు. అమృత్ భారత్ పథకం 714 కోట్ల రూపాయలతో ఈ స్టేషన్ ఆధునీకరించనున్నట్టు కిషన్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ప్రతీ రోజు లక్షా 97వేల మంది ప్రయాణికులు వస్తుంటారని, ప్రతీ గంటకు 23 వేల మంది ప్రయాణికుల ఆక్యుపెన్సీ ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రయాణికులతో కిటకటలాడే రైల్వే స్టేషన్ లో ఆధునాతన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు.

నూతన నిర్మాణ పనులలో భాగంగా సౌత్ మెయిన్ బిల్డింగ్, మల్టీ లెవల్ కార్ పార్కింగ్, ట్రావెలర్ తో కూడిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు.

సౌత్ సైడ్ బ్లాక్ నిర్మాణ పనులు మరో నాలుగు నెలల్లో పూర్తవుతాయని, మొత్తం పునర్ నిర్మాణ పనులు మరో 13 నెలల్లో పూర్తవుతాయని కిషన్ రెడ్డి చెప్పారు. శంషాబాద్ ఎయిర్ పోర్టును తలపించేలా నిర్మిస్తున్నామని తెలిపారు.స్టేషన్ లో 26లిప్ట్ లు, 32 ఎస్కలేటర్లు, రెండు సబ్ స్టేషన్లు, అడ్వాన్స్ డ్ సెక్యురీటీ సిస్టం, 5 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్, 5 లక్షల లీటర్ల సీవెజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ అందుబాటులోకి రానున్నాయి.

ఒకేసారి రైల్వే స్టేషన్ కు 2  లక్షల 70 వేల ప్రయాణికులు వచ్చినా సేవలు అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు.


Tags:    

Similar News