ఎంఎల్ఏలు, ఎంఎల్సీపై చర్యలకు ఈసీ ఆదేశం

కాంగ్రెస్ ఎంఎల్ఏలు బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్, బీఆర్ఎస్ ఎంఎల్సీ శంకర్ నాయక్ మంగళవారం ఉదయం పోలింగ్ కేంద్రాలన్నింటినీ తిరుగుతున్నారు

Update: 2025-11-11 05:40 GMT
Jubilee Hills by poll

ఓటర్లను ప్రభావితం చేయటానికి ప్రయత్నించిన ఎంఎల్ఏలు, ఎంఎల్సీపై ఎన్నికల కమీషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. పోలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించటానికి ప్రయత్నించిన ఇద్దరు ఎంఎల్ఏలు, ఒక ఎంఎల్సీపై కేసు నమోదుచేయాలని పోలీసులను ఈసీ ఆదేశించింది. కాంగ్రెస్ ఎంఎల్ఏలు బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్, బీఆర్ఎస్ ఎంఎల్సీ శంకర్ నాయక్ మంగళవారం ఉదయం యూసుఫ్ గూడ డివిజన్ లోని పోలింగ్ కేంద్రాలన్నింటినీ తిరుగుతున్నారు. ఒక కేంద్రం దగ్గర ఇద్దరు ఎంఎల్ఏలు, మరో కేంద్రం దగ్గర బీఆర్ఎస్ ఎంఎల్సీ ఓటర్లతో మాట్లాడటమే కాకుండా పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళటానికి ప్రయత్నించారు. ఈ విషయమై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదులు అందాయి. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించిన ఎన్నికల కమీషన్ అధికారులు ఇద్దరు ఎంఎల్ఏలు, ఒక ఎంఎల్సీపై వెంటనే కేసులు నమోదుచేయాలని పోలీసులను ఆదేశించింది.

పోలింగ్ కేంద్రం దగ్గర అభ్యర్ధులకు ప్రచారం చేయటం ఎన్నికల చట్టం ప్రకారం నిషేధం. అలాగే పోలింగ్ కేంద్రాల్లోకి కూడా వెళ్ళకూడదు. పోలింగ్ కేంద్రంలోకి అభ్యర్ధి లేదా అభ్యర్ధి తరపున ప్రధాన ఏజెంటుగా వ్యవహరిస్తున్న వ్యక్తి మాత్రమే వెళ్ళగలరు. అభ్యర్ధి అయినా ప్రధాన ఏజేంట్ అయినా పోలింగ్ జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా గమనించేందుకు మాత్రమే వెళ్ళాల్సుంటుంది. ఏవైనా సందేహాలుంటే ఎన్నికల అధికారులతో మాట్లాడచ్చంతే. ఓటింగ్ వేయటానికి కేంద్రంలో ఉన్న ఓటర్లతో మాట్లాడేందుకు లేదు. అయితే ఇక్కడ ఎంఎల్ఏలు, ఎంఎల్సీ పోలింగ్ కేంద్రంలో బారులుతీరిన ఓటర్ల దగ్గర ప్రచారంచేయటంతో పాటు పోలింగ్ కేంద్రంలోకి ఎంటర్ అవటానికి ప్రయత్నించటం తప్పు. నిజానికి నియోజకవర్గంతో సంబంధంలేని ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఉపఎన్నిక జరుగుతున్న నియోజవకర్గంలో ఉండేందుకు కూడా లేదు. అందుకనే వీళ్ళముగ్గురిపైన కేసులు నమోదుచేయాలని పోలీసులను ఎన్నికల కమీషన్ ఆదేశించింది.

Tags:    

Similar News